సుమధుర ఆకాశం ఆత్మీయ వర్షం కురిపిస్తూ
గురుత్వాకర్షణపు ఆహ్వాన పత్రమయ్యింది
స్టేడియమంతా అక్షర ప్లానెట్‌గా మారి
ఆలోచనల రాకెట్లకు స్వాగత ద్వారమయ్యింది..!
రండి కలుద్దాం..
నవచైతన్య స్ఫూర్తి గీతికలై నడుద్దాం
సిద్ధాంతాల వైరుధ్యాల
సారూప్యతా పరిమళాల
చిరునవ్వులతో పలకరించుకుందాం
విభిన్నభాషల సాంకేతికతల
ప్రకాశ కిరణాల అనునాదాన్ని
జ్ఞాపకాల దారుల్లో సృష్టిద్దాం
కవితా సుగంధాల సామాజిక
సాంస్కృతిక శాంతి వచనాలతో
విప్లవగానాల స్వేచ్ఛా స్వేదపు
ప్రేమ సంగీత రాగాలతో
జ్ఞాన గెలాక్సీలను మానవతా
విశ్వవనంలో పెంచుకుందాం
పిల్లల కలల కావ్యాలకు
హద్దులు లేని రెక్కలనిద్దాం
పెద్దల అనుభవాల తాత్వికతకు
దార్శనికత వేదికలమవుదాం
అన్ని వర్గాల వర్ణాల జీవిత సారాంశ
చర్చల కాగితాల్లో పాఠ్యాంశమవుదాం
విజ్ఞాన పతంగులను హృదయ వీధుల్లో
అనంత దిశల్లో ఎగురవేద్దాం
కథల్లో పాత్రలకు జీవం పోస్తూ
నవలలను సరికొత్తగా విరచిస్తూ
కుల మత ప్రాంతాలకతీతమైన
కవి సమ్మేళనాల పుస్తకాల పండుగను…
పర్యావరణ పరిరక్షణ ప్రేరణాసంద్రమై
శూన్యంలో కాంతి వేగంతో కదులుతూ..
మనసు తీరాలపై ఆనందాల
బిగ్ బ్యాంగ్ తరంగాలను నిర్మిద్దాం..!
రండి కలుద్దాం…
మన గుండె వీణలను మీటుతూ
సాయంత్రాల స్నేహా వీచికలను…
కాలం కలంకు కానుకగా ఇద్దాం..!
- ఫిజిక్స్ అరుణ్ కుమార్,
9394749536



