Wednesday, January 7, 2026
E-PAPER
Homeదర్వాజనడుస్తున్న రక్తసిక్త చరిత్రకు ఫోరెన్సిక్‌ సాక్షి లింగారెడ్డి కవిత్వం

నడుస్తున్న రక్తసిక్త చరిత్రకు ఫోరెన్సిక్‌ సాక్షి లింగారెడ్డి కవిత్వం

- Advertisement -

“If I must die,/ you must live/ to tell my story/ …… If I must die/ let it bring hope/ let it be a tale”
Refaat Alareer (1979 – 2023)

”నేను మరణించాల్సి వస్తే నా కథ చెప్పడానికి నీవు బతికుండాలి.. నేను మరణిస్తే అది ఒక ఆశను బతికించాలి.. అది భవిష్యత్తరాలకు ఒక కథ చెప్పాలి” అంటూ అమరుడయ్యాడు రెఫాత్‌ అలరీర్‌. డిసెంబర్‌ 6, 2023 నాడు గాజాలో, ఇజ్రాయిల్‌ వైమానిక దాడిలో 44 ఏండ్ల రెఫాత్‌, అతని కుటుంబ సభ్యులతో సహా అమరుడయ్యాడు. జీవించినంత కాలం పాలస్తీనా హక్కుల కోసం, విముక్తి కోసం అనుక్షణం కృషి చేసిన రెఫాత్‌ గొప్ప కవి. అతని కవిత్వాన్ని, సాహిత్యాన్ని పాలస్తీనా ప్రజల ఆకాంక్షలకు, ప్రతిఘటనకు ఒక ఆలంబనగా చేశాడు. గత 77 ఏండ్లుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దురాక్రమణ, దమనకాండలో ఛిద్రమైన పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను గొంతెత్తి గానం చేసాడు. అక్టోబర్‌ 10, 2023 హమాస్‌ దాడి తర్వాత, దాన్ని సాకుగా ఇజ్రాయిల్‌ మొదలుపెట్టిన మారణహోమం చరిత్రలో కనీ వినీ ఎరగనంత దుర్మార్గంగా కొనసాగుతోంది. ఇప్పటికే డెబ్బై వేల మంది పాలస్తీనా ప్రజలు గాజాలో ఇజ్రాయిల్‌ మరణ హోమంలో హతులయ్యారు.

అందులో కనీసం ఇరవై వేల మంది చిన్న పిల్లలున్నట్టు అంచనా. నూటాడెబ్బై వేలకు పైగా గాయపడ్డారు. ఇరవైఒక్క వేల మంది చిన్న పిల్లలు వికలాంగులయ్యారు. లక్షకు పైగా ప్రజలు దారుణమైన కరువును ఎదుర్కొంటున్నారు. ఈ మరణ హోమంలో ఎందరో రచయితలూ, కవులు, కళాకారులు కూడా అమరులయ్యారు. ఇజ్రాయిల్‌ దుర్మార్గమైన మరణహోమాన్ని వర్ణించడానికి ఏ భాషకూ చేతకాదన్నది ఈనాడు మన కళ్ళ ముందున్న దారుణమైన సత్యం. ప్రపంచ వ్యాప్తంగా ఎంత నిరసన వ్యతిరేకత వచ్చినా నరహంతకుడు, రక్త పిపాసి నెతన్యాహు దుర్మార్గాలకు అంతు లేదు. ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనా ప్రజలకు ఆహరం ఇస్తామంటూ వాళ్ళమీద ట్యాంకర్లతో కాల్పులు జరిపి చంపేసిన దుర్మార్గం మన కళ్ళముందు జరుగుతున్న చరిత్ర. ఈ మారణహోమాన్ని అమెరికా నిస్సిగ్గుగా సమర్థిస్తూ ఇజ్రాయిల్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూ అంతర్జాతీయ అండను అందిస్తోంది.

ఇటువంటి రక్తసిక్త వర్తమాన చరిత్రలో, దుఃఖాన్నీ, కన్నీళ్లనూ, ఎల్లెడలా వ్యాపిస్తున్న మత్యుధూమాన్ని ఊపిరిగా పీలుస్తున్న లింగారెడ్డి మౌనంగా ఉండడం లేదు. మౌనంగా ఉండడం అతనిలాంటి కవికి సాధ్యమూ కాదు. ”ఆకలిని కూడా నీవు ఆయుధం చేసి/ అసహాయుల మీద సంధిస్తున్నప్పుడు/ మహా సముద్రమంత మానవత/ ఫ్లాటిల్లా పగడపూల వనమై విరగబూసింది/ నీ రాకాసి సునామీ కోరలకు బలైంది/ గుర్తుంచుకో!/ యుద్ధంలో ఎవరు గెలిచినా/ నువ్వు పరాజితుడివే!/ నేల లేని దేశంలో/ వాళ్ళు ‘భూమిని తమ రక్తంలో మోస్తున్నారని’ గుర్తుంచుకో/ సమస్త మానవాళి నిటారుగా నిలబడి/ నినదిస్తోంది విను/ వీటో వేటు చాటున/ డాలర్‌ బలుపు నీడన/ నీ కాగితం పులి హుంకరింపులకు చెల్లు/ పాలస్తీనా ఒక ఫీనిక్స్‌” అంటూ తన ఆగ్రహజ్వాలలని కవిత్వంగా హోరెత్తుతున్నాడు.

“Every beautiful poem is an act of resistance” అన్న పాలస్తీనా జాతీయ మహాకవి మహమూద్‌ దర్వీష్‌ మాటలను మరోసారి రుజువు చేస్తూ లింగారెడ్డి తన కవిత్వంలో ప్రతిఘటనను పలుకుతున్నాడు. మరణించిన రెఫాత్‌ కథలను, ఆకాంక్షలనూ ప్రపంచానికి వినిపించడానికి వందలాది కవుల్లో తానూ ఒకడయ్యాడు. లింగారెడ్డికి చరిత్ర తెలుసు, రాజకీయాలు తెలుసు, ఎల్లప్పుడూ పీడితుల వైపు నిలబడాలన్న ప్రాపంచిక దక్పథం ఉన్నవాడు. అందుకే పాలస్తీనా ప్రజల పక్షం వహించాడు. 1917 లో Balfour తీర్మానం ద్వారా, వివక్షకు గురైన యూదులకు ఒక దేశముండాలన్న జియోనిస్టుల కోరిక నెరవేరడానికి, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదం తమది కాని పాలస్తీనాను ను యూదులకు కేటాయించడం కోసం, ఒట్టోమన్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అరబ్బులను రెచ్చగొట్టి, ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఒప్పించి, తమదైన నేలపైనే పాలస్తీనీయులని కాందిశీకులను చేసిన కుట్ర లింగారెడ్డికి తెలుసు.

తర్వాత 1948లో అధికారికంగా ఇజ్రాయిల్‌ ఏర్పడ్డ తర్వాత 750000 మంది పాలస్తీనా ప్రజలను వాళ్ళ సొంత దేశం నుండి తరిమేసిన నక్బా తెలుసు. అప్పటినుండి 77 ఏండ్లుగా జరిగిన ఎన్నో ఒప్పందాలను ఉల్లంఘించి పాలస్తీనా భూమిని దురాక్రమించిన ఇజ్రాయిల్‌ దమనకాండ తెలుసు. చివరికి 2018-19లో పాలస్తీనా ప్రజలు శాంతియుతంగా సాగించిన ఊరేగింపులపై దారుణంగా ఇజ్రాయిల్‌ మిలిటరీ దాడి చేసి వందలాది మందిని కాల్చిచంపి, వేలాదిమందిని వికలాంగులను చేసిన దుర్మార్గమూ తెలుసు. “We knocked on the walls of the tank, but nobody answered” అన్న పాలస్తీనా రచయిత ఘసన్‌ కనఫాని (ఘసన్‌ కూడా ఇజ్రాయిల్‌ గూఢచారి సంస్థ కుట్రపూరితంగా పేల్చిన కార్‌ బాంబులో అమరుడయ్యాడు) వేదన తర్వాతే హమస్‌ తన ‘దుందుడుకు’ చర్యకు తెగబడిందనీ తెలుసు. అందుకే నిర్ద్వంద్వంగా పాలస్తీనా పక్షం నిలబడి ‘పాలస్తీనా ఫీనిక్స్‌’ అని ఎలుగెత్తుతున్నాడు.

లింగారెడ్డి దాదాపుగా గత నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నాడు. తనదైన గొంతుక ద్వారా తెలుగు కవిత్వంలో స్థానం సాధించి పాఠకులకు సుపరిచితుడైన కవి. ఇప్పటికే నాలుగు కవితా సంకలనాలు వెలువరించాడు. గత నాలుగు కవితా సంకలనాలలో విలక్షణమైన తన కవితా స్వరాన్ని సుస్థిరం చేసుకున్న లింగారెడ్డి, తన ఐదో సంకలనం ‘ఒక ఆకుపచ్చని కల’తో మన ముందుకొస్తున్నాడు. భారత దేశంలో అధికారం చెలాయిస్తున్న మనువాద ఫాసిస్టు ప్రభుత్వ ద్వేషపూరిత చర్యలూ, అప్రజాస్వామిక పాలనా, తమ హక్కుల కోసం, తమదైన నేల కోసం నిలబడి పోరాడుతున్న ఆదివాసీలపై ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్‌ కగార్‌ దమనకాండ, నెత్తుటేర్లలో మునిగి ఎర్రబడుతున్న దండకారణ్యం, వందలాదిగా హతమవుతున్న విప్లవకారులు, ఆదివాసీలు, రెండేళ్లపాటు ప్రపంచవ్యాప్తంగా మానవ జాతిని కుదిపేసిన కరోనా మనకు అనుభవంలోకి వస్తాయి. కవి గత దశాబ్ది కాలంలో తన ప్రత్యక్ష అనుభవాలు, పరోక్ష అనుభవాలను శక్తివంతమైన కవిత్వంగా ఈ సంకలనంలో మన ముందుకు తెస్తున్నాడు. ఆ రకంగా ఇది చరిత్రాత్మకమైన కవితా సంకలనంగా నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

లింగారెడ్డి వత్తిరీత్యా డాక్టర్‌. పసిపిల్లల డాక్టర్‌గా ఎందరికో చికిత్స అందించి ప్రాణాలు, ఊపిరి పోసిన వాడు. అందుకే ఆయన కవిత్వంలో గొప్ప సున్నితత్వం ఉంటుంది. మనుషుల పట్ల, చిన్నపిల్లల పట్ల, వారి భవిష్యత్తు పట్ల అతి సున్నితంగా కవిత్వీకరిస్తాడు. ”అనాదిగా నువ్వు పెట్టిన అణచివేతకు/ పచ్చని ప్రకతి కంటతడి పెట్టింది/ నువ్వు ఒట్టి నీటిబొట్టే అనుకున్నావు/ మనిషీ!/ అది విశ్వవ్యాపిత విషపుచుక్క/ ఇవాళ ఒకడును వెనక్కి పడిందంటే/ ఓటమిని ఒప్పుకున్నట్టు కాదు/ శాస్త్ర అస్త్రాలు సంధించి/ ద్విగుణీకత శక్తితో తిరిగి లంఘించడానికే” అంటూ గొప్ప ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను ఊహించినట్టే శాస్త్రం జయించింది. కరోనా ఓడిపోయింది. కరోనా బారిన పడ్డ విశాఖ నగరాన్ని గురించి విలపిస్తూ రాసిన ‘శోకతప్త విశాఖ’ కవిత మొత్తం కోట్‌ చేయాలనిపించే గొప్ప కవిత. అబద్దాలతో చరిత్రను తిరగరాస్తూ, అన్ని ప్రజాస్వామిక విలువలను, సంస్థలనూ ధ్వంసం చేస్తున్న ఫాసిస్టు ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా బహుజనుల భుజాలపై ఊరుగుతున్నది. రైతుల నోళ్లు గొట్టింది, దళితులని మరింత అణచివేతకు గురి చేస్తోంది. మైనారిటీలను మతం పేరున మూకదాడులకు గురిచేసి హత్యలు చేస్తోంది.

ఎన్ని వైఫల్యాలనైనా మతవిద్వేషం పేరుతో కప్పిపుచ్చి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తోంది. ”ఒక మనిషి గుండె పగిలిన చప్పుడు వినగలవా నువ్వు/ ఒక సీతాకోక చిలుక రెక్కలు తెగిన శబ్దం వినగలవా నువ్వు/ మాట పడిపోయిన మనిషి హదయం చెప్పే ఊసులు వినగలవా నువ్వు/ ఒరం మీద జారిపడ్డ బిడ్డ/ కన్నీటి బిందువు నేలరాలిన చప్పుడు విన్నావా/ ఆరుగాలం శ్రమించి పెంచిన/ వరిమొవ్వులోని జీవం హరించబడ్డ శబ్దం విన్నావా/ బొక్కెనలో పోసిన అలుగులోని మొలకెత్తని గింజ ఘోష విన్నావా” అంటూ రైతులకు అన్యాయం చేస్తున్న మనువాద ఫాసిస్టులని తీవ్రంగా ప్రశ్నిస్తున్నాడు కవి. లింగారెడ్డికి రైతాంగ నేపథ్యం ఉన్నది. తెలంగాణ దిగువ మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చిన లింగారెడ్డికి రైతుల వేదన తెలుసు. వారి భాష తెలుసు. అందుకే కవిత శక్తివంతంగా పలికింది. గత రెండేళ్లుగా ఆదివాసుల అడవిని కార్పొరేట్లకు ధారాదత్తం చేసేటందుకు మనువాద ఫాసిస్టు ప్రభుత్వం అడవిపై, ఆదివాసులపై, విప్లవకారులపై యుద్ధం పరకటించింది. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌, ఆపరేషన్‌ కగార్‌ పేర్లతో వేలాది సాయుధబలగాలని దండకారణ్యంలో దింపి కూంబింగ్‌ పేరుతో ఆదివాసీలను, విప్లవకారులు వందలాదిగా హతమారుస్తూ అడవిలో ప్రతి ఆకుని రక్తసిక్తం చేస్తున్నారు.

“Those who tell you. Do not put too much politics in your art, are not being honest. If you look very carefully you will see that they are the
same people who are quite happy with the situation as it is… What they are saying is dond’t upset the system” అన్న చినువా అచ్చెబె మాటలను తన కవిత్వంలో సాకారం చేస్తున్నాడు. కవిత్వంలో రాజకీయాలు లేకుండా ఉండడానికి వీల్లేదు. ఐతే పీడితుల పక్షం వహించే రాజకీయం, లేకపోతే పీడించే వ్యవస్థ పట్ల మౌనంగీకార రాజకీయం అని కవికి స్పష్టంగా తెలుసు. అందుకే సంకలనంలోని ఏ కవితలోనూ ‘నిష్పక్షపాత’ మౌనం మనకు కనబడదు. అందుకే ”My mouth shall be the mouth of those calamities that have no mouth, my voice the freedom of those who break down in the prison holes of despair”.

అయిమే సెజార్‌ ప్రజల పక్షం వహించినందుకు, నిజం నిర్భయంగా మాట్లాడినందుకు, ప్రజాస్వామ్యం కోసం గొంతు విప్పినందుకు గొంతులు నొక్కేయబడి, జైళ్లలో తోసెయ్యబడ్డ వారి స్వేచ్ఛకోసం, వారి ఆకాంక్షలకు గొంతు నివ్వడం కోసం కవిత్వం రాశాడు లింగారెడ్డి. అయితే ప్రస్తుత పరిస్థితులని, వర్తమాన చరిత్రను చెప్పడానికి, కవిత్వీకరించడానికి భాషకున్న పరిమితులు తెలుసు లింగారెడ్డికి. అందుకే ఈ సంకలనంలో తనను తాను కొత్త భాషను కనుక్కున్నాడు. ‘హేవిళంబీ రావే’, ‘రాలిపడ్డ కంటిపాపలు’, ‘వెలుగు మరక’, ‘సాయంసంధ్య’, ‘దగ్ధ సౌందర్యం’ ,’కలతలు’, ‘పగిలిన అ(బ)ద్ధం’ లాంటి కవితలు రాశాడు. ఇట్లాంటి భాష, కవితా సౌందర్యం ఇంతకు ముందు సంకలనాల్లో ఉన్నట్టు నాకు గుర్తు లేదు. ఇది తన కవిత్వం పరిపక్వమోతూ ఒక మంచి పరిణామంగా వచ్చింది. భాషకున్న పరిమితులన అధిగమించి తన అనుభూతులని వ్యక్తీకరించడానికి ఈ కవితల్లో కొత్తగా ప్రయత్నించాడు. గతంలో చాలామంది కవులు ఉగాది సందర్భంగా కవితలు రాశారు. శ్రీ శ్రీ కూడా ఉగాది కవితలు రాసినా అవి ఏ ఆకాశవాణి కార్యక్రమం కోసం రాసినవి కావడం వల్ల అక్కడక్కడా కవిత్వపు మెరుపులు తప్ప వాటిని మంచి కవితలుగా చెప్పుకోలేం. కానీ లింగారెడ్డి రాసిన ‘హేవిళంబీ రావే’ కవిత నిస్సందేహంగా మంచి కవిత. ఇప్పటిదాకా వచ్చిన ఉగాది కవితలకన్నా భిన్నమైన కవిత.

‘కాలం ఎప్పుడైనా శుభాశుభాల కలయికే కానీ/ నువ్వు నాకు అనంత శుభాల ఆకాంక్షల ప్రతినిధివి’ ‘ఒక ఆకుపచ్చని కల’ కవితా సంకలనం ఆసాంతం చదివాక మనకు ఒక దశాబ్దపు ప్రపంచ చరిత్ర, అనేకానేక సంఘటనలు అనుభూతిలోకి వస్తాయి. ఎన్నో చేదైన జ్ఞాపకాలను, వాటి వెనుక ఉన్న రాజకీయాలను, కార్యకారణ సంబంధాలను, వర్తమానానికి వాటికి ఉండే సంబంధాలు, ఇంకా కొనసాగుతున్న మారణహోమాలు, దమనకాండలు, దుర్మార్గాలు, దోపిడీలు, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వలసలు, నిర్వాసితులౌతున్న పేద ప్రజానీకం, తమ స్వంత నేలపైనుండే బలవంతంగా తొలగించబడి కాందిశీకులౌతున్న కోట్లాది ప్రజానీకం, మత విద్వేషపు విషాన్ని అణువణువూ ఎక్కించి ప్రజలని అంధులని చేస్తూ పాలిస్తున్న ప్రభుత్వాలు – అన్నీ మనలో సుళ్ళు తిరుగుతాయి.

నడుస్తున్న చరిత్ర పట్ల మౌనంగా ఉండడం కవి చేయాల్సిన పని కాదని స్పష్టంగా నమ్మిన లింగారెడ్డి తాను గొంతు విప్పుతూ మనల్ని గొంతు కలపమంటున్నాడు. తన కవిత్వంతో మనలో అనేకానేక ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాడు. మన సున్నితత్వాన్ని, మనలో మానవీయ ప్రజాస్వామిక ఆకాంక్షలను తట్టిలేపుతూ ‘ఏదో ఒకటి చేయండి. నిర్లిప్తంగా మాత్రం ఉండకండి’ అంటున్నాడు. అందుకు లింగారెడ్డి మనసారా అభినందనీయుడు. అయితే కేవలం పీడిత ప్రజలపక్షం వహించడం, ప్రజారాజకీయ స్పృహతో ప్రాపంచిక దృక్పథాన్ని పదును పెట్టుకోవడం మాత్రమే మంచి కవిత్వం రాయడానికి దోహదం చేయదనీ, కవిత్వ స్పృహ, సున్నితత్వం, ఊహ, సృజనాత్మకత, కవిత్వ భాషపై పట్టు ఉండడం మంచి కవిత్వానికి ప్రాణమని లింగారెడ్డికి స్పష్టంగా తెలుసు. రూపసారాల మధ్య సమన్వయం అత్యంత ముఖ్యమనీ తెలుసు. ఆ ఎరుకతో మరింత గొప్ప కవిత్వం రాస్తాడని ఆకాంక్షిస్తూ.

  • నారాయణస్వామి వెంకటయోగి
    ఫ్లెమింగ్టన్‌, న్యూ జెర్సీ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -