Saturday, January 3, 2026
E-PAPER
Homeజాతీయంభారత గగనతలం దారాదత్తం

భారత గగనతలం దారాదత్తం

- Advertisement -

విదేశీ విమాన కంపెనీలకు అప్పగించే కుట్ర
ద్వైపాక్షిక ఒప్పందాల్లో అనుమతివ్వాలి : కేంద్ర ప్రభుత్వంపై అదానీ గ్రూప్‌ ఒత్తిడి
ఎయిర్‌ ఇండియా, ఇండిగో ఆందోళన

విదేశీ విమానయాన కంపెనీలకు భారత గగనతలాన్ని పూర్తిగా తెరిచిపెట్టాలని అదానీ గ్రూపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. ఇటీవల పలు దేశాలతో భారత్‌ కుదుర్చుకుంటున్న ద్వైపాక్షిక ఒప్పందాల్లో విదేశీ కంపెనీలకు అనుమతులివ్వాలని కోరినట్లు ఆంగ్లమీడియాలో విస్తృత కథనాలు వస్తోన్నాయి. భారత్‌లో అదానీ గ్రూప్‌ ప్రస్తుతం ఎనిమిది విమానాశ్రయాలు నిర్వహిస్తూ..ఈ రంగంలో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. అదానీ వ్యాపారం పెరుగుదల కోసం ఇతర దేశీయ విమాన కంపెనీలను పణంగా పెట్టేందుకు కేంద్రంతో సంప్రదింపులు చేెస్తోన్నట్టు తెలుస్తోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, సింగపూర్‌, ఇండోనేషియా, మలేషియాతో సహా పలు దేశాలతో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానయాన కంపెనీలకు అనుమతించేలా చూడాలని ఒత్తిడి చేస్తోంది.

న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన గగనతలం విదేశీ విమాన సంస్థలకు అప్పగింతపై రెండు అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ సంస్థలైన ఎయిర్‌ ఇండియా, ఇండిగో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ సిఫారసులకు విరుద్ధంగా అదానీ ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపాయి. విదేశీ ఎయిర్‌లైన్స్‌కు భారత గగనతలాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకు రావడం వల్ల పశ్చిమ ఆసియాలోని భారీ నగదు నిల్వలున్న విమానయాన సంస్థల నుంచి తాము తీవ్రమైన, అన్యాయమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎయిర్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.”ప్రయాణికులకు మరిన్ని ప్రత్యామ్నాయా లను అందుబాటులోకి తీసుకురావడం అనేది భారతీయ విమానాశ్రయాలను ప్రపంచ స్థాయి హబ్‌లుగా మార్చడంలో కీలకమైన అంశం.

ఇది కేవలం భారతీయ విమానయాన సంస్థలు పోటీకి సిద్ధంగా ఉన్నాయా లేదా అనే దానిపై మాత్రమే ఆధారపడి ఆలోచించకూడదు. అంతర్జాతీయ విమాన కంపెనీలకు అనుమతివ్వకపోవడం వల్ల విమానాశ్రయాల ఆస్తులను వృదా చేయడమే అవుతుంది.” అని సదరు అదానీ కంపెనీ అధికారి పేర్కొన్నారు. భారతీయ విమానయాన సంస్థల వినియోగం 80 శాతం దాటితే తప్పా విదేశీ క్యారియర్‌లకు అదనపు విమాన హక్కులు మంజూరు చేయకూడదనే జాతీయ పౌర విమానయాన విధానాన్ని ఉల్లంఘించేలా అదానీ గ్రూపు ప్రతిపాదన ఉండటం ఆందోళకరం. చాలా విదేశీ విమానయాన కంపెనీలు భారతదేశం నుంచి తీసుకెళ్లే ప్రయాణికులలో 70 శాతం కంటే ఎక్కువ మంది ఇతర దేశాలకు వెళ్లేవారేనని ఎయిర్‌ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో భారతీయ సంస్థలు చేస్తున్న పెట్టుబడులకు విఘాతం కలగకుండా మార్పులుండాలన్నారు.

దేశీయ కంపెనీలకు సవాళ్లు..
అదానీ గ్రూప్‌ ప్రతిపాదనలకు కేంద్రం తలొగ్గితే దేశీయ విమాన కంపెనీలు తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొనున్నాయి. ఖతార్‌ వంటి విమాన సంస్థలకు వారి ప్రభుత్వాల నుంచి భారీగా రాయితీలు, నిధుల మద్దతు ఉంటుంది. వాటి వద్ద ఉన్న భారీ నగదు నిల్వలు, తక్కువ ధరకే లభించే ఇంధనం వల్ల అవి టికెట్‌ ధరలను తగ్గించి విక్రయిస్తాయి. దాంతో భారతీయ కంపెనీలు పోటీ పడలేక నష్టాలను చవి చూస్తాయి. దుబారు, అబుదాబి లేదా దోహా వంటి ప్రాంతాల మీదుగా యూరప్‌, ఉత్తర అమెరికాకు ప్రయాణికులను చేరవేసే గల్ప్‌దేశాల ఎయిర్‌లైన్స్‌కు ప్రయాణికులు మళ్లిపోతారు. దీంతో భారతీయ కంపెనీలు నేరుగా ఇతర దేశాలకు నడిపే విమానాలకు ఆదరణ తగ్గుతుంది.

ఈ క్రమంలో దేశీయ విమాన కంపెనీల వ్యాపారం ఒత్తిడికి గురి కానుంది. ఈ ప్రభావం భారత విదేశీ మారకంపైనా పడనుంది. మరోవైపు భారత్‌ కేవలం ఒక ఫీడర్‌ మార్కెట్‌ (ప్రయాణికులను అందించేదిగా) మిగిలిపోయే ప్రమాదం ఉంది. అదానీ గ్రూప్‌ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించడం కోసం విదేశీ విమాన కంపెనీల కోసం వత్తాసు పలుకుతూ.. దేశీయ కంపెనీలను నిర్వీర్యం చేసే యోచనలో ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్‌ నుంచి అత్యంత లాభదాయకమైన అంతర్జాతీయ మార్గాల్లో విదేశీ కంపెనీల వాటా పెరగడం ద్వారా దేశీయ కంపెనీలు దివాలా తీసే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -