– ప్రజా సమస్యల పరిష్కారం సీపీఐ(ఎం)తోనే సాధ్యం
– అభివృద్ధి మాటలు ప్రగల్భాలకే పరిమితం: ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై ధ్వజం
– సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి పిలుపు
నవతెలంగాణ – పరకాల
రాబోయే పరకాల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించాలని, నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పరకాల పట్టణంలోని రెండో వార్డులో పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన సీపీఐ(ఎం) ముఖ్య కార్యకర్తల సమావేశానికి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ సామాన్యులపై భారాలు మోపుతోందని మండిపడ్డారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, మతోన్మాద విధానాలు పెంచి పోషిస్తుందన్నారు. బీజేపీని ఓడించడం ద్వారానే దేశానికి, పేదలకు రక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
పరకాల పట్టణంలో రూ. 25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని చెబుతున్నా, దళితులు, పేదలు నివసించే వార్డుల్లో పరిస్థితి ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. “గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ దళితవాడల అభివృద్ధి ఆమడ దూరంలోనే ఉంన్నాయన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చెబుతున్న అభివృద్ధి మాటలన్నీ ప్రగల్భాలకే పరిమితమయ్యాయి” అని ఆయన ఎద్దేవా చేశారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకాలంటే సీపీఐ(ఎం)ను ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులు ఉంటేనే ప్రజా సమస్యలు ఎజెండాలోకి వస్తాయని, అప్పుడే పరిష్కారం సాధ్యమవుతుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు. నిరంతరం పోరాటాలు చేస్తున్న సీపీఐ(ఎం)కు ఓటు ద్వారా అధికారం ఇస్తే, మరిన్ని సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్నికల ప్రచార వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి, పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్, బొచ్చు ఈశ్వర్, బొచ్చు రాజు, దశకుటి కిరణ్, పార్టీ కార్యకర్తలు, మహిళలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



