భారత్, శ్రీలంక నాల్గో టీ20 నేడు
తిరువనంతపురం : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ విజేతలు టీమ్ ఇండియా.. పొట్టి ఫార్మాట్‌లో దుమ్మరేపుతోంది. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు సమష్టిగా చెలరేగటంతో శ్రీలంక మహిళలపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ హర్మన్‌ప్రీత్‌సేన అలవోక విజయాలు నమోదు చేసింది. విశాఖపట్నంలో రెండు టీ20లు, తిరువనంతపురంలో మూడో టీ20లో గెలుపొందిన భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో ఇప్పటికే కైవసం చేసుకుంది. సిరీస్‌లో నామమాత్రపు చివరి రెండు టీ20లు సైతం తిరువనంతపురంలోనే జరుగుతాయి. నేడు నాల్గో టీ20లో ఆతిథ్య భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం అవుతుంది.
జోరుమీదున్న భారత్ :
ఆతిథ్య భారత్ జోరు మీద కనిపిస్తోంది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ గత మ్యాచ్‌లో దంచికొట్టింది. స్వల్ప లక్ష్య ఛేదనలో విశ్వరూపం చూపించిన షెఫాలీ వర్మ శ్రీలంక బౌలర్లను చిత్తు చేసింది. స్మృతి మంధాన, జెమీమా రొడ్రిగ్స్‌కు తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం మంచి ఫామ్‌లో ఉంది. బౌలర్లు రేణుక సింగ్, దీప్తి శర్మ, శ్రీచరణిలు వికెట్ల వేటలో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే సిరీస్‌ను సాధించిన టీమ్ ఇండియా.. నేడు నాల్గో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి రికార్డు స్కోరు సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బ్యాటింగ్ లైనప్‌లో అందరూ ఫామ్‌లో ఉండటంతో భయమెరుగని బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డులు సాధించాలనే తపన డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపిస్తోంది. మరోవైపు శ్రీలంక మహిళలు చివరి రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటి ఊరట విజయం ఖాతాలో వేసుకోవాలని ఎదురుచూస్తున్నారు.



