జైలు నుంచి ఆరుగురి విడుదల
పూలమాలలతో ఘన స్వాగతం
భుజాలపై మోసుకుంటూ ఊరేగింపు
సర్వత్రా విమర్శల వెల్లువ
రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్ పూర్‌లో క్రిస్మస్ అలంకరణలను ధ్వంసం చేసిన కేసులో హిందూత్వ సంస్థ భజరంగ్‌దళ్‌కు చెందిన ఆరుగురికి బెయిల్ లభించింది. దీంతో వారికి తోటి భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేశారు. వారిని భుజాలపై మోసుకుంటూ ఊరేగింపు నిర్వహించారు. క్రిస్మస్‌కు ముందురోజు బంద్ పేరుతో అంతరాయం కలిగించి, సమాజంలో ద్వేషపూరిత భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకు కొన్ని రోజుల్లోనే బెయిల్ లభించటం ఒకెత్తయితే.. అనంతరం ఈ విధంగా ఘనస్వాగతం దక్కటంపై కూడా సర్వత్రా విమర్శలకు దారి తీసింది. వివరాళ్లోకెళ్తే.. డిసెంబర్ 24న మతమార్పిడులపై నిరసనగా హిందూత్వ శక్తులు ఛత్తీస్‌గఢ్‌లో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కర్రలను చేతబట్టుకున్న ఓ మూక మాగెటో మాల్‌లోకి చొరబడింది. క్రిస్మస్ అలకంరణలను ధ్వంసం చేసింది. శాంటాక్లాజ్ బొమ్మలు, రెయిన్‌డీర్‌లు వంటి వస్తువులను పగులగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి 30-40 మందిపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. డిసెంబర్ 27న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారు ఐదు రోజుల పాటు జైలులో ఉన్నారు.
వారి అరెస్టులకు నిరసనగా సుమారు 300 మంది భజరంగ్‌దళ్ కార్యకర్తలు టెలీబంధా పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై దాదాపు తొమ్మిది గంటల పాటు రోడ్డును దిగ్బంధించారు. అయినప్పటికీ.. వారిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అయితే ఆ ఆరుగురు నిందితులు ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం భజరంగ్‌దళ్‌కు చెందిన కార్యకర్తలు వీరికి పూలమాలలు వేసి, ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైనవారిని భుజాలపై మోసుకుంటూ ఊరేగింపు చేపట్టారు. తమ సభ్యులను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారనీ, తాము ఈ నినాదాలు చేయడం తప్పేమీ కాదని ఈ ఘటనపై భజరంగ్‌దళ్ రాష్ట్ర సమన్వయకర్త రిషి మిశ్రా అన్నారు. గత డిసెంబర్ 29న మేజిస్ట్రేటు కోర్టు ఈ నిందితులకు బెయిల్‌ను తిరస్కరించినప్పటికీ.. తర్వాత సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారు విడుదలయ్యారు. రాష్ట్రంలోని బీజేపీ పాలనలో హిందూత్వ శక్తులు తీవ్రంగా రెచ్చిపోతున్నాయనీ, ఇందుకు తాజా పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణగా సామాజిక కార్యకర్తలు, నెటిజన్లు చూపిస్తున్నారు.
‘విద్వేష’ భజరంగదళ్ సభ్యులకు బెయిల్
- Advertisement -
- Advertisement -



