– ఏడాదిలోనే అందింది రూ.6,654 కోట్లు
– 82 శాతం కార్పొరేట్ శక్తుల నుంచే..!
– డొనేషన్లలో 68 శాతం పెరుగుదల
– కాంగ్రెస్ పార్టీకి విరాళాలు తగ్గుదల
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గత ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తంలో విరాళాలు అందాయి. అందులో 82 శాతం కార్పొరేట్ విరాళాలే ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.6,654.93 కోట్లు ఆ పార్టీకి విరాళంగా అందాయి. లోక్‌సభ ఎన్నికలు జరిగిన గత ఏడాదితో పోలిస్తే ఆ పార్టీకి 68 శాతం విరాళాలు పెరిగినట్టు ఎన్నికల సంఘం రిపోర్టులో స్పష్టం అయింది. డిసెంబర్ 8న కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో నివేదికను పొందుపరిచారు. రూ.20 వేల కన్నా ఎక్కువ విరాళం అందుకున్న పార్టీ వివరాలు మాత్రమే ఆ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఆ నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 30 వరకు విరాళాలు అందాయని స్పష్టమైంది. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూకాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి 3,967 కోట్లు విరాళంగా అందాయి. అయితే ఈసారి మాత్రం ఆ విరాళాలు 68 శాతం పెరిగినట్టు రిపోర్టులో స్పష్టమైంది.
బీజేపీకి వచ్చిన విరాళాల్లో సుమారు 40 శాతం విరాళాలు ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి వచ్చాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.2,180 కోట్ల విరాళం అందజేయగా, ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.757 కోట్లు, ఎబి జనరల్ ట్రస్ట్ రూ.606 కోట్లు, న్యూ డెమోక్రాటిక్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.150 కోట్లు డొనేట్ చేశాయి. ట్రయంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.25 కోట్లు, జన ప్రగతి ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.1.02 కోట్లు, జన్ కళ్యాణ్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.19 లక్షలు, ఐంజిగార్డిగ్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.7.75 లక్షలు విరాళంగా ఇచ్చాయి. ఇక ఇతర ట్రస్టుల నుంచి సుమారు రూ.3,112.50 కోట్లు బీజేపీకి విరాళంగా వచ్చాయి. మిగిలిన విరాళాలు కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చాయి. కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చిన విరాళాలను రాజకీయ పార్టీలకు పంపిణీ చేయడానికి కంపెనీలు ఒక ఎలక్టోరల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తాయి. బీజేపీకి అందిన మొత్తం విరాళాల్లో 82 శాతం కార్పొరేట్ నుంచే అందాయి.
రూ.కోట్లలో కార్పొరేట్ సంస్థల విరాళాలు
ఎలక్టోరల్ ట్రస్టుల్లో విరాళాలు ఇవ్వటంలో అగ్రస్థానంలో ఉన్న ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ భారతీ ఎయిర్‌టెల్ మాతృ సంస్థ భారతీ ఎంటర్ ప్రైజెస్ ఆధీనంలో ఉంది. ప్రూడెంట్‌కు విరాళాలు ఎల్ అండ్ టీ తరువాత మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్స్, దాని ప్రమోటర్ పి.వి కృష్ణారెడ్డి నుంచి అత్యధిక మొత్తంలో అందాయి. దీని మొత్తం రూ. 320 కోట్లు. ఈ సంస్థ 2018-2024 మధ్య ఎన్నికల బాండ్లను ఉపయోగించి బీజేపీకి అత్యధిక విరాళం అందించింది. మరో ప్రధాన ఎన్నికల బాండ్ల దాత అయిన లాటరీ వ్యాపారి శాంటియాగో మార్టిన్ సంస్థ టైగర్ అసోసియేట్స్ ప్రూడెంట్‌కు రూ.147 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఆర్‌పి సంజీవ్ గోయెంకా గ్రూపు సంస్థలు ప్రూడెంట్‌కు రూ.144 కోట్లు విరాళంగా ఇచ్చాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ట్రస్ట్‌కు రూ.40 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇండిగో ఉమ్మడి డైరెక్టర్లకు సంబంధించిన అశోక్ లేలాండ్, అపోలో టైర్స్ కూడా ట్రస్ట్‌కు రూ.150 కోట్లు విరాళంగా ఇచ్చాయి. అశోక్ లేలాండ్ హిందూజా గ్రూపులో భాగం. ఈ గ్రూప్ సంస్థ కలిసి ప్రూడెంట్‌కు రూ.177.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇతర ప్రధాన దాతలలో ఒపి జిందాల్ గ్రూపులోని నవీన్ జిందాల్ వర్గానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ట్రస్ట్‌కు రూ. 107 కోట్లు విరాళంగా ఇచ్చాయి. డీఎల్‌ఎఫ్ గ్రూప్ రూ.100 కోట్లు, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ రూ. 98.5 కోట్లు విరాళంగా ఇచ్చాయి. భారతీ ఎయిర్‌టెల్, అరబిందో ఫార్మా తదితర సంస్థలు కూడా కోట్ల రూపాయల్లో విరాళాలు ఇచ్చాయి.
రెండోది ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్. దీనిని టాటా గ్రూప్ నియంత్రిస్తుంది. ఇది మోడీ ప్రభుత్వం నుంచి లాభదాయకమైన సబ్సిడీలతో సెమీకండక్టర్ ప్రాజెక్టులను పొందిన వారాల తరువాత బీజేపీకి విరాళాలను పెద్ద మొత్తంలో అందజేసింది. ఎలక్టోరల్ ట్రస్టులలో మూడో అతిపెద్ద విరాళం ఇచ్చేది ఎబి జనరల్ ట్రస్ట్. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ నియంత్రణలో ఉంది. నాలుగో అతిపెద్ద విరాళం ఇచ్చే న్యూ డెమోక్రటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్.. మహీంద్రా గ్రూప్ ఆధీనంలో ఉంది. ఐదో అతిపెద్ద విరాళం ఇచ్చే ట్రయంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ సిజి పవర్ అండ్ ఇండిస్టియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ నియంత్రణలో ఉన్నది.
సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా సుమారు రూ.వంద కోట్లు విరాళం ఇచ్చింది. రుంగ్తా సన్స్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 95 కోట్లు, బజాజ్ గ్రూపు కంపెనీలు రూ.74 కోట్లు, వేదాంత రూ.67 కోట్లు, మాక్రోటెక్ డెవలపర్స్ (ఇప్పుడు లోధా డెవలపర్స్ అని పేరు మార్చబడింది) రూ.65 కోట్లు, డెరైవ్ ఇన్వెస్టిమెంట్స్ సుమారు రూ.53 కోట్లు, మోడరన్ రోడ్ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.52 కోట్లు, లోటస్ హౌమ్ టెక్స్‌టైల్స్ లిమిటెడ్ రూ.51 కోట్లు,సఫల్ గోయల్ రియాల్టీ ఎల్‌ఎల్‌పీ రూ.45 కోట్లు, ఐటీసీ లిమిటెడ్ రూ.39 కోట్లు, గ్లోబల్ ఐవి వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ రూ.35 కోట్లు విరాళంగా ఇచ్చాయి. హీరో ఎంటర్‌ప్రైజెస్ పార్టనర్ వెంచర్స్, మ్యాన్‌కైండ్ ఫార్మా లిమిటెడ్, సురేశ్ అమృత్‌లాల్ కోటక్ ఒక్కొక్కటి రూ.30 కోట్ల చొప్పున విరాళాలు ఇచ్చాయి. దిలీప్ బిల్డ్‌ఐకాన్ గ్రూపు రూ.29 కోట్లు, హిందుస్తాన్ జింక్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.27 కోట్లు, మలాబార్ గోల్డ్ రూ.10 కోట్లు, కళ్యాణ్ జ్యూయలర్స్ రూ.15.1 కోట్లు, వేవ్ ఇండిస్టీస్ రూ.5.25 కోట్లు, జిరోదా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ రూ.1.5 కోట్లు విరాళం అందజేశాయి. బీజేపీ నేతలు కూడా ఆ పార్టీకి విరాళాలు అందజేశారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రూ.3 లక్షలు, మంత్రి పీయూష్ హజారి రూ.2.75 లక్షలు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రూ.లక్ష, ఒడిశా సీఎం మోహన్ చరన్ మాంజీ రూ.5 లక్షలు, ఇండోర్ మేయర్ భార్గవ రూ.లక్ష, ఆకాశ్ విజయవర్గియా రూ.లక్ష విరాళాలు అందజేశారు.
కాంగ్రెస్‌కు 43 శాతం తగ్గిన విరాళాలు
ఒకవైపు బీజేపీకి భారీగా విరాళాలు పెరగగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మాత్రం భారీగా విరాళాలు తగ్గాయి. ఆ పార్టీకి రూ.522.13 కోట్లు మాత్రమే విరాళాల రూపంలో వచ్చాయి. 2023-24లో ఆ పార్టీకి రూ.1,129 కోట్లు విరాళాలు అందాయి. కానీ ఇప్పుడు రూ.522.13 కోట్లు మాత్రమే అందాయి. దీంతో గతేడాది 43 శాతం తక్కువగా విరాళాలు అందాయి. పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి విరాళాలు గతేడాది రూ.618.8 కోట్ల నుంచి రూ.184.08 కోట్లకు తగ్గాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు గతేడాది రూ.22.1 కోట్ల విరాళాలు రాగా, ఈసారి రూ.39.2 కోట్లకు పెరిగాయి. ఒడిశాలో అధికారాన్ని కోల్పోయి ప్రధాన ప్రతిపక్షంగా మారిన బిజు జనతాదళ్ (బీజేడీ)కి ఈ ఏడాది రూ.60 కోట్లు మాత్రమే విరాళాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.246 కోట్లు వచ్చాయి. తమిళనాడులోని అధికార డీఎంకే రూ.365 కోట్ల విరాళాలు పొందింది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) రూ.18 కోట్లు, వామపక్షాలు (సీపీఐ(ఎం), సీపీఐఎంఎల్) రూ.17 కోట్లు, ఎల్జేపీ రూ.11, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) రూ.4 కోట్లు, ఎస్‌పీ రూ. 93 లక్షలు, ఎంఎన్‌ఎస్ రూ.90.87 లక్షల విరాళాలు పొందాయి.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీల విరాళాలు ఇలా
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు అందిన విరాళాల్లో ఏపీలోని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ముందు స్థానంలో ఉన్నది. ఆ పార్టీకి రూ.140 కోట్లు అందాయి. ఆ తర్వాతి స్థానంలో అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఉన్నది. ఈ పార్టీ రూ.85.2 కోట్ల విరాళాలను అందుకుంది. అవి కాకుండా ఫీజులు, చందాల ద్వారా రూ.102 కోట్లు సేకరించింది. ఇక ఏపీలోని అధికార కూటమిలో భాగంగా ఉన్న జనసేన రూ.25 కోట్లు వచ్చాయి. ఇక తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి కేవలం రూ.15.09 కోట్లు వచ్చాయి. ఇదే పార్టీకి గతేడాది రూ.580 కోట్టు వచ్చాయి.
ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసిన తరువాత 2024-25 ఆర్థిక సంవత్సరం ఎన్నికల బాండ్లు లేకుండా రాజకీయ పార్టీలకు విరాళాలు అందాయి. ఎన్నికల బాండ్ పథకం కింద, రాజకీయ పార్టీలు గత కొన్ని సంవత్సరాలుగా రూ.16,000 కోట్లకుపైగా అనామక విరాళాలను అందుకున్నాయి. ఇందులో బీజేపీకి అత్యధిక వాటా లభించింది. 2018లో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్లు, వ్యక్తులు, కార్పొరేట్లు తమ గుర్తింపును బహిరంగంగా వెల్లడించకుండానే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి అనుమతించారు. 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఈ పథకాన్ని కొట్టివేసింది. ఆ తరువాత రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాకుండా విరాళాలు పొందాయి.
ఆరేండ్లలో బీజేపీ పొందిన విరాళాలు
సంవత్సరం విరాళాలు (కోట్లల్లో)
2019-20 రూ.3,427
2020-21 రూ.578
2021-22 రూ.1,775
2022-23 రూ.2,120
2023-24 రూ.3,967
2024-25 రూ.6,088
మొత్తం రూ.17,955
బీజేపీకి భారీగా విరాళాలు
- Advertisement -
- Advertisement -



