అడ్డుకున్న పోలీసులు.. తోపులాట, ఉద్రిక్తత
రోడ్డుపై బైటాయించిన ఆటో డ్రైవర్ల అరెస్ట్
హామీలు అమలు చేయాలి
రవాణారంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టింది. వందలాది మంది ఆటో డ్రైవర్లు హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద నుంచి అసెంబ్లీ వైపు దూసుకెళ్తుండగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆటో డ్రైవర్లు రోడ్డుపై బైటాయించగా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బి.వెంకటేశం (ఏఐటీయూసీ), నాయకులు ఎండీ బాబా (సీఐటీయూ) మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల అనేక మంది ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని అన్నారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు కిలో మీటర్‌కు రూ.20, మినిమం చార్జి రూ.50కు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవర్‌కూ ఏడాదికి రూ.12 వేల సహాయం అందజేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ నగరంలో అక్రమంగా తిరుగుతున్న ఓలా, ఉబెర్, ర్యాపిడో ద్విచక్ర వాహనాలను నిషేధించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే కొత్త యాప్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు వేముల మారయ్య (బీఆర్‌టీయూ), ఎంఏ.సలీం (తెలంగాణ జాగృతి), ఈ.ప్రవీణ్ (టీయూసీఐ), ఎ.సత్తిరెడ్డి (టీఏడీఎస్), పి.యాదగిరి (టీఎన్‌టీయూసీ), శివానందం (టీఏఎండీయూ), ఎస్.అశోక్, సిహెచ్. జంగయ్య, ఏం.కృష్ణ, ఎం.నరసింహ, శ్రీనివాస్, శ్యామ్ లాల్, మల్లికార్జున్ (ఏఐటీయూసీ), లింగం గౌడ్ (టీయూసీఐ) తదితరులు పాల్గొన్నారు.



