Saturday, December 20, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు'ఉపాధి' రక్షణ కోసం ఉద్యమాలు

‘ఉపాధి’ రక్షణ కోసం ఉద్యమాలు

- Advertisement -

22న ప్యాట్నీ గాంధీ విగ్రహం వద్ద నిరసన
23న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
నరేగా నిధుల్లో కేంద్రం వాటా తగ్గించడం సరిగాదు
ఉపాధి చట్టం నిర్వీర్యాన్ని ఖండించండి
చట్టపరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు : మీడియా సమావేశంలో వామపక్ష పార్టీల నేతలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యూపీఏ ప్రభుత్వ హయాంలో కొట్లాడి సాధించుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు గ్రామీణ ప్రజలంతా పోరాటాల్లోకి రావాలనీ, ఈ నెల 22న సికింద్రాబాద్‌ ప్యాట్నీలోని గాంధీ విగ్రహం వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయ్రపదం చేయాలని వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. 23న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ…ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి కేంద్రం తన వాటాను 90 నుంచి 60 శాతానికి తగ్గించుకోవడం, రాష్ట్రాల వాటాను 10 నుంచి 40 శాతానికి పెంచడం నిర్వీర్యం చేయడంలో భాగమేనని విమర్శించారు.

ఉపాధి పనిముట్లు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ముసాయిదా బిల్లులో పేర్కొనడం దుర్మార్గమన్నారు. పట్టణ ప్రాంతాలకు ‘ఉపాధి’ని విస్తరించాలనే డిమాండ్‌ ను పట్టించుకోకుండా ఉన్న కూలీల సంఖ్యను తగ్గించి కుదించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఆ చట్టాన్ని వీబీ జీ రామ్‌జీ గా మార్చడాన్ని తప్పుబట్టారు. ఇలా చేయడం గాంధీని అవమానించడమేనన్నారు. ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు చేస్తామని ప్రకటించారు. ఉపాధి పనిదినాలను 200 రోజులకు పెంచాలనీ, రోజువారీ కూలి రూ.600 ఇవ్వాలనీ, కేంద్ర బడ్జెట్‌లో 2.5 లక్షల కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ మాట్లాడుతూ… రాముడి సెంటిమెంట్‌తో, మతం మత్తుతో ప్రజలను మభ్యపెడుతూ దేశ సంపదను మోడీ సర్కారు కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని విమర్శించారు. ఓ పక్కన ఇందిరాగాంధీ, నెహ్రూ, గాంధీ మీద రాజకీయ దాడి చేస్తూనే మరోవైపు దేశంలో కమ్యూనిస్టులు లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం అన్ని పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్థన్‌ మాట్లాడుతూ… మోడీ సర్కారు భావజాల రంగంలో వేగంగా తీసుకొస్తున్న మార్పుల గురించి వివరించారు. అదే సమయంలో కార్పొరేట్ల లాభాలకు అటంకంగా ఉన్న వ్యవసాయ, కార్మిక చట్టాలను మారుస్తూ పోతున్నదని విమర్శించారు.

సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హన్వేష్‌ మాట్లాడుతూ..జాయింట్‌ పార్లమెంటరీ, స్టాండింగ్‌ కమిటీలో కనీసం చర్చ పెట్టకుండా ఏకపక్షంగా బిల్లును పార్లమెంట్‌లో ఎలా ప్రవేశపెడ్తారని ప్రశ్నించారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ..ప్రజల ముందు రాష్ట్ర ప్రభుత్వాలను బదనాం చేసి తాను బలపడేందుకు మోడీ సర్కారు చట్టాల్లో మార్పులు చేసుకుంటూ పోతున్నదన్నారు. కార్పొరేట్ల ఆస్తులను రెట్టింపు చేసేందుకు జైశ్రీరాం పేరును వాడుకుంటున్నదని విమర్శించారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నేత ఆర్‌.వీ. ప్రసాదర్‌ మాట్లాడుతూ..పథకానికి రాముడి పేరు అర్థం వచ్చేలా పెట్టి పేదల పొట్టగొట్టేలా నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్‌, అబ్బాస్‌, సీనియర్‌ నేత డీజీ నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -