Sunday, December 21, 2025
E-PAPER
Homeకథకలవని ఊహలు

కలవని ఊహలు

- Advertisement -

సాగర్‌ గాంధీనగర్‌ బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళై ఆరేళ్ళు దాటినా కూడా ఇవాళో రేపో పెళ్ళి చేసుకునే యువకుడిలా ఉంటాడు. పెళ్ళయినా కూడా ఆఫీసులో చాలామంది ఆడవాళ్ళకి సాగర్‌ అంటే ఒక విధమైన అభిమానం. కానీ సాగర్‌కి తన భార్య తప్ప మిగిలిన ఆడవాళ్ళంతా చెల్లెళ్ళు, అక్కలతో సమానం. సాగర్‌కి ఒక చెల్లెలు ఉండేది. ఆమె చాలా అందంగా ఉంటుంది. సాగర్‌ పంచప్రాణాలు ఆ చెల్లెలు మీదే. సాగర్‌ చెల్లెలు టెలిఫోన్‌ ఆఫీసులో పనిచేస్తుండేది. ఒకసారి ఆఫీస్‌ తరఫున పిక్నిక్‌ కి వెళ్ళి ట్రైన్‌ యాక్సిడెంట్‌ లో చనిపోయింది. అప్పటినుంచి ప్రతి స్త్రీలోను తన చెల్లెలు రూపమే కనపడేది.

సాగర్‌ రోజు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వేరొక బ్రాంచ్‌ లో పనిచేస్తున్న స్వాతి రోజు ఎదురవుతుండేది. అప్పుడప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎదురయ్యేది. బోలెడంత కట్నం ఇచ్చి తండ్రి పెళ్ళి చేయలేడని తెలుసుకున్న స్వాతి ఎవరినైనా అందగాడిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకొంది. ఐడియా వచ్చిందే తడవుగా రోజు తనకి ఎదురయ్యే అతను తన మదిలో మెదిలాడు. ఎట్లాగైనా ఈరోజు అతను కనపడగానే ఒక చిరునవ్వు నవ్వాలి అనుకొంది. అందుకే ట్రిమ్ముగా తయారయ్యి ఆఫీసుకు బయలుదేరింది. కొద్ది దూరం వచ్చాక అతను ఎదురయ్యాడు. ఎదురుకాగానే అతని వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వింది. సాగర్‌ మటుకు ఎదురు ఫుట్పాత్‌ మీద వాళ్ళ బాస్‌ కనపడగానే పలకరింపుగా ఒక చిరునవ్వు నవ్వి తన దారిన తాను వెళ్ళాడు. స్వాతి మటుకు అతను తననే చూసి నవ్వాడనుకొని ఎంతో సంతోషించింది.
ఈరోజు ఎందుకో సాగర్‌ కి తన చెల్లెలు స్వాతి గుర్తుకు రాసాగింది. అప్పుడే తన చెల్లెలు చనిపోయి ఇవాల్టికి రెండు సంవత్సరాలు దాటుతుంది. రోజు తను ఆఫీస్‌ కి వెళ్ళేటప్పుడు ఎదురయ్యే అమ్మాయిలో తన చెల్లెలు స్వాతి పోలికలు కనిపించాయి. ఈరోజు ఆ అమ్మాయి తన వైపు చూస్తూ నవ్వగానే ఒకసారి ఆమె వైపు చూశాడు. అచ్చం తన చెల్లెలు స్వాతి లాగా ఉంది. తన చెల్లెలు స్వాతిని ఆమెలో చూసుకోవాలనిపించింది సాగర్‌ కి. స్వాతి సీక్రెట్‌ గా సాగర్‌ పేరు, ఉద్యోగం మటుకు కనుక్కుంది. మరుసటి రోజు ఎట్లాగైనా ధైర్యం చేసి పలకరించాలి అనుకుంది. రాత్రి పడుకున్నాక కూడా అతనే గుర్తుకు రాసాగాడు. కలత నిద్రతో ఎట్లాగో తెల్లవారింది అనిపించింది. ఆఫీసుకు చక్కగా డ్రెసప్పయి బయలుదేరింది. మామూలుగానే సాగర్‌ ఎదురయ్యాడు. ”హలో అండి నమస్తే” అంటూ ఒక్కసారిగా పలకరించేటప్పటికీ సాగర్‌ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యం నుంచి తేరుకుని ”నమస్తే” అన్నాడు. ”మీతో కొంచెం మాట్లాడాలి, ఈవినింగ్‌ రాఘవయ్య పార్క్‌ కి వస్తారా” అంటూ ధైర్యం చేసి అడిగింది. తన చెల్లెలి పోలికలు ఈమెలో ఉండడంతో చనిపోయిన చెల్లెలు మళ్లీ తన దగ్గరికి వచ్చిందని సంతోషించి ”సరే వస్తా”నని చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు.

ఇక స్వాతి ఆనందానికి హద్దులు లేవు. ఆఫీసుకు వెళ్ళిందే తడవుగా ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందాని ఎదురు చూడ సాగింది. సాయంత్రం రానేవచ్చింది. గంట ముందే పర్మిషన్‌ తీసుకుని ఆఫీసు నుంచి బయటపడి ఇంటికి వెళ్ళి నీట్‌ గా రెడీ అయ్యి ఐదున్నర కాగానే ఫ్రెండ్‌ తో కలిసి సినిమాకెడుతున్నానని తండ్రితో చెప్పి బయలుదేరి పార్క్‌ కి వెళ్ళింది. ఎంతసేపు కూర్చున్నా కూడా సాగర్‌ రాలేదు. అప్పటికే టైం ఎనిమిది దాటింది. అయినా కూడా సాగర్‌ రాలేదు. ఇక టైం 9 కావస్తుండటంతో విసుగెత్తి ఇంటికి వచ్చేసింది. వెంటనే సాగర్‌ కి తన అభిప్రాయాన్ని తను అతని కోసం ఎంతసేపు నిరీక్షించింది అంతా లెటర్‌ రాసి మర్నాడు ప్రొద్దున్నే రేడియో స్టేషన్‌ దగ్గరలో వున్న పోస్ట్‌ డబ్బాలో వేసింది. సాగర్‌ తన బాబుకి ఫీవర్‌ వచ్చి కొద్దిగా హడావుడి చేయడంతో హాస్పిటల్‌ లో చేర్చాల్సి రావడంతో పార్కుకి రాలేకపోయాడు. బ్యాంకుకి కూడా మూడు రోజులు సెలవు పెట్టాడు. సాగర్‌ రెండు రోజులు రాకపోవడంతో ప్యూన్‌ ఆ లెటర్‌ ఇంటికి తీసుకువచ్చి ఇచ్చాడు. సాగర్‌ ఆ లెటర్‌ విప్పి చదవసాగాడు. మొత్తం చదివిన తర్వాత ”పాపం అమాయకురాలు నాకు పెళ్లయినట్లు తెలియదులా ఉంది” అనుకొని ఏ కల్ముషం లేని సాగర్‌ ఆ లెటర్‌ భార్యకు చూపించాడు. ఇద్దరూ కొంచెం సేపు నవ్వుకున్నారు లెటర్‌ చూసుకొని. తను ఏదో తన చెల్లెలు స్వాతిని ఈ స్వాతిలో చూసుకుందామనుకుంటే పెళ్ళి చేసుకోమంటూ లెటర్‌ రాసేటప్పటికి నవ్వాలో, ఏడవాలో తెలియక కొంచెంసేపు తికమకపడి చివరికి ఎట్లాగో స్వాతికి లెటర్‌ రాశాడు.
మర్నాడు ఆఫీస్‌ కి వెళ్ళేటప్పుడు రాత్రి రాసిన లెటర్‌ కూడా తీసుకెళ్లాడు. దారిలో స్వాతి కనబడితే ఇవ్వచ్చని. అనుకున్నట్లుగానే రోజు ఎదురయ్యే చోటే ఈరోజు కూడా స్వాతి ఎదురయ్యింది. స్వాతి మటుకు మూడు రోజుల తర్వాత మళ్ళి సాగర్‌ కనబడేటప్పటికీ సంతోషంతో నవ్వు మొహం పెట్టేసింది. కానీ సాగర్‌ మటుకు కొంచెం సీరియస్‌ గా ఉన్నాడు. ఇక లెటర్‌ స్వాతి చేతికి అందించి వడివడిగా ముందుకు సాగిపోయాడు. ఇక స్వాతి ఆనందానికి హద్దులు లేవు. ఒక్కసారిగా ఎగిరి గంతేసినంత పనిచేసి గబగబా ఆఫీసుకి వెళ్ళి వెయిటింగ్‌ రూములో కూర్చుని లెటర్‌ విప్పి చదవసాగింది. ”మేడం, మీరెవరో మీ పేరేమిటో కూడా నాకు తెలియవు. మీరు రోజు నాకు దారిలో ఎదురవడం తప్పించి. మీ లెటర్‌ ద్వారా మీ పేరు ఇప్పుడు తెలిసిందనుకోండి. నేను మీ గురించి తెలుసుకోకుండానే నేను మీరు అడగంగానే వస్తానన్నడానికి కారణం నేనొకటి ఊహిస్తే మీరొకటి ఊహించి అప్పుడే ఊహాలోకాల్లో తేలిపోయారు. చనిపోయిన మా చెల్లెలు పోలికలు అన్నీ మీలో కనిపించాయి. నా పంచప్రాణాలు మా చెల్లెలు పైనే. అటువంటి చెల్లెలు విధి వక్రించి చనిపోవడంతో మళ్లీ మా చెల్లెలు రూపంలో మీరు కనిపించారు. నేనే ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని పలకరిద్దామనుకుంటుండగానే మీరే నన్ను పలకరించారు.” సగం లెటర్‌ చదివేటప్పటికే స్వాతి మనసు అదోలా అయిపోయింది. ఎట్లాగో మిగిలిన సగం చదవనారంభించింది.

”ఒక చెల్లెలుగా మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిద్దాం అనుకుంటే మీరేమో పెళ్లి చేసుకోవాలని ఉందని లెటర్‌ రాశారు. అన్నట్టు మీకు చెప్పడం మరిచాను నాకు పెళ్లయింది, ఒక బాబు కూడా. మా బాబుకి ఫీవర్‌ వచ్చి కొద్దిగా సీరియస్‌ కావడంతో ఆరోజు రాలేకపోయాను. కానీ మీ లెటర్‌ చూసి మళ్ళి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. మీరు ఎవరినైనా ప్రేమించదలుచుకుంటే ముందు వాళ్ళ బ్యాక్‌ గ్రౌండ్‌ కూడా కాస్త తెలుసుకొని మరీ ఇటువంటి విషయాల్లోకి దిగండి. నా చెల్లెలుగా మీరు మా ఇంటికి వస్తానంటే మా ఇంటి తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి.
ఇక ఉంటాను,
మీ అన్నయ్య సాగర్‌”
లెటర్‌ పూర్తిగా చదివిన స్వాతి కళ్ళు తిరిగి క్రింద పడినంత పని చేసింది. ఎట్లాగో ఆపుకొని కసిగా లెటర్‌ ని ముక్కలు ముక్కలుగా చించేసింది. ఇక మనసు బాగుండక లీవ్‌ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ స్వాతి ఎప్పుడూ ఆ రూట్లో రాలేదు.

– పింగళి భాగ్యలక్ష్మి, 9704725609

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -