తీవ్రంగా ఖండించిన పలు దేశాలు
మదురో ఆచూకీపై వివరణ ఇవ్వాలని డిమాండ్
కారకస్, వాషింగ్టన్ : వెనిజులాపై అమెరికా దాడులను అంతర్జాతీయంగా పలు దేశాలు ఖండించాయి. ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ సాగించిన ఈ దుర్మార్గపు చర్యను తీవ్రంగా నిరసించాయి. ఈ దాడులను ఖండించిన దేశాల్లో రష్యా, బ్రెజిల్, మెక్సికో, క్యూబా, యురోపియన్ యూనియన్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, కొలంబియా, దక్షిణ కొరియా సహా పలు దేశాలు ఉన్నాయి. మదురో ఆచూకీపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
సహజ వనరులపై పెత్తనం కోసమే : రష్యా ఖండన
ఈ దాడులకు ఎలాంటి ఆమోద యోగ్యమైన సమర్ధింపు లేదంటూ రష్యా ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. పైగా దౌత్యంపై ‘సైద్ధాంతిక శతృత్వం’ పై చేయి సాధించిందని వ్యాఖ్యానించింది. మదురో ఆచూకీపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. వెనిజులాపై అమెరికా చర్యను ‘సాయుధ దురాక్రమణ’ గా రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. సంయమనం పాటించాలని కోరింది. పరిస్థితులు మరింత పెచ్చరిల్లకుండా చూడాలని కోరింది. వెనిజులా సహజ వనరులపై ఆధిపత్యం కోసమే అమెరికా ఇదంతా చేస్తోందని విదేశాంగ మంత్రి యూరి గగారిన్ విమర్శించారు. వెనిజులా ప్రజలకు తమ సంపూర్ణ సంఘీభావం ఉంటుందని పునరుద్ఘాటించింది. తక్షణమే భద్రతా మండలి సమావేశం జరపాలని డిమాండ్ చేసింది. విదేశీజోక్యం లేకుండా తన భవిష్యత్ తామే నిర్ణయించుకునే స్వేచ్ఛ వెనిజులాకు ఇవ్వాలని స్పష్టం చేసింది.
లక్ష్మణ రేఖను అమెరికా దాటింది : బ్రెజిల్
పొరుగు దేశమైన వెనిజులాపై దాడులను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా తీవ్రంగా ఖండించారు. అధ్యక్షుడు మదురో దంపతులను తన కస్టడీలోకి తీసుకోవడం ద్వారా ఆమోదయోగ్యం కాని రేఖను దాటారని వ్యాఖ్యానించారు. ఈ చర్యలు వెనిజులా సార్వభౌమాధికారంపై దాడులని అన్నారు. అంతర్జాతీయ సమాజంలో ఇదొక దారుణమైన, ప్రమాదకరమైన ధోరణి అని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు పెట్టారు. వెనిజులాలో సాయుధ సైనిక జోక్యం వల్ల మావన విపత్తు సంభవిస్తుందని గతంలో కూడా లూలా హెచ్చరించారు.
ప్రమాదంలో ప్రాంతీయ సుస్థిరత: మెక్సికో ఖండన
వెనిజులాపై దాడులను మెక్సికో వామపక్ష ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఏ రూపంలోనైనా సైనికచర్య అనేది ప్రాంతీయ సుస్థిరతను తీవ్రంగా ప్రమాదంలోకి నెడుతుందని హెచ్చరించారు. అమెరికా సాయుధబలగాలు ఏకపక్షంగా సాగించిన దమనకాండను తాము తీవ్రంగా ఖండిస్తు న్నామని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఉగ్రవాద చర్య అంటూ క్యూబా నిరసన
వెనిజులా గడ్డపై అమెరికా సాగించిన దాడి ఉగ్రవాద చర్య అని క్యూబా విమర్శించింది. అత్యంత నేరపూరితమైన చర్య అని పేర్కొంది. తక్షణమే అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు క్యూబా అధ్యక్ష భవనం ఒక ప్రకటన విడుదల చేసింది. వెనిజులా ప్రజలపై అమెరికా ఉగ్రవాద చర్యలకు పాల్పడిందని విమర్శించింది. శాంతియుత దేశంపై దారుణంగా దాడి చేసిందని నిరసించింది.
అధిగమిస్తాం : వెనిజులా హోం మంత్రి
ప్రస్తుతం నెలకొన్న ఈ కల్లోల పరిస్థితుల్లో నాయకత్వంపై నమ్మ కముం చాలని వెనిజులా హోం మంత్రి దియోస్‌డయో సెబెల్లొ కోరారు. కచ్చితంగా ఈ దాడులను అధిగమిస్తామని ఆయన ప్రజలకు హామీనిచ్చారు. మన ప్రజలపై ఇదేమీ మొదటి యుద్ధం కాదు, అనేక పరిస్థితుల్లో అనేక దాడులను ఎదుర్కొన్నాం, వాటన్నింటినీ మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు దీన్నుండి కూడా బయటపడతామని అన్నారు.
బ్రిటన్ వామపక్షాల ఖండన
వెనిజులాపై అమెరికా దూకుడును బ్రిటన్‌లోని వామపక్ష భావజాల పార్టీలైన లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీస్ నేతలు ఖండించారు. అమెరికా చర్యలు పూర్తి చట్టవిరుద్ధమైనవని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చట్టం, నిబంధనలను పూర్తి స్థాయిలో గౌరవించాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగిందో తెలుసుకోవాలన్న బ్రిటన్ ప్రధాని
అమెరికా దాడులను బ్రిటన్ ఖండించిందా అని ప్రశ్నించగా తాను ఖండించడానికి ముందుగా అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలను కుంటున్నానని బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ చెప్పారు.
శాంతియుత, ప్రజాస్వామ్య పరిష్కారం : ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు
వెనిజులాలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లకుండా సంయమనం పాటించాలని యురోపియన్ యూనియన్ కోరింది. ఆ దేశంలో శాంతియుత, ప్రజాస్వామ్య పరిష్కారానికి తాము మద్దతిస్తామని యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటానియో కోస్టా చెప్పారు. వెనిజులాలో పరిణామాలను తీవ్ర ఆందోళనతో గమనిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ తరుణంలో సంయమనం అత్యంత అవసరమని ఇయు దౌత్యవేత్త ఖాజా కల్లాస్ శనివారం వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులకు సంబంధించి అంతర్జాతీయ చట్టాన్ని, ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని గౌరవించాలని కోరారు. కారకస్‌లోని తమ రాయబారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నామన్నారు. వెనిజులాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు.



