తెలుగు సాహిత్యంలో నానీల ప్రక్రియ వెలువడి దాదాపు మూడు దశాబ్దాలు కావొస్తుంది. అయినా ఎక్కడో ఒకచోట నానీలు వినపడుతూనే వున్నాయి. కొత్తనీరు వస్తూనే వుంది. వివిధ రకాల కవులు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ అస్తిత్వాల నుంచి రాసినప్పుడే ప్రక్రియలకు వస్తువిస్తతి, భావ విస్తతి వచ్చి చేరుతుంది. వ్యక్తీకరణ కూడా స్వరం మార్చుకుంటుంది.
హైకులు, నానీలు, రెక్కలు లాంటి ప్రక్రియలకు అల్పాక్షరాలలో విస్తతార్థాన్ని చెప్పడం అవశ్యం. ఏ మాత్రం అటు ఇటు అయినా కవి విఫలం అవడం ఖాయం. అయితే కవి ఎంతగా ప్రక్రియను ఆకళింపు చేసుకొని, రక్తనిష్టం చేసుకుంటే అంతగా కవిత్వం ఆ ప్రక్రియలోకి ఒదుగుతుంది. దీనికి సాధన, అభ్యాసం, వ్యక్తీకరణ అవసరం. వ్యక్తీకరణలో స్థానిక భాషల, యాసల గుబాళింపు వచ్చి చేరటం కూడా వైవిధ్యం ఇస్తుంది. ఆ వ్యక్తీకరణలో స్వరానికి చాలా ప్రాధాన్యత వుంది. హైకులో అధిక్షేపణ, వ్యంగ్యం వున్నప్పుడు వాటిని సెన్‌ర్యూ (Satirical Haiku) అన్నారు. నానీకి ఆ బాధ లేదు. అన్ని వ్యక్తీకరణలను కలుపుకుపోతుంది. అయితే సమాజంలో వున్న అవకరాల్ని, అవకతవకల్ని, అసమానతల్ని చెప్పడానికి ఈ వ్యంగ్యాత్మక వ్యక్తీకరణ ఒక మేలైన సాధనం.The poet
waits quietly to paint the unsaid అని Atticus అన్నట్టుగా డా.గుండి రామ్‌కుమార్ తన ‘ నానీల మువ్వలు’ పుస్తకం నిండా అలాంటి పైకి తేలని వ్యంగ్యంతో తన వ్యక్తీకరణను ఒక పరికరంగా పలికించాడు. చూడండి :’దేనికండీ మీరు / వారసులు? ఆస్తులకా!/ ఆత్మీయతలకా!’ అనడం చూడండి. సమాజంలో నిండివున్న ఒక రకమైన మానసిక స్థితి మీద పెట్టిన చురక. ఒకసారి ఉలిక్కిపడి లోనికి చూసుకొని, మనని మనం సర్దుకుంటాము.
మరికటి : ‘రక్తహీనత/ ఉందా ఫరవాలేదు/ చరిత్ర హీనత / లేకుంటే చాలు’ జబ్బు శారీరకమైతే ఫరవాలేదు. మానసికమైతేనే కష్టం అని పలుకుతున్న ఈ నానీ ‘చరిత్ర హీనత’ అన్న మాటతో మొత్తం మానవ జీవితాన్ని జల్లెడ పట్టింది. ఇది మనుషులు ఎలా తమ జీవితాలను గడపాలో కూడా అన్యాపదేశంగా చెపుతున్నది. అల్పాక్షరాలలో అనంతార్థం అంటే ఇదే.
చీల్చినా తొక్కినా/ గింజనిస్తుంది భూమి/ అడుగడుగునా మొక్కవేమి? ఈ నానీలో కూడా అర్థవైచిత్రి వుంది. గోపిగారు చెప్పినట్టు సహకారం అంటే సాయం మాత్రమే కాకుండా మామిడిచెట్టు కూడా అన్నట్లు ఇక్కడ కూడా మొక్కవేమి? అంటే మొక్కలు నాటవేమి? వాటికి మొక్కవేమి? అనే రెండు అర్థాలు ఒకే సమయంలో పలుకుతున్నాయి. కవి చమత్కారం కు ఇది ఉదాహరణ. పర్యావరణం కూడా ఇందులో పనిలో పనిగా పలికింది.
‘తెల్ల కాగితమా!/ నువ్వే స్వచ్ఛమా!?/ ఆదివాసుల/ హదయాలున్నారు’. ‘వాళ్ళంతా/ దుశ్శాసనుడి సంతతి/ అడవి తల్లిని/ వివస్త్రను చేసారు’ అంత స్వచ్ఛమైన మనసు కలిగిన అడవి బిడ్డలని, అడవి తల్లిని చెరపట్టి కార్పోరేటు ప్రభుత్వాలు వారిని విస్థాపితుల్ని చేయడం నేడు మనం గమనిస్తున్నాం. ఇలాంటి సామాజిక అంశాలను కూడా కవితాత్మకంగా నానీ చేయడం రామ్‌కుమార్ లో కనిపిస్తుంది. అందుకే Georges Braque Reality only reveals itself when it is illuminated
by a ray of poetry .. అన్నాడు. ఏ కవీ కూడా పరిస్థితి కొంత మెరుగవుతుందన్న ఆశాభావంతో చెప్పకపోతే ఈ విషయాలు ఎలా వెలుగులోకి వస్తాయి..?
‘రామ్‌కుమార్ రాసిన నానీల మువ్వలు చదువుతుంటే, మళ్ళా ఆ శుభ్ర సంగీత గహావరణంలో అడుగుపెట్టినట్టు అనిపించింది.’ అని చినవీరభద్రుడు గారు అనడం వెనకాల ఈ నానీల మువ్వల నాదాలు పఠిత మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి కనుకనే ఈ కవిత్వానికి సంగీతం సరసన ఆయన స్థానం కల్పించారు. ‘సంగీత సాహిత్య సమలంకతే’ అన్నారు కదా. దేశీయత, స్థానికత, కవితాత్మకత, మానవత రామ్‌కుమార్ నానీల సొత్తు’ అని ఎన్.గోపీగారు అనడంఈ నానీలకు ఒక కితాబు. అది సత్యం కూడా.
అయితే నానీల మువ్వలు లో మోగని మువ్వలు కూడా వున్నాయి. ఈ మోగని మువ్వలను గుర్తుపట్టాలంటే రచనల పట్ల, దాని పరిపక్వత పట్ల మనకు నిర్మమకారమైన దష్టి వుండాలి. అది అంత తేలికగా అబ్బే విద్య కాదు. మహామహులే దీనిని సాధించలేక పోయారు. ఈ నానీల మువ్వల అందెలను కాస్త శ్రద్ధగా మెరుగుపెట్టి వుంటే మరింత మెరుగైన కవిత్వ మువ్వల నాదాన్ని మనం ఆలకించేవాళ్ళం కదా అని నా వేడికోలు.
పి..శ్రీనివాస్ గౌడ్,
99494 29449
‘నానీల మువ్వలు’ లో కవితా నాదాలు
- Advertisement -
- Advertisement -



