వెల్లడించిన బీహార్ అధికారులు
న్యూఢిల్లీ : బీహార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఒక ముస్లిం మహిళా డాక్టర్ ‘నఖాబ్’ తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, ఆ డాక్టర్ తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని బహిష్కరించారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే శనివారం నుంచి ఆమె విధుల్లోకి చేరతారని అధికారులు తెలిపారు. ఈ నెల 15న పాట్నాలోని సచివాలయంలో ఆయుష్ వైద్యులకు నియామక లేఖలు అందిస్తున్న సమయంలో నుస్రత్ పర్వీన్ అనే ముస్లిం మహిళ నితీశ్ కుమార్ వద్దకు వచ్చిన సమయంలో ఆయన ఒక్కసారిగా ఆ మహిళ నఖాబ్ (ముసుగు)ను తొలగించారు. ‘ఇది ఏమిటి’ అని కూడా నితీశ్ కుమార్ ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పాటు, అనేక పశ్చిమాసియా దేశాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాకు అనుగుణంగానే ముస్లిం సంప్రదాయాలను నితీశ్ కుమార్ అగౌరవపరిచారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అలాగే, నుస్రత్ పర్వీన్ ఉద్యోగంలో చేరడానికి నిరాకరిస్తున్నారని కూడా కొంత మంది తెలిపారు. అయితే వీటిని పాట్నాలోని ప్రభుత్వ టిబ్బి కాలేజ్, ఆస్పత్రి ప్రిన్సిపాల్ మహఫూజుర్ రెహమాన్ ఖండించారు. శనివారం నుంచి పర్వీన్ విధుల్లోకి చేరుతున్నట్టు స్పష్టం చేశారు. ‘ఈ విషయంపై నేను పర్వీన్ కుటుంబం, స్నేహితులతో మాట్లాడాను. డిసెంబర్ 20న ఆమె విధుల్లో చేరుతుందని వారు నాకు చెప్పారు. అయితే ఆమె ముందుగా ప్రభుత్వ టిబ్బి కాలేజ్, ఆస్పత్రిలో చేరాలి. తరువాత ఆమెను పోస్టింగ్ స్థానానికి బదిలీ చేస్తారు’ అని రెహమాన్ శుక్రవారం మీడియాకు తెలిపారు. కాగా, బీహార్ మంత్రి దిలీప్ జైస్వాల్ ఈ ఘటనపై మాట్లాడుతూ ‘ఈ అంశంపై అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక చర్యలు తీసుకుంటుంది’ అని తెలిపారు.
నితీశ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలి : ఇల్టిజా ముఫ్తీ డిమాండ్
ఒక ముస్లిం మహిళా డాక్టర్ ‘నఖాబ్’ తొలగించినందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నాయకులు ఇల్టిజా ముఫ్తీ శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీనగర్‌లోని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని ఇతర పార్టీలు కూడా నితీష్ కుమార్ చర్యను ఖండించాయి. అవామి ఇత్తెహాద్ పార్టీ ప్రతినిధి ఇనామ్ ఉన్ నబీ మాట్లాడుతూ ‘నితీశ్‌కుమార్ చర్య ముఖ్యమంత్రి పదవిపై మిగిలి ఉన్న నైతిక విశ్వసనీయతను కూడా తొలగిస్తుంది. సీఎం ప్రవర్తన అనుచితమైనది. అవమానకరమైనది. అహంకారంతో నిండినది’ అని విమర్శించారు. అలాగే, శ్రీనగర్‌లోని చారిత్రాత్మక జామా మసీదు వద్ద సమావేశంలో మతాధికారి మీర్వాయిజ్ ఉమర్ మాట్లాడుతూ నితీశ్‌కుమార్ చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ చర్య వ్యక్తిగత గౌరవం, నైతిక సరిహద్దులను తీవ్రంగా ఉల్లంఘించడమేని స్పష్టం చేశారు.
నేటి నుంచి విధుల్లోకి ‘మహిళా డాక్టర్’
- Advertisement -
- Advertisement -



