Tuesday, December 23, 2025
E-PAPER

యూరియా యాప్‌

- Advertisement -

రైతులకు తప్పని తిప్పలు
యాప్‌లో నమోదు చేసుకుంటేనే యూరియా
24 గంటల్లో బస్తాలు తీసుకోకుంటే ఐడీ క్యాన్సిల్‌
స్లాట్‌ బుక్‌ కాకపోతే ఎరువు లేనట్టే!
పాత పద్ధతే కావాలంటున్న రైతులు
యాప్‌తోనే ఉపయోగమన్న అధికారులు

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
రైతులు తమ పంట పొలాల్లో యూరియా చల్లాలంటే తప్పని సరిగా మొబైల్‌ యాప్‌లో నమోదు చేసుకోవాల్సిందే. తమ ఫోన్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని యూరియా కొనుగోలు చేయాలి. యూరియా కొనుగోలు చేయడానికి మొబైల్‌ ఫోన్‌ యాప్‌ ఆధారిత కొనుగోలు వ్యవస్థను రాష్ట్ర వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎరువుల పంపిణీ, అమ్మకాలను సజావుగా నిర్వహించేందుకు ఈ ఫర్టిలైజర్‌ యాప్‌ రూపొందించబడిందని అధికారులు చెబుతున్నారు. ఇకపై యాప్‌లో బుక్‌ చేసుకున్నవారికే యూరియా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సాధారణ పద్ధతిలో యూరియా పంపిణీని అధికారులు నిలిపేశారు. ఈ కొత్త విధానంతో అన్నదాతల కష్టాలు రెట్టింపు కానున్నాయి. యూరియా కోసం ప్రభుత్వాన్ని, యాప్‌లో బుకింగ్‌ కోసం మరొకరిని బతిమాలుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన చేయకుండా స్లాట్‌ ఎలా బుక్‌ చేసుకోవాలని రైతులు అంటున్నారు.

వానాకాలంలో యూరియా కోసం రైతులు యుద్ధమే చేశారు. ఏ ఎరువుల దుకాణం వద్ద చూసినా రైతులు, చెప్పులు, పాస్‌ పుస్తకాలు క్యూ లైన్లలో కనిపించాయి. రైతులు రోజుల తరబడి దుకాణాల వద్ద పడి గాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా కొరత పల్లెల్లో రక్తాన్ని పారించింది. కొన్నిచోట్ల రైతుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. ప్రస్తుత నిల్వలు, సరఫరా ప్రకారం యాసంగిలోనూ ఇదే పరిస్థితి వస్తుందని ప్రభుత్వం ముందే ఊహించి.. రైతులు, చెప్పుల క్యూలు కనిపించకుండా చేసేందుకు ‘బుకింగ్‌ యాప్‌’ను తెరమీదికి తెచ్చింది. రైతులు ఒక్కసారిగా దుకాణాల వద్దకు వెళ్లకుండా నిలువరించాలని భావిస్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. రైతుకున్న మొత్తం భూమి, సాగు చేస్తున్న భూమి, పంట రకాల ఆధారంగా యూరియా బస్తాలు కేటాయిస్తారు. ఈ బస్తాలను కొనుగోలు చేయడానికి యాప్‌లో బుక్‌ చేసుకుంటే బుకింగ్‌ ఐడీ వస్తుంది. రైతులు ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లి ఆ ఐడీని చెప్పి యూరియా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బుక్‌ చేసుకున్న బ్యాగులు ఒక రోజు రిజర్వ్‌ చేయబడతాయి, ఈ బుకింగ్‌ 24 గంటలు మాత్రమే చెల్లుతుంది.

రైౖతులకు అవగాహన
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ యాసంగి నుంచి వ్యవసాయానికి రైతులకు యూరియా అందించేందుకు ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌ను తీసుకువచ్చారు. ఈ యాప్‌ ద్వారానే యూరియా కావాల్సిన రైతులు బుక్‌ చేసుకోవాలి. ప్రతి రైతు తమ ఫోన్లలోనో లేక తెలిసిన వారి ఫోన్లలోనో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో అడిగే వివరాలను నమోదు చేయాలి. యూరియా బుకింగ్‌ యాప్‌ బాధ్యతను ఉన్నతాధికారులు ఏఈవోలు, డీలర్లపైనే మోపారు. యాప్‌ పనిచేసే విధానంపై ఏఈవోలు, డీలర్లకు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో అవగాహన కల్పించారు. అయితే నేరుగా యాప్‌ అందుబాటులో లేకపోవడంతో మెజారిటీ ఏఈవోలు, డీలర్లకు దాన్ని ఎలా వినియోగి ంచాలనే అంశంపై స్పష్టత రాలేదని చెప్తున్నారు.

యాప్‌తో రైతులకు ఉపయోగం : సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్‌
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌ రైతులకు ఎంతో ఉపయోగకరం. రైతులకు ఎంత యూరియా అవసరం ఉంటుందో అంత మాత్రమే అందిస్తాం. ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకోవడానికి వీలులేదు. ఎక్కువ మంది యూరియా కోసం దుకాణాల వద్ద గూమిగూడకుండా ఉంటుంది. రైతులు తప్పని సరిగా యాప్‌లోనే బుకింగ్‌ చేసుకోవాలి. పట్టాదారులతో పాటు కౌలు రైతులు కూడా యూరియా తీసుకునే వీలుంటుంది. యూరియా కొరత లేదు. ఇప్పటికే 7వేల టన్నుల యూరియా అందుబాటులో ఉంచాం. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా దుకాణాల వద్ద వ్యవసాయ శాఖ అధికారులను అందుబాటులో ఉంచాం. యాప్‌లో బుకింగ్‌ చేసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సహకరిస్తారు. రైతులు ఓటీపీ చెబితే సరిపోతుంది. ఈ యాప్‌పై డీలర్లకు, రైతులకు ఏఈఓల ద్వారా అవగాహన కల్పించాం. మంగళవారం అన్ని రైతు వేదికల్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.

పాత పద్ధతిలో పంపిణీ చేయాలి
రైతులకు పాత పద్దతిలోనే యూరియా సరఫరా చేయాలి. స్మార్ట్‌ఫోన్లతో రైతులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. రైతులందరూ స్మార్ట్‌ ఫోన్లు వాడరు. వారు బుకింగ్‌ చేసుకోలేరు. పాత పద్దతిలోనే పీఏసీఎస్‌ సొసైటీలు, ఎరువుల దుకాణాల ద్వారా యధావిధిగా యూరియాను సరఫరా చేయాలి. ప్రభుత్వం సీజన్‌కు కావాల్సిన యూరియాను ముందే స్టాక్‌ పెట్టుకోవాలి. యూరియా సరఫరాను పాత పద్ధతిలో యధావిధిగా అందించాలి. లేదంటే ఆందోళనలు నిర్వహిస్తాం. -రైతు సంఘం రాష్ట్ర నాయకులు జి.జయరాజ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -