Sunday, December 21, 2025
E-PAPER
Homeసోపతికొత్తతరం ఏం రాస్తోంది.. ఏం చదువుతోంది?

కొత్తతరం ఏం రాస్తోంది.. ఏం చదువుతోంది?

- Advertisement -

ఇది జెన్‌-జీల కాలం. అంతా టెక్నాలజీమయం. స్మార్ట్‌ఫోన్ల యుగం. ‘ఈ కాలంలో పుస్తకాలెవరు చదువుతారు?’ అనే సందేహం చాలామందిలో ఉంది. పుస్తకమే పట్టని వారిలోనే ఇటువంటి సందేహం నెలకొంటోంది తప్ప, పుస్తకాల లోకం గురించి కాసింత అంచనా ఉన్న వారెవరైనా ఏటా తెలుగు సాహిత్యానికి కొత్త పాఠకులు వస్తున్న విషయాన్ని కనిపెడతారు. చదివేవారితోపాటు రాసేవారి సంఖ్యా పెరుగుతోంది. తెలుగు సాహిత్యం ప్రస్తుతం కొత్త సొబగులద్దుకుంటోంది. టెక్నాలజీ సాయంతో కొత్త దారుల్లో తన ప్రయాణాన్ని సాగిస్తోంది.
గతంలో ఒక రచయిత పుస్తకం వేయాలంటే అదొక ప్రహనంలా ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారి రచయితలు సులువుగా తమ రచనల్ని బయటకు తెచ్చే అవకాశం ఏర్పడింది. పెరుగుతున్న పాఠకులు, రచయితల సంఖ్యకు తగ్గట్టే ప్రచురణ సంస్థల సంఖ్య సైతం పెరుగుతోంది. దీంతో సాహిత్య వాతావరణం కళకళలాడుతూ ఉంది.

ఆసక్తికరంగా రాస్తే ఆసాంతం చదివేస్తూ..
ప్రస్తుతం రచయితలు, ప్రచురణసంస్థలు యువపాఠకులను కీలకంగా భావిస్తున్నాయి. ఒకసారి వారు పుస్తక పఠనానికి అలవాటు పడితే, మరిన్ని పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో యువపాఠకుల ప్రాధాన్యం నవలలవైపు ఉంది. ఆసక్తికరంగా ఉన్న నవలను ఆసాంతం చదవడంతోపాటు వాటి గురించి సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఇవి పుస్తకాల అమ్మకాలకు దోహదపడుతున్నాయి. అజు పబ్లికేషన్స్‌ ఆధ్వర్యంలో రవి మంత్రి రాసిన ‘అమ్మ డైరీ కొన్ని పేజీలు’ నవల 1.5 లక్షల కాపీలకు పైగా అమ్ముడుపోవడం తాజా ఉదాహరణ. ఈ పుస్తకం విజయంలో సోషల్‌ మీడియాలో పాఠకులు తెలిపిన స్పందనల ప్రభావం బలంగా ఉంది. ఈ పుస్తకం చదివినవారిలో యువపాఠకుల సంఖ్య ఘననీయమైనది. వారిలో మొదటిసారి పుస్తకం చదివినవారూ అనేకమంది ఉన్నారు. ఆసక్తికర కథనం, హదయానికి హత్తుకునే పాత్రలు, సులువైన సంభాషణలు కలిసి ఆ పుస్తకాన్ని పాఠకులకు చేరువ చేశాయి. ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి సైతం అనువాదమైంది. ఒక తెలుగు పుస్తకానికి ఇంత ఖ్యాతి దక్కడం శుభపరిణామం.

వేల కాపీల అమ్మకాలు..
పుస్తక ప్రచురణ డబ్బుతో కూడుకున్న వ్యవహారం. లక్షలు పోసి, పుస్తకాలు ప్రచురించాక అమ్మకాలు ఆ స్థాయిలో జరుగుతాయా? పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా? ప్రచురణ సంస్థ గట్టెక్కుతుందా అనేది చాలామందికుండే అనుమానాలు. వాటిని పటాపంచలు చేస్తూ ఇటీవలకాలంలో అనేక పుస్తకాలు వేల కాపీలు అమ్మకాలు పొందాయి. నటుడు బ్రహ్మానందం ఆత్మకథ ‘నేను మీ బ్రహ్మానందం’, కడలి రాసిన ‘లెటర్స్‌ టు లవ్‌’, ‘చిక్‌లిట్‌’, మహమ్మద్‌ గౌస్‌ ‘గాజుల సంచీ’, ‘825 కి.మీ’, సురేంద్ర శీలం ‘నడూరి మిద్దె’, కామిశెట్టి శ్రీనివాస్‌ ‘అయోధ్య చేరిన కష్ణ’, భవాని చాతరాజు ‘నెవర్‌ ఎండింగ్‌ లవ్‌స్టోరీ’, రేణుక్‌ వల్లెపు ‘భగీరథ కోన’, శరత్‌చంద్ర %డ% సాయికుమార్‌ ‘తిమ్మిరిబిళ్లలు తొడపాశాలు’, ప్రదీప్‌ మహరాజ్‌ ‘ప్రేమ ప్రయాణం’ తదితర పుస్తకాలు వేల కొద్దీ కాపీలు అమ్ముడుపోయాయి. వీటిలో నవలలే ఎక్కువగా ఉండటం విశేషం.

ప్రేమకథలకే ప్రాధాన్యం
గతంలో ఒకానొక సమయంలో తెలుగులో డిటెక్టివ్‌ నవలలు విరివిగా వచ్చేవి. ఆ తర్వాత కాలంలో ప్రేమ నవలలు పాఠకుల్ని విపరీతంగా ఆకర్షించాయి. ఆనాటి యువతరం వాటిని చదివి, ఆయా రచయితల్ని తీవ్రంగా అభిమానించేవారు. సినిమాలపైనా ఆ నవలల ప్రభావం కొంత ఉండేది. అనంతర కాలంలో ఆ ఉధతి తగ్గింది. ప్రస్తుతం మరోసారి ప్రేమ కథల ట్రెండ్‌ మొదలైంది. పాఠకులు ప్రేమ కథలు, నవలల వైపు మొగ్గు చూపుతున్నారు. మానవ సంబంధాలను విశేషంగా చిత్రించిన రచనల్ని ఇష్టపడుతున్నారు. కొందరు విషాదాంతాలను ఆసక్తిగా చదువుతుండగా, మరికొందరు కష్టాల కోర్చి గెలిచే ప్రేమల్ని అక్కున చేర్చుకుంటున్నారు. చదివించే కథ, కథనాలు, ఆసక్తి కలిగించే శైలి, హద్యమైన సంభాషణలు, ప్రచురణలో నాణ్యత ఉన్న పుస్తకాలను పాఠకులు విశేషంగా ఆదరిస్తున్నారు.

కీలక పాత్ర పోషిస్తున్న సోషల్‌ మీడియా
ప్రస్తుతం పుస్తకాల ప్రచారంలో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. రీల్స్‌, మీమ్స్‌ రూపంలో పుస్తకాలకు ప్రచారాన్ని అందించేందుకు అనేకమంది రచయితలు, ప్రచురణకర్తలు మొగ్గు చూపుతున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నా, పాఠకులను నేరుగా చేరేందుకు ఇది మేలైన మార్గమని చాలామంది అంటున్నారు. పుస్తకాల కోసం చేసిన కొన్ని రీల్స్‌కు లక్షల్లో వ్యూస్‌ ఉన్నాయి. వారందరూ పుస్తకం కొంటారన్న భరోసా లేకపోయినా, వారందరికీ తమ పుస్తకం గురించి తెలిసిందన్న తప్తి రచయితలకు కలుగుతోంది. పుస్తకాలను సమీక్షించేందుకు, చర్చించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అనేకమంది ఆసక్తి చూపుతున్నారు. వారికి వేలకొద్దీ ఫాలోవర్లు ఉండటంతో వారు చెప్పే విషయాలు ప్రాధాన్యాన్ని పొందుతున్నాయి.
– ఆరోహణ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -