Thursday, January 8, 2026
E-PAPER
Homeసోపతిఅక్షర లోకపు మహోత్సవం

అక్షర లోకపు మహోత్సవం

- Advertisement -

న్యూ ఢిల్లీ వరల్డ్‌ బుక్‌ ఫెయిర్‌ 2026

భారతదేశ రాజధాని నగరమైన న్యూ ఢిల్లీలో ప్రతి ఏటా జరిగే ‘వరల్డ్‌ బుక్‌ ఫెయిర్‌’ కేవలం పుస్తకాల ప్రదర్శన మాత్రమే కాదు, అది ఒక అంతర్జాతీయ మేధో సమ్మేళనం. గత 53 ఏళ్లుగా నిరంతరాయంగా సాగుతున్న ఈ ప్రస్థానం, 2026లో సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతోంది. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ (NBT) ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ వేడుక, ప్రచురణా రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్‌-టు-కన్స్యూమర్‌ (B2C) ఈవెంట్‌గా గుర్తింపు పొందింది. 2026 జనవరి 10 నుండి 18 వరకు ప్రగతి మైదాన్‌లోని అత్యాధునిక ‘భారత్‌ మండపం’లో ఈ పుస్తక జాతర జరగనుంది.

న్యూ ఢిల్లీలోని ఐకానిక్‌ భారత్‌ మండపంలోని హాల్స్‌ 2 నుండి 6 వరకు ఈ ప్రదర్శన విస్తరించి ఉంటుంది. సుమారు 1000 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రచురణకర్తలు తమ అద్భుత పుస్తక భాండాగారంతో ఇక్కడ కొలువుదీరనున్నారు. ఈ ఏడాది 3000 కంటే ఎక్కువ స్టాల్స్‌ ఏర్పాటు చేయబడుతున్నాయి. అకడమిక్‌ జర్నల్స్‌ నుండి గ్రాఫిక్‌ నవలల వరకు, పురాతన గ్రంథాల నుండి ఆధునిక సైన్స్‌ ఫిక్షన్‌ వరకు ప్రతి పాఠకుడికి కావలసిన విజ్ఞానం ఇక్కడ లభిస్తుంది. ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌ (ITPO) ఈ కార్యక్రమానికి సహ-నిర్వాహకుడిగా వ్యవహరిస్తూ, సందర్శకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను కల్పిస్తోంది.
ప్రధాన థీమ్‌: ప్రతి ఏటా ఒక ప్రత్యేక అంశాన్ని ఇతివత్తంగా తీసుకునే ఈ పుస్తక మేళా, 2026 కోసం ‘భారత సైనిక చరిత్ర – వీరత్వం, జ్ఞానంఏ75’ అనే థీమ్‌ను ఎంచుకుంది. భారత స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుండి గడిచిన 75 ఏళ్లలో మన సైనిక దళాలు ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలు, యుద్ధ వ్యూహాలు, తత్వశాస్త్రాలను ప్రతిబింబించేలా ఈ విభాగాన్ని తీర్చిదిద్దారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ రూపొందించిన ‘థీమ్‌ పవిలియన్‌’లో అరుదైన ఫొటోలు, ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు, సైనిక చరిత్రకారుల సెమినార్లు పాఠకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

అంతర్జాతీయ సంబంధాలు: ఖతార్‌, స్పెయిన్‌: సాహిత్యం ద్వారా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో చీణఔదీఖీ కీలక పాత్ర పోషిస్తోంది. 2026 ఎడిషన్‌లో ‘ఖతార్‌’ దేశం గెస్ట్‌ ఆఫ్‌ ఆనర్‌ గా వ్యవహరిస్తుండగా, ‘స్పెయిన్‌’ ఫోకస్‌ దేశంగా నిలుస్తోంది. అరబిక్‌ సాహిత్యం యొక్క గొప్పతనాన్ని, మధ్యప్రాచ్య దేశాల కథా వైవిధ్యాన్ని ఖతార్‌ ప్రతినిధులు ప్రదర్శించనున్నారు. అదే సమయంలో స్పానిష్‌ భాషా ప్రభావం, యూరోపియన్‌ సాహిత్య పోకడలను స్పెయిన్‌ స్టాల్స్‌ ద్వారా మనం చూడవచ్చు. ఇది ప్రపంచ సాహిత్య పోకడలను ఒకే చోట తెలుసుకునే సువర్ణావకాశం.
పిల్లల కోసం ప్రత్యేక ప్రపంచం- చిల్డ్రన్స్‌ పవిలియన్‌: భావి తరాల్లో పఠన సంస్కతిని పెంపొందించడమే లక్ష్యంగా ‘చిల్డ్రన్స్‌ పవిలియన్‌’ను అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. ఇక్కడ కథా పఠన సెషన్లు, సజనాత్మక వర్క్‌షాప్‌లు, చిత్రలేఖన పోటీలు, రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి. ప్రసిద్ధ బాల సాహిత్య రచయితలు, చిత్రకారులు , విద్యావేత్తలు నేరుగా పిల్లలతో సంభాషిస్తూ వారిలో పుస్తకాల పట్ల ఆసక్తిని కలిగిస్తారు. ఇది పిల్లల ఊహాశక్తికి రెక్కలు తొడిగే అద్భుత వేదిక.



రచయితల వేదికలు: ఆథర్స్‌ కార్నర్‌, లేఖక్‌ మంచ్‌: రచయితలు, పాఠకుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పెంపొందించడానికి ‘ఆథర్స్‌ కార్నర్‌’, ‘లేఖక్‌ మంచ్‌’ (దీశీశీస ుaశ్రీస) వేదికలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ కొత్త పుస్తకాల ఆవిష్కరణలు, ప్యానెల్‌ చర్చలు, మేధోమథన కార్యక్రమాలు నిరంతరం జరుగుతుంటాయి. యువ రచయితలు తమ ప్రతిభను చాటుకోవడానికి, సాహిత్య దిగ్గజాల సలహాలు పొందడానికి ఇది సరైన ప్లాట్‌ఫామ్‌. సాహిత్య ప్రియులు తమ అభిమాన రచయితలతో ఫొటోలు దిగడానికి, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి ఈ వేదికలు వేదికగా నిలుస్తాయి.
వ్యాపార అవకాశాలు: సిఇఒ స్పీక్‌, రైట్స్‌ ఎక్స్ఛేంజ్‌: NDWBF కేవలం పుస్తకాల అమ్మకానికే పరిమితం కాదు, ఇది ఒక భారీ వ్యాపార కేంద్రం కూడా. ప్రచురణా రంగంలోని అగ్రగామి సంస్థల ప్రతినిధులు, సిఇఒలు పాల్గొనే సిఇఒ స్పీక్‌’ సదస్సులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం, డిజిటల్‌ పబ్లిషింగ్‌, సుస్థిర ప్రచురణా పద్ధతులపై చర్చిస్తారు. అలాగే, జనవరి 12-13 తేదీల్లో జరిగే ‘న్యూ ఢిల్లీ రైట్స్‌ టేబుల్‌’ ద్వారా ప్రచురణకర్తలు పుస్తక అనువాదాలు, అంతర్జాతీయ పంపిణీ హక్కుల మార్పిడి కోసం వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు.

సాంస్కతిక వేడుకలు – ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫెస్టివల్స్‌: పుస్తక ప్రదర్శనతో పాటు, భారత్‌ మండపంలో పండుగ వాతావరణాన్ని నింపడానికి అనేక సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫెస్టివల్స్‌’ పేరుతో భారతదేశంలోని వివిధ ప్రాంతీయ సాహిత్య ఉత్సవాలను ఒకే చోటికి చేరుస్తారు. ప్రతిరోజూ సాయంత్రం జరిగే మ్యూజిక్‌ బ్యాండ్ల ప్రదర్శనలు, శాస్త్రీయ నత్యాలు, జానపద కళారూపాలు సందర్శకులకు వినోదాన్ని అందిస్తాయి. ఇది భారతీయ సంస్కతి, సాహిత్యాల అద్భుత సమ్మేళనం.

భారతీయ భాషల ప్రాధాన్యత: NBT ఈ వేడుకలో ప్రాంతీయ భాషా సాహిత్యానికి పెద్దపీట వేస్తోంది. తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి అనేక భారతీయ భాషల పుస్తకాలను ఇంగ్లీష్‌, హిందీతో సమానంగా ప్రమోట్‌ చేస్తారు. మారుమూల ప్రాంతాలలోని ప్రచురణకర్తలు సైతం తమ రచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ ఫెయిర్‌ ఒక వంతెనగా పనిచేస్తుంది. దీనివల్ల మన దేశీయ సాహిత్య సంపద ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది.
జ్ఞాన సముద్రంలో ఒక ప్రయాణం: న్యూ ఢిల్లీ వరల్డ్‌ బుక్‌ ఫెయిర్‌ 2026 అనేది కేవలం ఒక ఈవెంట్‌ కాదు, అది ఒక మేధో చైతన్యం. డిజిటల్‌ యుగంలో పుస్తకం తన ఉనికిని చాటుకుంటూ, మానవ సమాజానికి దిశానిర్దేశం చేస్తుందని నిరూపించడానికి ఈ ఫెయిర్‌ ఒక నిదర్శనం. లక్షలాది మంది సందర్శకులు, వేలాది మంది రచయితలు, వందలాది ప్రచురణకర్తలు పాల్గొనే ఈ మహాక్రతువు భారతీయ మేధో సంపత్తికి నిలువుటద్దం. పుస్తకాలను ప్రేమించే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన వేడుక ఇది. అక్షరమే ఆయుధంగా, జ్ఞానమే గమ్యంగా సాగే ఈ పయనం ప్రతి పాఠకుడి గుండెల్లో చెరగని ముద్ర వేస్తుంది.

– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -