అడ్డగోలుగా విషం కక్కొద్దు
2014 నుంచి ఇప్పటిదాకా లావాదేవీలన్నింటిపై విచారణ చేయిద్దాం
అన్ని విషయాలూ ప్రజల ముందు పెడదాం : హిల్ట్ పాలసీ, ‘తెలంగాణ రైజింగ్’పై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్రానికి రూ.10,766 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏ విషయంపైన్నైనా ఆధారాల్లేకుండా మాట్లాడొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు… బీఆర్‌ఎస్, బీజేపీలకు హితవు పలికారు. తమ ప్రభుత్వ విధానాల్లో ఎక్కడైనా తప్పులు దొర్లినా, అక్రమాలు జరిగాయని తేలినా పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని వారు స్పష్టం చేశారు. అన్ని విషయాలనూ ప్రజలముందు ఉంచుతామని వ్యాఖ్యానించారు. అందువల్ల ప్రభుత్వంపై అడ్డగోలుగా విషం కక్కొద్దని సూచించారు. 2014 నుంచి నేటి హిల్ట్ పాలసీ వరకూ జరిగిన అన్ని లావాదేవీలపై విచారణ చేయించటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మంగళవారం శాసనసభలో హిల్ట్ పాలసీపై మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ రైజింగ్-2047, విజన్ డాక్యుమెంట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రెండింటినీ విడివిడిగా కాకుండా కలిపే చర్చిద్దామంటూ వారు ప్రతిపాదించారు. అనంతరం బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు ఈ రెండు అంశాలపై పలు అంశాలను లేవనెత్తారు. వాటికి స్పష్టతనివ్వాలంటూ వారు కోరారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, మంత్రి సుదీర్ఘ వివరణలిస్తూ ప్రసంగించారు.
తొలుత శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… హిల్ట్ పాలసీలోని పలు సాంకేతిక, న్యాయపరమైన అంశాలను సోదాహరణంగా వివరించారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న వివిధ పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపలకు తరలించాలంటే మొదట అక్కడి భూముల సర్వే, ఆ తర్వాత సంబంధిత అనుమతులు, ఆర్థికపరమైన అంశాలు, న్యాయపరమైన చిక్కుముడులన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. వీటిపై తమ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోతోందని అన్నారు. కాలుష్య రహిత హైదరాబాదే తమ లక్ష్యమని చెప్పారు. సభ్యులందరూ ఈ విషయాలను అర్థం చేసుకోవాలని కోరారు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ… హిల్ట్ పాలసీ లేకపోతే ఎకరాకు రూ.12 లక్షల ఆదాయమే వచ్చేదని, కానీ ఈ పాలసీతో ఎవరూ ఊహించనంతగా అది రూ.7 కోట్లకు చేరుకోబోతోందని తెలిపారు.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్, గ్రిడ్ పాలసీ ద్వారా రూ.574 కోట్ల ఆదాయం వచ్చే చోట.. రూ.10,776 కోట్ల రాబడి రాష్ట్ర ఖజానాకు వచ్చే విధంగా హిల్ట్ పాలసీకి రూపకల్పన చేశామని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‌ఎస్ హయాంలో మూడు రకాలైన భూ విధానాలు తీసుకొచ్చారని, కానీ వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. కానీ తాము రూపొందించిన హిల్ట్ పాలసీ వల్ల తెలంగాణకు అనేక రకాలుగా లాభం జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలను తరలించేందుకు వీలుగా 2012లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక కమిటీని వేసిందని గుర్తు చేశారు. ఆ కమిటీ 2013లో ఒక నివేదికను కూడా సమర్పించిందని వివరించారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాల్లో భాగంగా 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధిస్తామంటూ ప్రధాని మోడీ చెబుతున్నారు.. అలాంటప్పుడు తెలంగాణలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.
అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఐదు రోజులపాటు (మొత్తం 40.45 గంటలు) సభా కార్యకలాపాలు కొనసాగాయని ఆయన తెలిపారు. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 66 మంది, బీఆర్‌ఎస్‌కు 37, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సీపీఐకి ఒక్కరు చొప్పున మొత్తం 119 మంది సభ్యులున్నట్టు స్పష్టం చేశారు. 32 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలివ్వగా, సభ్యులు 82 అనుబంధ ప్రశ్నలను వేశారు. మొత్తం 13 బిల్లులను ఆమోదించగా, నాలుగు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయని తెలిపారు
ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


