సర్వే ప్రారంభించిన బీఎల్ఓ లు
యుద్ధ ప్రాతిపదికన ఓటర్ల జాబితాల పరిశీలన
ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ హుస్సేన్
నవతెలంగాణ – అశ్వారావుపేట
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సర్ (ఎస్ఐఆర్ – ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియ బుధవారం నుంచి అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఓటర్ల జాబితా సవరణను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించిన మేరకు ఈ సర్వే అశ్వారావుపేట లో బుదవారం ప్రారంభించినట్లు ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ హుస్సేన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—ఎస్‌ఐఆర్ అనేది భారత ఎన్నికల సంఘం చేపట్టిన కీలక ప్రక్రియ అని, అర్హులైన ప్రతి భారతీయ పౌరుడు ఓటర్ల జాబితాలో చేరేలా, అనర్హులు ఎవరూ జాబితాలో లేకుండా చూసేందుకే దీన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలు ఖచ్చితమైనవి, తాజావి, సమగ్రంగా ఉండాలన్నదే ఈ సవరణ లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమాన్ని 2025 అక్టోబర్ 27 న న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ నుంచి ప్రకటించారని గుర్తుచేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం అశ్వారావుపేట లో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
సర్వే విధానం – ముఖ్యాంశాలు :
బీఎల్ఓ లు ప్రస్తుత ఓటర్ల జాబితా తో ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. 40 ఏళ్లు నిండిన ఓటర్లు: 2002 ఓటర్ల జాబితా తో పోల్చి అప్పట్లో ఉన్న నియోజకవర్గం, ఓటు హక్కు వివరాలు పరిశీలిస్తారు. పాత ఎపిక్ (ఎలెక్టోరల్ ఫోటో ఐడీ) ఉంటే తెలంగాణ సీఈఓ వెబ్‌సైట్ లో వెతికి సెల్ఫ్ ప్రోజెన్సీ మ్యాపింగ్ చేస్తారు. 40 ఏళ్ల లోపు వారు: తల్లిదండ్రులు/తాత–నానమ్మలు 2002 జాబితాలో ఎక్కడ ఉన్నారో ఆధారంగా మ్యాపింగ్ చేస్తారు. ఫోటో, చిరునామా, లింగం తదితరాల్లో తప్పులు ఉంటే ఫారం – 8 ద్వారా సవరణ నమోదు చేయాలి. గుర్తించిన తప్పులను ఈ నెల 26 (శుక్రవారం) సాయంత్రం వరకు సంబంధిత సూపర్వైజర్ కు తప్పనిసరిగా తెలియజేయాలని బీఎల్ఓ లకు ఆదేశాలు జారీ చేశారు.
గుర్తింపు పత్రాలు (ఏదైనా ఒకటి సరిపోతుంది)
పాస్ పోర్ట్; కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ లేదా పీఎస్‌యూ ఉద్యోగుల ఐడీ; 1 జూలై 1987కు ముందు జారీ చేసిన ప్రభుత్వ/స్థానిక సంస్థలు/బ్యాంకులు/ఎల్ఐసీ ఆధారాలు; జనన ధ్రువీకరణ పత్రం; కుల ధ్రువీకరణ పత్రం; గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయ విద్యా ధ్రువీకరణ; స్థిర నివాస ధ్రువీకరణ; అటవీ హక్కుల పత్రం; జాతీయ గుర్తింపు కార్డు; స్థానిక అధికారులు జారీ చేసిన కుటుంబ గుర్తింపు; ప్రభుత్వం జారీ చేసిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం. బీఎల్ఓ లకు అవసరమైన పత్రాలు చూపించి సర్వేకు సహకరించాలని ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ హుస్సేన్ ప్రజలను కోరారు.



