భారతదేశంలో మహిళా శాస్త్రవేత్తలు తయారుకావడానికి చాలా కాలం కిందటే కోయంబత్తూరు పరిశోధనా కేంద్రంలో ఒంటరిగా చేతులు చుట్టుకుని చెరుకు మొక్క నిర్మాణ శాస్త్రాన్ని పరిశీలించింది. ఆమెను చూస్తే సామాజిక కట్టుబాట్లను ప్రశ్నించే వ్యక్తిలా కనిపించదు. కానీ జీవితం పట్ల ఎంపికలు, ఒంటరితనం, మొండి పట్టుదల, ప్రతిభ ఆమెను భారతీయ శాస్త్ర నియమాలను తిరిగి రాసేలా చేశాయి. అమ్మాయిలకు బాల్య వివాహాలు చేసి చేతులు దులుపుకునే దేశంలో పుట్టిన ఆమె అమెరికా వెళ్లేందుకు ఓడ ఎక్కింది, మహిళలు కళాశాల డిగ్రీ అందుకోవడమే ఎంతో గొప్పగా భావించే కాలంలో పీహెచ్‌డీ సంపాదించింది. ఆమె వేసే ప్రతి అడుగు ఆశ్చర్యపరిచే మొక్కల సైటోజెనెటిక్స్‌లో ప్రావీణ్యంతో తిరిగి వచ్చింది. ఆమే జానకి అమ్మాళ్. వృక్షశాస్త్రజ్ఞురాలిగా భారతదేశంలోనే పీహెచ్‌డీ చేసిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
కేరళకు చెందిన జానకి అమ్మాళ్ జాతీయ పంట జన్యుశాస్త్రాన్ని మార్చివేశారు. దీనికోసం కుల, లింగ పక్షపాతాన్ని ఎదిరించారు. తన పరిశోధన కోసం లండన్‌లో నాజీ బాంబు దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. బ్రిటన్‌లో జర్మన్ బాంబుల వెలుగులో రాత్రుళ్లు పనిచేశారు. స్వతంత్ర భారతదేశానికి దాని శాస్త్రీయ పునాదులను పునర్నిర్మించాల్సిన అవసరం వచ్చినప్పుడు, జవహర్‌లాల్ నెహ్రూ ఆమెను పిలిచాడు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునర్వ్యవస్థీకరించమని కోరాడు. వెంటనే తన పనిని ప్రారంభించారు. తన జీవితాంతం ఆమె చెరకు జన్యుశాస్త్రాన్ని మార్చేందుకు కృషి చేశారు. వేలాదిగా పుష్పించే మొక్కలను కనుగొన్నారు. అడవులను కాపాడారు. ఆమె పేరు మీద మాగ్నోలియా పేరు పెట్టేంత లోతైన శాస్త్రీయ పరిశోధనలు చేశారు. ఎనభై ఏడేండ్ల వయసులోనూ ప్రయోగాలు చేశారు. అయినప్పటికీ భారతీయ వృక్ష శాస్త్రంలో పెద్దగా గుర్తింపు పొందలేకపోయారు జానకి అమ్మాళ్. పరిశోధనల్లో మునిగిపోయి తన వ్యక్తిగత జీవితాన్నే వదులుకున్నారు.
జ్ఞానంలో పాతుకుపోయిన బాల్యం
జానకి జీవితం తెల్లిచెర్రి (నేటి తలస్సేరి)లో నిరంతరం చర్చించుకునే ఇంట్లో ప్రారంభమవుతుంది. ఆమె నవంబర్ 4, 1897న, నేర్చుకోవాలనే అంతులేని కోరికున్న సబ్ జడ్జి కృష్ణన్, ఎంతో ఓర్పుతో ఇంటిని నడిపే దేవియమ్మల్ దంపతులకు జన్మించారు. కృష్ణన్ అరుదైన మొక్కల తోటను పెంచేవారు. ప్రతి ఆకు, మొగ్గపై వివరణాత్మక వ్యాసాలు రాశారు. అతని రెండు వివాహాలలో మొత్తం పంతొమ్మిది మంది పిల్లలు పుస్తకాలు, పచ్చదనం మధ్య పెరిగారు. రెండవ వివాహం ద్వారా పదవ సంతానంగా పుట్టిన జానకి వృక్షశాస్త్రం, కవిత్వం గురించి తండ్రి చెప్పే మాటలు వింటూ ఉత్సాహపడేవారు. బాల్యంలో ఆమెకు ఎంతో స్వేచ్ఛ ఉండేది. ఆ కాలంలో ఇది అసాధారణమైన విషయం. తండ్రి మొక్కలను ఎలా పెంచుతున్నాడో జాగ్రత్తగా పరిశీలించడం వల్లనే తాను వృక్ష శాస్త్రవేత్తగా మారానని ఆమె చెప్పుకునేవారు.
తనను తాను ఎంచుకున్న స్త్రీ
తెల్లిచెర్రీలో ప్రాధమిక విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె మద్రాస్‌లో చదువుకున్నారు. క్వీన్ మేరీ కళాశాల ఆమె ప్రపంచాన్ని విస్తృతం చేసింది. ప్రెసిడెన్సీ కళాశాల దానికి మరింత పదును పెట్టింది. 1920ల ప్రారంభం నాటికి వృక్షశాస్త్ర డిగ్రీ, సాధించాలనే దృఢమైన సంకల్పంతో పాటు బార్బర్ స్కాలర్‌షిప్ ఆమె కోసం వేచి ఉంది. కుటుంబం ఆమెకు పెండ్లి చేయాలని భావించింది. కానీ జానకి నిరాకరించారు. ఒంటరిగా అమెరికాకు ప్రయాణించారు (4-6 వారాల ప్రయాణం). అప్పటి చాలా మంది యువతులకు ఇది ఊహించలేని మార్పు. మిచిగాన్‌లో ఆమె ఎన్నో నేర్చుకున్నారు. 1925లో మాస్టర్స్ డిగ్రీ పొందిన తర్వాత కొన్నేండ్లు భారతదేశానికి తిరిగి వచ్చి పాఠాలు బోధించారు. 1931లో డాక్టరేట్ పూర్తి చేయడానికి మళ్లీ వెళ్లారు. మిచిగాన్ విశ్వవిద్యాలయం 1956లో ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
తియ్యటి చెరుకు కోసం…
భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె కొంతకాలం త్రివేండ్రంలో అధ్యాపకురాలిగా పని చేశారు. ఇంకా ఏదో చేయాలనే ఆమె కోరికకు చెరకు రూపంలో సమాధానం వచ్చింది. భారతదేశానికి తీపి చక్కెరను ఇచ్చిన శాస్త్రవేత్త ఆమె. 1930లో దేశంలో ఒక సమస్య ఉంది. స్థానిక చెరుకు రకాలు అంత తీపిగా ఉండేవు కావు. మన రైతులు చెరుకు పండిస్తున్నా తియ్యటి చెరుకుకోసం విదేశాలపై ఆధారపడేవాళ్లం. అప్పుడే కోయంబత్తూరులోని చెరకు తోట కేంద్రం దాన్ని మార్చడానికి ప్రయత్నించింది. జానకి ఈ ప్రాజెక్టులో సైటోజెనెటిస్ట్‌గా చేరారు. అంటే ఆమె క్రోమోజోమ్‌లు, వారసత్వాన్ని అధ్యయనం చేసే నిపుణురాలు. సూక్ష్మదర్శిని, పుప్పొడి నమూనాలు, గాజు సీసాలతో ఓ ఇరుకైన ప్రయోగశాలలలో ఆమె తియ్యటి చెరుకును కనుగొన్నారు. నేడు మనకు తెలిసిన చెరుకు దాని రుచిలో ఎక్కువ భాగం ఆమె కృషి ఫలితంగానే వచ్చింది.
భారతదేశం తన ఇంటికి పిలిచింది
1951లో జవహర్‌లాల్ నెహ్రూ ఆమెను తిరిగి ఆహ్వానించాడు. భారతదేశానికి ఆమెలాంటి శాస్త్రవేత్తలు అవసరమని ఆయన గుర్తించారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునర్వ్యవస్థీకరించమని ఆయన ఆమెను కోరారు. ఆమె అంగీకరించి కలకత్తాలో చిందరవందరగా ఉన్న ఒక కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె తన సహోద్యోగులతో కలిసి భవనాన్ని స్వయంగా శుభ్రం చేసుకున్నారు. తన పరిశోధనలో భాగంగా లడఖ్, వయనాడ్, ఈశాన్యంలోని మారుమూల ప్రాంతాలకు పర్యటించారు. అక్కడి ఔషధ మొక్కలు, గిరిజన జ్ఞాన సంపదను, అప్పటి వరకు పట్టించుకోని పర్యావరణ వ్యవస్థలను అధ్యయనం చేశారు.
నిజమైన వారసత్వం
పర్యావరణ చర్చల్లో కూడా ఆమె తన స్వరం వినిపించారు. కేరళ సైలెంట్ వ్యాలీ జలవిద్యుత్ ప్రాజెక్టుకు ముప్పు వచ్చినప్పుడు దాని కోసం గట్టిగా మాట్లాడారు. తీవ్రమైన పర్యావరణ నష్టం గురించి హెచ్చరించారు. డెబ్బైల వయసులో ఉండి కూడా ప్రయాణించడం, నిరసన వ్యక్తం చేయడం, రాయడం మాత్రం మానుకోలేదు. ఫిబ్రవరి 7, 1984న ఆమె మధురవోయల్‌లోని తన ల్యాబ్ టేబుల్ వద్దనే మరణించారు. 1977లో ఆమెకు పద్మశ్రీ వచ్చింది. ఆ తర్వాత అనేక గౌరవాలు వచ్చాయి. జమ్మూలోని ఒక హెర్బేరియం ఆమె జ్ఞాపకంగా స్థాపించబడింది. అయితే ఆమె నిజమైన వారసత్వం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఒక కప్పు టీలో చక్కెర కరిగిన ప్రతిసారీ, ఒక వృక్షశాస్త్రజ్ఞుడు పాలీప్లాయిడ్‌ను అధ్యయనం చేసిన ప్రతిసారీ, ఒక చిన్న పట్టణంలోని ఒక యువతి సైన్స్‌లో తన జీవితాన్ని కలలు కని దాని నుండి కుచించుకుపోని ప్రతిసారీ జానకి అమ్మాల్ కథ మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది.
తిరస్కరణలు భరించలేక
జానకి తన పరిశోధనలో భారతీయ చెరకు మూలాలను కూడా కనుగొన్నారు. ఇది సాచరమ్ స్పాంటేనియం అనే ఒక ముఖ్యమైన జాతి. ఇది భారతదేశానికి చెందినదని నిరూపించారామె. కానీ కోయంబత్తూర్ దీన్ని తట్టుకోలేకపోయింది. ఒంటరి మహిళ కావడంతో పాటు వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఆమెను చాలామంది శత్రువుగా చూశారు. తనను తిరస్కరించే వారి ముందు ఉండలేక లండన్‌కు బయలుదేరారు. 1940లో లండన్ ముట్టడిలో ఉంది. రాత్రంతా జర్మన్ బాంబులు పేలుతుండేవి. జానకి పగటిపూట జాన్ ఇన్నెస్ హార్టికల్చరల్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేసి, బాంబులు పేలే సమయంలో మంచం కింద దాక్కునేవారు. ఎప్పుడూ ఆమె తనను నిలబెట్టిన శాస్త్రంపైనే దృష్టి పెట్టారు. రాయల్ హార్టికల్చరల్ సొసైటీలో చేసిన పనికి ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.



