రష్యాలోని టిప్లిన్ రాష్ట్రం, గోరీ పట్టణపు ఒక పేటలో 21 డిసెంబర్ 1879న బెసారియన్ జుగాష్విలీ, కెటేబన్ గెలాడ్జ్ దంపతులకు జన్మించాడు జోసెఫ్ స్టాలిన్. చెప్పులు కుట్టే తండ్రి, రజక వృత్తి చేసే తల్లితో పాటు తరచూ కష్టాలు తింటూ, కన్నీళ్లుతాగుతూ బతికాడు. నిర్విరామంగా శ్రమిస్తున్నా, మనుషులు ఆకలిదప్పులతో ఎందుకు అలమటిస్తున్నారు? ఈ కష్టాల నుండి మానవులను గట్టెక్కించే మార్గమేమీ లేదా? అంటూ బాల్యం నుండి గౌతమ బుద్ధునిలా మదనపడ్డాడు. ఆ దిశగా పరిశ్రమిస్తున్న లెనిన్‌తో జతకట్టాడు. తద్వారా లెనిన్ కన్న సోషలిస్టు రష్యాను తండ్రిగా సంరక్షించాడు. అలా విశ్వ వైతాళికుడిగా, ప్రపంచ రక్షకునిగా ఎదిగిన మానవ ప్రేమికుడు అతడు!
146 సంవత్సరాల క్రితం స్టాలిన్ పుట్టి పెరిగిన 5 చదరపు గజాల ఆ చిన్న ఇంటిని, నేటికీ స్ఫూర్తి భావనతో సందర్శిస్తూ, ఆ మానవ ప్రేమికుని కష్టభరిత బాల్యాన్ని తలచుకుని చలిత హృదయాలతో చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూనే వున్నారు లక్షలాది సందర్శకులు. అలా మానవులున్నంత కాలం వాళ్ల హృదయాలను ద్రవింపజేస్తూ ఆశయ సాధకులకు స్ఫూర్తినిస్తూనే వుంటాడు అమర జీవి స్టాలిన్.
మార్చి 5, 1953న ఆ ఎర్ర సూర్యుడు అస్తమించినప్పుడు ”మారుతంలా సదా ప్రవహించే మానవత్వం స్టాలిన్! మానవత్వానికి చావులేదు. మహానేత స్టాలిన్‌కు మరణం లేదు” అని రాశారు డా||సినారె.

”మానవాళి సుఖజీవనానికి, ప్రపంచ శాంతికి, సమ సామాజిక నిర్మాణమే రక్ష” అని ఆచరణాత్మకంగా ప్రపంచానికి ప్రబోధించిన విశ్వ వైతాళికుడు స్టాలిన్. అందుకే ”కూలీకి కిరీటం పెట్టి, రైతుకు పట్టంగట్టిన, రష్యా భాగ్యవిధాత. ప్రపంచానికే ఆదర్శ నేత స్టాలిన్” అని రాశారు కరుణశ్రీ.
శిశుదశలో సోషలిస్టు రష్యాను కాపాడుకుంటూనే భయంకర హిట్లర్ ఫాసిజం బారినుండి ప్రపంచాన్ని రక్షించేందుకు స్టాలిన్ చేసిన అపూర్వ, చిరస్మరణీయ శ్రమను గూర్చి, ప్రజాకవి ‘పాబ్లోనెరోడా’ ప్రవచించిన అక్షర సత్యాలు –
”కరువు కాటకాలు, అంతర, బాహ్య యుద్ధాల బారినుండి సోషలిస్టు రష్యాను కాపాడుకునేందుకు స్టాలిన్ ఓడ్చిన చెమటను!
ఫాసిజం బారి నుండి ప్రపంచాన్ని రక్షించేందుకు స్టాలిన్ ధారబోసిన రక్తాన్ని సమీకరించగల్గితే ఔతుంది మరో సముద్రం!
ఇప్పటి సముద్రాలన్నింటికన్నా లోతైన మహాసముద్రమిది!
ది ప్లానింగ్ లీడర్ స్టాలిన్ : నాడు భయంకరమైన కరువు దాడికి విలవిలాడుతున్న సోషలిస్టు రష్యాను ఆకలితో మాడ్చి చంపాలన్న కుట్రతో, ఆహార ధాన్యాల సరఫరాకు తిరస్కరించినాయి అగ్రరాజ్యాలు. ఐనా సరే నిబ్బరాన్ని కోల్పోలేదు స్టాలిన్. ‘ఎవ్వరి సహాయ సహకారాలు లేకుండానే రష్యన్లు తమ కాళ్లమీద నిలబడటమే కాదు, సమిష్టి కృషితో పరుగెత్తగలరు’ అని స్టాలిన్ చేసిన ఆ చిన్న ప్రకటనే సామ్రాజ్యవాద దేశాలకు సవాలుగా రష్యన్లకు ఆత్మవిశ్వాసంగా పరిణమించింది. అంతే కాదు, ప్రతి రష్యన్ పౌరున్నీ దేశభక్తితో ఉత్తేజపరచింది.
నిరంతర అధ్యయన శీలి, పరిశీలకుడైన స్టాలిన్ తక్షణం ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి సాధన దిశగా ప్రణాళికలు రూపొందిచాడు. ఆనకట్టల ద్వారా సాగునీటికి, ఆలుగడ్డలతో సహా తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడులనిచ్చే ఆహార ధాన్యాల హైబ్రిద్ వంగడాల వుత్పత్తికి కృషి చేయించాడు. విజయవంతమైన ఆయన ప్రణాళిక ప్రజలను మరింత వుత్తేజపరిచింది. ‘సాధించి ముందుకు పదండి’ అన్న నినాదంతో రష్యన్లను పరుగులు పెట్టించాడు. పంచవర్ష ప్రణాళికా లక్ష్యాలను రెండు మూడేళ్లకే సాధిస్తూ సోషలిస్టు రష్యాను ప్రతిపథాన పరుగెత్తించాడు. అలా విదేశీయుల బహూకరించిన ట్రాక్టర్‌ను వాడటం తెలియక పొలాల్లో వదిలేసిన అనాగరిక రైతు రష్యాను, అతి స్వల్ప కాలంలోనే వ్యోమగామితో సహా అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపగల్గిన ఆధునిక సాంకేతిక రష్యాగా ఎక్కదీశాడు ది ప్లానింగ్ లీడర్ జోసెఫ్ స్టాలిన్. ఇరవై ఏళ్లలో ఇరవై తరాల అభివృద్ధిని సాధించిన ప్రపంచైక నేత స్టాలిన్!” అంటూ ‘ఇసాక్ డూషర్ వంటి ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు! తద్వారా సామ్రాజ్యదేశాధినేతలు, బడా కార్పొరేట్లకు సోషలిజం పట్ల అసూయను, ప్రపంచ ప్రజలకు సోషలిజం పట్ల ఆసక్తినీ రేకెత్తించాడు. దటీజ్ జోసెఫ్ స్టాలిన్!

అంతేగాదు కష్టాల నుండి తన దేశాన్ని గట్టెక్కించుకుంటూనే – ఇబ్బందుల్లో ఉన్న ఇరుగు పొరుగు దేశాలకూ చేయూతనిచ్చిన సిసలైన సామ్యవాది, మానవీయనేత స్టాలిన్! ఉదాహరణకు, స్వాతంత్య్రం పొందిన తొలిరోజుల్లో, భారత్ గూడ కరువుతో కటకటలాడింది. ఆహారధాన్యాల కోసం వెళ్ళిన నెహ్రూ ఎదుటివారి ఆపదను గూడా అధిక లాభార్జనకు ఆయుధంగా మలుచుకునే అమెరికా, బ్రిటన్ల గొంతెమ్మ కోర్కెలకు భయపడి ఖాళీ చేతులతో వెనుదిరిగాడు. నిరాశతో తన చెంతకొచ్చిన నెహ్రూను సాదరంగా స్వాగతించి తక్షణం భారత్‌కు ఆహారధాన్యాలనందించాడు స్టాలిన్!
అంతేగాదు భారీ జనాభా గల్గిన భారత్ సదా ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి సాధనకు కృషి చేయాలని సలహా ఇవ్వటమే గాదు – ‘హీరాకుడ్’, ‘భాక్రానంగల్’ ఆనకట్టలకు, ‘భిలారు’, ‘రూర్కెలా’ ఉక్కు కర్మాగారాలకు ఆర్థిక సహాయంతో పాటు, రష్యా సాంకేతిక నిపుణులను గూడ పంపి, భారత వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు పునాది వేయించిన మానవీయ మహానేత స్టాలిన్! అందుకే భారతీయులకూ చిరస్మరణీయుడు జోసెఫ్ స్టాలిన్.
నాటినుండి స్టాలిన్ అభిమానిగా మారిన నెహ్రూ, ఆయనలాగే పంచవర్ష ప్రణాళికలను రూపొందించుకున్నాడు. ప్రవేటు సంస్థలకు సమాంతరంగా అనేక ప్రభుత్వరంగ సంస్థల్ని నెలకొల్పి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన జేసాడు! సోషలిస్టు రష్యాతో మైత్రిని కొనసాగిస్తూ, కేపిటలిస్టు దేశాల ఆగ్రహానికి గురికాకూడదు అన్న ఎత్తుగడతో ‘అలీన విదేశాంగ విధానాన్ని’ పాటించాడు నెహ్రూ!

నేటికీ తిరుగులేని స్టాలిన్ ప్రణాళిక
వ్యవసాయక రష్యా ప్రగతిసాధనకు స్టాలిన్ రూపొందించుకున్న ప్రణాళిక – వ్యవసాయాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యతనివ్వటం ద్వారా, ఆహార ధాన్యాల స్వయం సమృద్ధిని, తదాధారిత మెజారిటీ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించటం – తద్వారా పారిశ్రామిక – విద్య – వైద్య – సాంకేతిక ప్రగతిని సాధించటం, వ్యవసాయక దేశాల వేగవంతమైన ప్రగతి సాధనకు నాటి స్టాలిన్- ప్రణాళికే నేటికీ తిరుగులేదని, డెంగ్ సియావోపింగ్ సారధ్యాన ‘చైనా!’ నిరూపించింది.
నిస్వార్థ నిరాడంబర నేత! : స్టాలిన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన భార్య, సామాన్య ప్రజలతో పాటు కిక్కిరిసిన ట్రామ్‌లలో సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో నిత్యం శ్రమించి వచ్చే వారు. ఆయన రష్యాధినేతగా, ఉన్నప్పుడు స్టాలిన్ కొడుకు ఒక సామాన్య సైనికుడు! రెండో ప్రపంచ యుద్ధంలో తమకు బందీ ఐన స్టాలిన్ కొడుకు ‘యాకోవ్’ విడుదలకు రష్యన్లకు బందీ అయిన తమ కమాండర్ ‘విల్సన్’ను విడిపించాలని – బేరం పెట్టారు జర్మన్లు ! కానీ, ఒక సామాన్య సైనికుని కోసం, కీలకమైన కమాండర్‌ను అప్పగించటం అసంభవమన్నాడు స్టాలిన్! కుమారునికన్నా దేశానికే ప్రాధాన్యత నిచ్చిన స్టాలిన్ నిరాడంబరత, నిస్వార్థాలకు ఇంతకన్నా నిదర్శన యేం కావాలి?
విలువలకు, నిజాయితీకి ప్రతీక స్టాలిన్: ”మానవీయ విలువలకు కట్టుబడకుంటే సామాజిక మనుగడకు – అంతర్జాతీయ విలువలకు కట్టుబడకుంటే ప్రపంచ మనుగడకు ప్రమాదం” అనటమే కాదు, ఆచరించి చూపిన అజేయనేత స్టాలిన్! ఉదా. హిట్లర్‌తో చేయికలిపిన ఫిన్లండును తన దేశ భద్రత కోసం ఆక్రమించి గూడ – అవసరం మేరకు కొంత భూమార్గాన్ని, సముద్ర మార్గాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి ఫిన్లండును వాళ్ళకే అప్పగించాడు స్టాలిన్! పోలండ్ గతంలో ఆక్రమించిన రష్యన్ భూ భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని, దానికి ఆనుకుని ఉన్న పోలండ్ ఆక్రమిత లిథువేనియా రాజధాని ‘విల్నా’ను తిరిగి లిథులేనియాకు ఇప్పించాడు. స్టాలిన్ నిజాయితీకి ముగ్ధులైన, లాత్వియా, లిధులేనియా, ఎస్తోనియా రిపబ్లిక్కులు స్వచ్ఛందంగా సోషలిస్టు రష్యాలో విలీనమయ్యాయి.
నాడు ‘ఫిన్లాండ్’ విషయంలో స్టాలిన్ ఉదారతను ప్రశ్నించిన సేనాపతి మాలటోవ్ కితాబిచ్చాడు స్టాలిన్! ”అవకాశం, బలం ఉంటే సోషలిస్టు దేశాలు గూడ దురాక్రమణకు పాల్పడతారు! అన్న అపఖ్యాతి, సోషలిస్టు రష్యాకు, కమ్యూనిస్టు పార్టీకి అంటకుండా నిత్యం నిజాయితీగా, అప్రమత్తంగా ఉండటం మన కమ్యూనిస్టుల కర్తవ్యం సుమా!” అన్న స్టాలిన్‌కు సగౌరవంగా సాల్యూట్ చేశాడు మాలటోల్.
నాడు స్టాలిన్ నిజాయితీయుత దౌత్యనీతికి ఫిదా ఐన ప్రజలు అమెరికా, బ్రిటన్లతో సహా హిట్లర్ వ్యతిరేక, స్టాలిన్‌కు సానుకూల ప్రదర్శనలతో ప్రపంచమంతటా హౌరెత్తించారు ప్రజలు! ప్రజా నిరసనలకు భయపడి స్టాలిన్‌కు మద్దతుగా యుద్దరంగంలో అడుగుపెట్టినయే సామ్రాజ్యవాద దేశాలు.
అంతేగాదు భద్రతాసిబ్బంది ఒత్తిడి మేరకు స్టాలిన్ అజ్ఞాతంలోకి వెళ్ళకపోగా – క్రెమ్లిన్ భవనానికల్లంత దూరాన ఎగసిపడుతున్న బాంబుల మంటల మధ్యే, రెడ్‌స్క్వేర్‌లో సైనిక కవాతు నేర్పరచాడు! ”ఎర్రసైనికులారా! జర్మన్ బందిపోట్లను నిర్మూలించగల సత్తా మీకు మాత్రమే ఉందనీ – హీట్లర్ దురాక్రమిత యూరప్ దేశాల విముక్తి ప్రదాతలు మీరేనని ప్రపంచం విశ్వసిస్తుంది! ఆ ఘనకీర్తికి మీరు, మీరు మాత్రమే అర్హులు!” అన్న స్టాలిన్ ప్రబోధంతో మరో గొప్ప సైన్యం వచ్చి తమతో చేరినంత శక్తి వచ్చిందనీ, స్టాలిన్ స్వయంగా సైన్యాన్ని నడిపించటంతో సైనికులకు మేం జయించి తీరుతామన్న ఆత్మవిశ్వాసం పెరిగిందని తద్వారా ఎర్రసైనికులు విజేతలుగా – స్టాలిన్ ప్రపంచ రక్షకుడిగా చరిత్రలో చిరంజీవులుగా విరాజిల్లుతున్నారనీ ‘డిమెట్రోవ్’ – ‘స్టెమెంకోవ్’ – ‘ఝాకోల్‌లు తమ స్మృతుల్లో వ్రాసుకున్నారు.
అలా సోషలిస్టులే కాదు, సోషలిజాన్ని విద్వేషించే బ్రిటన్, అమెరికాధినేతలు గూడ తమ స్మతుల్లో ఇలా రాసుకున్నారు! ”చరిత్రలో విజేతలు ఉన్నారు కానీ, స్టాలిన్ వంటి రాజ్యాంగవేత్తలు, అతికొద్దిమందే!” – చర్చిల్.
”రష్యన్లకు, సోషలిస్టుల మనస్తత్వానికి సిసలైన ప్రతినిథి జోసెఫ్ స్టాలిన్ ! ఆయన నాయకత్వాన రష్యన్ ప్రజలు, సైనికులు ప్రదర్శించిన తెగువ, ధైర్యసాహసాలు, ఆత్మత్యాగాలను ప్రపంచం ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగదు! – రూజ్‌వెల్స్
– పాతూరి వెంకటేశ్వరరావు, 984981889



