Sunday, December 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణిని ప్రయివేటీకరించేందుకు సర్కార్‌ కుట్ర

సింగరేణిని ప్రయివేటీకరించేందుకు సర్కార్‌ కుట్ర

- Advertisement -

దివాలా తీయించేందుకు సంస్థ సొమ్ము దుబారా
డిపెండెంట్‌ ఉద్యోగాలివ్వడంలో నిర్లక్ష్యం : మాజీ మంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సింగరేణి సంస్థను ప్రయివేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్‌ గౌతమ్‌ను కలిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. సంస్థను ఆర్థికంగా దివాలా తీయించి తద్వారా ప్రయివేట్‌కు ధారాదత్తం చేసే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలైన ఎస్పీడీసీఎల్‌, ఎన్సీపీడీఎల్‌ నుంచి సింగరేణికి రూ.42 వేల కోట్లు రావాల్సి ఉండగా, వాటిని చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణికి ఆ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి కార్మికులు జీతాల కోసం అగచాట్లు పడుతుంటే సంస్థకు చెందిన సొమ్మును సీఎం రేవంత్‌రెడ్డి దుబారా చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మెస్సీ ఫుట్‌బాల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌కు సింగరేణి సంస్థకు చెందిన రూ.100 కోట్లు వ్యయం చేశారని ఆరోపించారు.

కార్మికుల బోనస్‌ విషయంలోనూ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. 2024 25 ఆర్థిక సంవత్సరంలో 6,394 కోట్ల నికర లాభం సాధించినా, బోనస్‌ కేవలం 2,360 కోట్లుగానే పరిగణించి 34 శాతం మాత్రమే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో మొత్తం లాభంపైనే బోనస్‌ ఇవ్వగా, ప్రస్తుతం 50 శాతం కోత విదించారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై విచారణ చేస్తామని హెచ్చరించారు. అలాగే డిపెండెంట్‌ ఉద్యోగాలివ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని ఆరోపించారు. మొత్తం వారసత్వ ఉద్యోగాల్లో సగం మందికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్‌ బోర్డును క్రమం తప్పకుండా నిర్వహించి అర్హులందరికి న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ మాట తప్పిందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్‌ బోర్డును వెంటనే సమావేశ పర్చి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -