Sunday, December 21, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరాముడి కన్నీళ్లు..

రాముడి కన్నీళ్లు..

- Advertisement -

పొద్దున్నే ఆలయాన్ని తెరిచాడు పూజారి. ప్రతిరోజూ గర్భగుడిని ఆయనే శుభ్రం చేసి రామ్‌లల్లాకు అభ్యంగన స్నానం చేయించి ఆ తర్వాతే భక్తుల దర్శనానికి వీలు కల్పించటం అక్కడి ఆచారం. గర్భగుడిని శుభ్రం చేసిన తర్వాత రామ్‌లల్లా విగ్రహానికి స్నానం చేయించటానికి అన్నీ సిద్ధం చేసుకుంటు న్నాడు పూజారి. భక్తులు కూడా మెల్లిగా వస్తున్నారు.
రామ్‌లల్లాకు స్నానం చేయించటానికి దగ్గరికి వెళ్లిన పూజారి ఆశ్చర్యపోయాడు. అప్పటికే రామ్‌లల్లా మొఖం తడిసిపోయి ఉంది. తనకన్నా ముందు గుడి తలుపులు ఎవరూ తెరిచే అవకాశమే లేదు. రామ్‌లల్లా మొఖం ఎవరు కడిగి ఉంటారు? అంతా తన భ్రమ అనుకున్నాడు. రామ్‌లల్లాకు స్నానం చేయించి, వస్త్రంతో తుడిచి రామ్‌లల్లా నుదిట తిలకం దిద్దబోయాడు! రామ్‌లల్లా కళ్ల నుండి నీళ్ల ధారగా కారుతున్నాయి! పూజారి గుండె పిండేసినట్లయింది! రామ్‌లల్లా ఎందుకు కన్నీరు కారుస్తున్నాడో తెలియదు!

”తండ్రి నీ కంట కన్నీరా? ఎందుకు స్వామి? లోకాల కన్నీళ్లు తుడవాల్సిన నీవే కన్నీరు పెడితే మాకు దిక్కెవరు?” అంటూ పూజారి చేతులు జోడించి విలవిల్లాడిపోయాడు!
”కన్నీరు కార్చక ఇంకేమి చేయాలి నాయనా?” అడిగాడు రామ్‌లల్లా.
”స్వామి నావల్ల ఏమి అపరాధము జరిగిందో సెలవియ్యండి! తప్పు దిద్దుకుంటాను!” అంటూ పూజారి చెంపలు వేసుకున్నాడు.
”చీ వల్ల ఎలాంటి అపరాధము జరగలేదు!” అన్నాడు రామ్‌లల్లా కన్నీరు కారుస్తూనే.
”స్వామీ, మీరు కన్నీరు కార్చకండి! చూడలేకపోతున్నాను! ఇక్కడికి వచ్చే భక్తుల వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? చెప్పండి. సరిదిద్దుతాను!” అన్నాడు పూజారి రామ్‌లల్లా కన్నీళ్లు తుడుస్తూ బాధతో.

”నా కోసం వచ్చే భక్తులు ఆపరాధం ఎందుకు చేస్తారు నాయనా?” రామ్‌లల్లా కన్నీళ్లు ఆగటం లేదు.
పూజారి చేతిలోని వస్త్రం పూర్తిగా తడిచిపోయింది. భుజం మీదు వున్న కండువాతో రామ్‌లల్లా కన్నీళ్లు తుడుస్తున్నారు. కాని పూజారికి కుడా దుఃఖం తన్నుకొస్తోంది!ఎన్నడూ ఇలా జరగలేదు. రామ్‌లల్లా ఎందుకు ఇంతగా బాధపడుతున్నాడో?
”మరి ఎందుకు కన్నీరు పెడుతున్నారు స్వామి!” అడిగాడు పూజారి.
‘నా కన్నీళ్లకి ఎన్ని కారణాలు ఉన్నాయి! నా పేరు మీద ఎన్నో దారుణాలు చేస్తున్నారు! పేదలకి ఉపయోగపడే మహాత్మాగాంధీ రోజ్‌గార్‌ యోజన పేరు మార్చినారు!” అన్నాడు రామ్‌లల్లా.
”పేరు మారిస్తే బాధేందుకు స్వామి? జీరాంజీ అని మీ పేరే పెట్టినారు కదా!” అన్నాడు పూజారి ఆశ్యర్యంగా.

”పిచ్చివాడా! ఆ చట్టం పేరు మార్చటంతో పాటు, అది పేద ప్రజలకు ఉపాధి కల్పించకుండా చేశారు! 100 రోజుల నుండి 125 రోజులకి ఉపాధి పెంచినట్లు చూపించి, పెంచిన ఉపాధికి గ్యారెంటీ లేకుండా చేసి, పేదల పొట్టలు కొట్టనున్నారు! ఇలాంటి స్కీముకి నాపేరు పెట్టి, పేదలకు ఉపయోగపడని నా పేరును బద్నాం చేస్తున్నారు నాయనా!” అన్నాడు రామ్‌లల్లా
”పేదలకు నష్టం చేసే స్కీముకి మీ పేరు పెట్టడం నిజంగా అన్యాయమే స్వామీ!” అన్నాడు పూజారి చెంపలు వేసుకుంటూ.
”మన దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఎదురుగా ఉన్న మనుషులు కూడా కన్పించనంత కాలుష్యం! అయినా సరే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు! మసిబూసి మారేడుకాయ చేశారన్న సామెత లాగా, కాలుష్యం ఉన్న చోట నీళ్లు చిలకరించి మీటర్లను మభ్య పెడుతున్నారు! కాలుష్యానికి కారణం రైతులే అంటూ, దేశ విదేశాలు తిరుగుతూ, ఆయా దేశాల్లో బిరుదులు సన్మానాలు పొందుతూ, ఎంజాయ్ చేస్తున్నారు. మరి కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ప్రజలను ఎవరు కాపాడతారా?” ప్రశ్నించాడు రామ్‌లల్లా.
పూజారికి ఏం చెప్పాలో తోచలేదు. రామ్‌లల్లా ప్రజల గురించే మాట్లాడుతున్నాడు! కాని ఏలినవారికి ప్రజల గురించిన పట్టింపులేదు!

”నా కన్నీటికి మరో కారణం ఉన్నది! మీ పాలకులు ఒక ప్రార్థనా మందిరాన్ని కూల్చివేశారు !” అన్నాడు రామ్‌లల్లా.
”ముప్పయి మూడేండ్ల కింద కూల్చిన ప్రార్థనా మందిరాన్ని గురించి ఇపుడు ఎందుకు చెబుతున్నారు స్వామీ! అయినా అది ముందు మీ మందిరమే కదా! దానిపై ఇతర మతస్తులు వారి ప్రార్థనా మందిరాన్ని నిర్మిస్తే మేము ఎంతకాలం భరించాలి! అందుకే దాన్ని కూల్చి మీకు భవ్య రామ మందిరాన్ని నిర్మించి మా నాయకుడు సనాతన ధర్మ పరిరక్షణ చేశాడు. అది ముమ్మాటికి చేయదగిన కార్యమే!” అన్నాడు పూజారి ఆవేశంగా.

”ఆవేశపడకు నాయనా! మీ నాయకుడి మీదున్న నమ్మకంతో ధర్మ పరిరక్షణ గురించి, నాకే ధర్మపన్నాలు చెబుతున్నావు! నీవు చెప్పినది ఏనాడో ముగిసింది! నేను చెప్పేది నిన్న ఢిల్లీలో కూల్చేసిన 1,400 ఏండ్ల నాటి శివాలయం గురించి! ధర్మం గురించి 24 గంటలూ నీతి బోధ చేసే సంస్థ ఆఫీసు వద్ద పార్కింగ్‌ కోసం శివాలయాన్ని, నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు! వీళ్లే కదా వారణాసి గురించి గొప్పలు చెబుతారు! వారణాసిలోని శివుడూ, ఢిల్లీలో కూల్చేసిన శివుడూ ఒక్కటి కాదా? మీ నాయకుడు కొలిచే శివుడేమో గొప్పవాడు, పేదలు మొక్కే శివుడు పనికిరాని వాడా? పూజలందుకుంటున్న ఆలయాన్ని కూల్చేయమని సనాతన ధర్మం చెప్పిందా? పార్కింగ్‌ కోసం ఒక పురాతన ఆలయాన్ని కూల్చేస్తారా? ఇది శివద్రోహం కాదా? అపుడెపుడో వందల ఏళ్ల కింద ఇతర మతాల వారు మన దేశానికి వచ్చి ఇక్కడి గుళ్లూ, గోపురాలు, కూల్చేశారని, అందుకే వారిని తరిమికొట్టాలని ఉపన్యాసాలు ఇచ్చేది వీళ్లే కదా! మరి శివాలయాన్ని కూల్చి వేసినందుకు వీరినేం చేయాలి? రోడ్లు వేసేటపుడు చిన్న గుడినో, మసీదునో కూల్చేయాల్చి వస్తే, ఆ పక్కన మరింత పెద్ద మందిరాలు కట్టించే కాంట్రాక్టర్లకున్న జ్ఞానం కూడా ఈ సనాతన ధర్మ పరిరక్షణ సంస్థకు లేకపోయింది!” అంటూనే రామ్‌లల్లా విగ్రహం గర్భగుడి చాటింది!

”స్వామీ మీరు ఎక్కడికి వెళుతున్నారు! మీరు వెళితే మాకు దిక్కెవరు?” అన్నాడు పూజారి.
”నాయనా నేను పూజించే శివుడికే మీ నాయకుడి పాలనలో దిక్కు లేకుండా పోయింది. రేపో ఎల్లుండో నాకూ అదేగతి పట్టినా ఆశ్యర్యం లేదు! ఇప్పటికే మీ నాయకుడు అవతార పురుషుడని అక్కడక్కడా చెప్పుకుంటున్నారు. నన్ను ఎవరూ గెంటేయకముందే నేను వెళ్లిపోవటం మంచిది! ఎక్కడికి వెళతానంటావా? నన్ను గుండెల్లో పెట్టుకునే ఆంజనేయుడి లాంటి భక్తులూ, నాకు తీయటి పళ్లు పెట్టడానికి ఎంగిలి చేసే శబరి లాంటి భక్తురాళ్లు ఉన్నారు. వాళ్ల దగ్గరికే వెళతాను! మీ భవ్య మందిరాల కన్నా అవే నాకు ప్రీతిపాత్రమైనవి!” అంటూ రామ్‌లల్లా గండి బయటకు వెళ్లిపోయాడు.

  • ఉషాకిరణ్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -