Thursday, January 1, 2026
E-PAPER
Homeమానవికొత్తగా మొదలెడదాం...

కొత్తగా మొదలెడదాం…

- Advertisement -

జరిగిపోయిన కాలం తిరిగిరాదు. అందుకే ఆనందోత్సాహాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుదాం. గత ఏడాది అందించిన చేదు అనుభవాలను పాఠాలుగా అంగీకరిద్దాం. తీపి గురుతులను అపురూప జ్ఞాపకాలుగా, భవిష్యత్‌ లక్ష్యాలకు ఇంధనంగా మలుచుకుని ముందుకు సాగుదాం. కొంతమందికి గత ఏడాది వ్యక్తిగతంగా, వృత్తిగతంగా సంతృప్తిని ఇచ్చి ఉండకపోవచ్చు. అందుకు కారణమేంటో విశ్లేషించుకోండి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

చాలామంది, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే అనుకుంటారు. మనసును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. కరోనా తర్వాత మహిళలు మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు మొదలైన రుగ్మతలకు గురి అవుతున్నవారిలో మహిళలే ఎక్కువని అధ్యయనాలు అంటున్నాయి. కుటుంబ సమస్యలు, ఆఫీసులో పనుల కారణంగా మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

మన కోసం కాసేపు
కొత్త ఏడాది రాగానే చాలామంది కొత్తకొత్త తీర్మానాలు చేసుకుంటారు. జిమ్‌కు వెళ్లాలనో, వాకింగ్‌ చేయాలనో, పొదుపుకు శ్రీకారం చుట్టాలనో ఆలోచిస్తారు తప్ప, మానసిక దృఢత్వం గురించి ఏమాత్రం పట్టించుకోరు. మానసిక ఆరోగ్యంపై వెచ్చించే సమయం, డబ్బు ఏమాత్రం వృథా కాదు. రోజూ కొంత సమయమైనా మన కోసం మనం కేటాయించుకోవాలి. సానుకూల దృక్పథాన్ని అందించే స్నేహితులు, ఆత్మీయులతో సమయాన్ని గడపాలి.

జాగ్రత్త
మన దేశంలో 93 శాతం మంది మహిళలకు ఇంటర్నెట్‌ సురక్షిత వాడకం గురించి తెలియదు. అశ్లీల చిత్రాలు చూడటం, తెలియని వ్యక్తులతో చాటింగ్‌ చేయడం, నగ్న‌ వీడియో కాల్స్‌.. ఇలా అమాయకంగా మోసగాళ్ల వలలో పడుతున్నారు. ఇదే అవకాశంగా ఆ దుర్మార్గులు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. లేదంటే ఆ చిత్రాలను ఏవో వెబ్‌సైట్లకు అమ్మేస్తున్నారు. కొన్నిసార్లు మైనర్‌ బాలికలు ఇంట్లోంచి వెళ్లిపోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో.. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. పిల్లల్ని ఎంతసేపూ కంప్యూటర్‌ ముందు కూర్చో, ఫోన్లో చూసి చదువుకో అని పురమాయిస్తున్నారే తప్ప, ఏ పద్ధతిలో ఇంటర్నెట్‌ను ఉపయోగించాలన్నది పెద్దలకే తెలియడం లేదు. దాంతో పిల్లలు సులభంగా పెడదారులు పడుతున్నారు. సోషల్‌ మీడియాకు అలవాటు పడి నలుగురిని కలుసుకునే సామాజిక జీవితానికి దూరమవుతున్నారు. ఇది అప్పటికప్పుడు వినోదంలా అనిపించినా, తీవ్ర నేరాలకు దారితీస్తున్నాయి.

భోజనాన్ని ప్రేమించండి
ఇల్లు, పిల్లలు, ఉద్యోగం.. ఇలా రకరకాల బాధ్యతలలో పడిపోయి మహిళలు తిండి గురించి పట్టించుకోవడం మానేశారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలన్న ఆలోచనే రాదు. మహిళల శ్రమకు, వాళ్లు తీసుకునే ఆహారానికి ఏమాత్రం పొంతన ఉండదు. అందుకే చిన్న వయసులోనే రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. బాల్యం వరకూ ఫర్వాలేదు. కానీ రుతుక్రమం మొదలైన దగ్గరనుంచీ ఆడపిల్లలకు పరిపూర్ణ పోషకాహారం తప్పనిసరి. పురుషులతో పోలిస్తే మహిళలకు క్యాలరీలు తక్కువగా విటమిన్స్‌, మినరల్స్‌ ఎక్కువగా అవసరం అవుతాయి. రుతుక్రమం, గర్భధారణ, మెనోపాజ్‌ దశల్లో రక్తహీనత, ఎముకల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్‌-డి, విటమిన్‌-బి9 అందించే పదార్థాలు తప్పక తీసుకోవాలి.

ఈ ఏడాది ఆహారంలో..
మాంసం, కాలేయం, గుడ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్‌ మొదలైన వాటిలో ఐరన్‌, జింక్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌) లక్షణాలు తగ్గుతాయి. పాలు, పెరుగు, చీజ్‌, ఆకుకూరల్లోని క్యాల్షియం కూడా ఆ ప్రభావం నుంచి ఊరటనిస్తాయి. వేపుళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌, ఉప్పు కుమ్మరించిన స్నాక్స్‌కు దూరంగా ఉండటం మంచిది. రోజూ ఒక మల్టీవిటమిన్‌ సప్లిమెంట్‌ లేదా మెగ్నీషియం, విటమిన్‌ బి6, విటమిన్‌-ఇ అందించే ఆహారం తీసుకుంటే అన్నిరకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫైబర్‌ తగ్గితే మలబద్ధకం వస్తుంది. తరచూ బీన్స్‌, బెర్రీస్‌, ఆకుకూరలు తీసుకోవాలి. నిత్య వ్యాయామం, రోజూ ఏడెనిమిది గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం.

ఆరోగ్యం జాగ్రత్త!
మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. దేశమూ ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మహిళలు మాత్రం వారి గురించి పట్టించుకోవడం లేదు. కుటుంబ సేవలో తమను తాము కరిగించుకుంటున్నారు. ఈ కొత్త ఏడాది నుంచి అయినా మహిళలు ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ పెట్టాలి. ఏ రుగ్మతా హఠాత్తుగా ఊడిపడదు. చిన్నగా మొదలై తీవ్రస్థాయికి చేరుతుంది. పరిస్థితిని మనం అంతదాకా రానివ్వకూడదు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు (బీపీ), కొలెస్ట్రాల్‌, మధుమేహం, రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌, పెద్దపేగు క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్‌ మొదలైన రుగ్మతలకు సంబంధించి కనీసం ఏడాదికోసారి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. పరీక్ష తర్వాత ఆ నివేదికలను నిపుణులకు చూపించాలి.

సొంత వైద్యం వద్దు
ఆహారాన్ని మించిన ఔషధం లేదు. కానీ, చాలా సందర్భాల్లో మహిళలు పోషక విలువలను పట్టించుకోరు. కుటుంబమంతా తిన్నాక, మిగిలిందే తినేస్తారు. కొన్నిసార్లు అర్ధాకలితో కడుపు మాడ్చుకుంటారు. ఇంకొన్నిసార్లు అవసరానికి మించి తింటారు. రెండూ మంచి పద్ధతులు కాదు. వృద్ధాప్యంలో ఎదురయ్యే రుగ్మతలను అధిగమించాలంటే.. యుక్తవయసు నుంచే ఎముకలకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే పురుషుల కంటే మహిళల్లోనే ఎముకల సమస్యలు త్వరగా వస్తాయి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవాలి. ఏ సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాకే మందులు వాడాలి. సొంత వైద్యం వద్దు. రుతుక్రమంలో మార్పులను గుర్తించిన వెంటనే అప్రమత్తం కావాలి.

ఆర్థిక స్వేచ్ఛ
ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు నిర్వహిస్తున్నా చాలామంది మహిళలు ఆర్థిక విషయాల్లో పురుషులపైనే ఆధారపడుతున్నారు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రయత్నం చేసినా.. భర్త, పిల్లలు నిరుత్సాహపరుస్తున్నారు. మరోవైపు ఖర్చు తప్ప, పొదుపు తెలియని వారిగా మహిళలను చిత్రీకరిస్తున్నారు. వీళ్లంతా కొత్త ఏడాదినుంచి అయినా ఆర్థిక ప్రణాళిక, దీర్ఘకాలిక లక్ష్యం వైపు అడుగులు వేయాలి.

పొదుపు-మదుపు
మెజారిటీ మహిళలు ఆదాయంలోంచి ఎంతోకొంత పొదుపు చేస్తారు. కానీ దాచుకున్న డబ్బును ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలన్న విషయంపై అతి తక్కువ మందికే అవగాహన ఉంటున్నది. కష్టపడి మిగుల్చుకున్న సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఈ-బంగారం.. తదితర మార్గాల్లో మదుపు చేయవచ్చు. రూపాయి మరో రూపాయిని సంపాదించేలా ఆర్థిక వ్యూహాన్ని రచించుకోవాలి. ఉద్యోగినులైతే పన్నుల భారం పడకుండానే మదుపు చేయడంపై దృష్టిపెట్టాలి. ఇంటర్నెట్‌ పుణ్యమా అని ఉపాధి అవకాశాలు విస్తృతం అయ్యాయి. పెయింటింగ్స్‌, కుట్లు, అల్లికలు, హౌమ్‌ చెఫ్‌, ట్యూషన్స్‌.. ద్వారా ఎంతోకొంత ఆర్జించే అవకాశం ఉంది. వర్క్‌ ఫ్రమ్‌ హౌమ్‌ కూడా ఓ మంచి అవకాశం. సంపాదన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సమాజంలో ఓ గుర్తింపును తెస్తుంది. జీవన నాణ్యతను పెంచుతుంది. వృద్ధాప్యంలో ఆసరాగా నిలబడుతుంది.

ఫిట్‌ నెస్‌ మరవద్దు
కొత్త ఏడాది ముఖ్య నిర్ణయాల్లో ఫిట్‌నెస్‌ ఒకటి. కాకపోతే ఆ తీర్మానం డైరీకే పరిమితం అవుతున్నది. ఒకటి రెండు రోజుల్లోనో, ఒకటిరెండు నెలల్లోనో ఆ ఉత్సాహం నీరుగారిపోతున్నది. ఫిట్‌గా ఉండాలన్న నిర్ణయం మంచిదే. నేటి నుంచే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టండి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్లే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇకనైనా తమను తాము ప్రేమించుకోవాలి. తమ ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలన్నది తెలుసుకోవాలి. పక్కా ప్రణాళికతో రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -