Sunday, January 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఇల్లు ఒక చోట..ఓటు మరో వార్డులో

ఇల్లు ఒక చోట..ఓటు మరో వార్డులో

- Advertisement -

ఓటర్ల జాబితా ఆగమాగం
అయోమయంలో మాజీ కౌన్సిలర్లు, ఆశావహులు
సవరించాలంటూ దరఖాస్తులు
సూర్యాపేట జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో గందరగోళం

నవతెలంగాణ-సూర్యాపేట
మున్సిపల్‌ ఓటరు జాబితాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్‌ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఎన్నికల కమిషన్‌ ఓటర్ల ముసాయిదా జాబితాలను విడుదల చేసింది. కొన్ని చోట్ల ఆ ప్రాంతంలో ఓటర్లు లేకున్నా.. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయి. వార్డుల విభజన జరిగినా అక్కడ ఉన్న వారి ఓట్లు గల్లంతయ్యాయని ఫిర్యాదులందాయి. అక్కడక్కడా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లోనూ ఓటర్ల జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయి. ఇల్లు ఒక చోట ఉంటే.. ఓటు మరో వార్డు లిస్టులో వచ్చింది. ఓటర్ల భౌగోళిక సరిహద్దులు అస్తవ్యస్తంగా చేయడంతో ఓట్లు తారుమారయ్యాయి. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు మొదలవుతుండటంతో.. ఓటరు జాబితాలపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పుల్ని సవరించాలని కోరుతూ దరఖాస్తులు పెద్దఎత్తున వస్తున్నాయి.

జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో ఓటర్ల విభజన కార్యక్రమాన్ని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చేపట్టారు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా వివరాల గుర్తింపు కూడా పూర్తి చేశారు. ఏ వార్డులో ఎంతమంది జనాభా ఉందనే దానిపై లెక్కలు తేల్చారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విభజన చేశారు. జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షలా 26 వేలా 695 మంది ఉన్నారు. మున్సిపాలిటీ వారీగా ఓటర్ల సంఖ్య ఇలా ఉంది. సూర్యాపేట మున్సిపాలిటీలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 52,205 మంది పురుష ఓటర్లు, 56,679 మంది మహిళా ఓటర్లు ఉండగా, 13 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,08,897గా నమోదైంది.

కోదాడ మున్సిపాలిటీలో 28,560 మంది పురుష ఓటర్లు, 30,031 మంది మహిళా ఓటర్లు, 10 మంది ట్రాన్స్‌జెండర్లు ఉండగా, మొత్తం ఓటర్లు 58,601గా ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 14,257 మంది పురుష ఓటర్లు, 15,731 మంది మహిళా ఓటర్లు, 8 మంది ట్రాన్స్‌జెండర్స్‌తో కలిపి మొత్తం ఓటర్లు 29,996 మంది ఉన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో 7,638 మంది పురుష ఓటర్లు, 7,817 మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 15,455గా ఉంది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో 6,629 మంది పురుష ఓటర్లు, 7,116 మంది మహిళా ఓటర్లు, ఒక ట్రాన్స్‌జెండర్స్‌తో కలిపి మొత్తం ఓటర్లు 13,746 మంది నమోదయ్యారు. విలీన గ్రామాలను కలుపుకొని వార్డుల భౌగోళిక సరిహద్దులను నిర్ణయిస్తూ గతంలోనే వార్డుల విభజన జరిగింది. గతంలో ఉన్న వార్డుల కంటే అదనంగా కలుపుకొని మొత్తంగా 141 వార్డులు ఉన్నాయి.

సూర్యాపేట పట్టణంలోని అఫ్జల్‌ రైస్‌ మిల్‌ సమీపం లో ఉన్న 24వ వార్డులో దాదాపుగా 250 ఓట్లు 25వ వార్డులోకి వెళ్లాయి. 25వ వార్డులోని 100 ఓట్ల వరకు 26వ వార్డులోని జాబితాలోకి వెళ్లాయి. కాగా ఇక్కడికి మరో వార్డులోని దాదాపుగా 1500 ఓట్లు ఇతర వార్డులోకి వెళ్లడంతో వారంతా అయోమయానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఒక్క వార్డుకు సంబంధించినది కాదు.. మెజార్టీ వార్డుల్లో ఓట్లన్నీ తారుమారు అయి గంపగుత్తగా ఇతర వార్డుల్లోకి వెళ్లాయని రాజకీయ పార్టీల నేతలు అంటు న్నారు. ఒక మాజీ కౌన్సిలర్‌ కుటుంబానికి చెందిన ఓట్లు నాలుగు దిక్కులా నాలుగు వార్డుల్లోకి వెళ్లాయి. మరికొంత మంది మాజీ కౌన్సిలర్లకు పోటీచేసేందుకు వీలు లేకపోవ డంతో సందిగ్ధంలో పడ్డారు. ఓట్ల గల్లంతు ఘటనలపై మున్సిపల్‌ కమిషనర్‌కు ఐదువేల మంది ఫిర్యాదు చేశారు. రాజకీయ నాయకుల సహకారం తీసుకొని ఓటర్‌ లిస్ట్‌ తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ మీటింగ్‌లో చెప్పారు. ఇదిలావుండగా, కొంతమంది మాత్రం ఫైనల్‌ నోటిఫికేషన్‌ లో సరిగా ఓట్లు రాకపోతే కోర్టుకు వెళ్తామని అంటున్నారు.

ఓట్ల జాబితాపై జనంలో విమర్శలు
వార్డుల వారీగా ఓట్ల జాబితా విభజనలో పారదర్శకత లోపించిందనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీలలో ఓటర్ల లిస్ట్‌ ప్రదర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా గుర్తింపు జాబితాను కూడా అందుబాటులో ఉంచారు. గతంలో నిలువుగా ఉన్న వార్డులను అడ్డంగా చేసుకుంటూ భౌగోళిక సరిహద్దులను సవరిస్తూ ఓట్ల విభజన చేపట్టడం వల్లే ఈ సమస్యలు వచ్చాయన్న అభిప్రాయం నెలకొంది. అందుకే కొందరి ఓట్లు గల్లంతయ్యాయని అంటున్నారు. ఇంకొందరి ఓట్లు వారు ఉంటున్న వార్డు కాకుండా.. నాలుగైదు వార్డుల తర్వాత ఓటు నమోదైంది. ఓట్ల మార్పిడితో ఆందోళన చెందుతున్న ప్రజలు తాజా మాజీ కౌన్సిలర్లు, పోటీ చేసే ఆశావహులు, మున్సిపల్‌ కేంద్రాల వద్దకు పరుగులు పెట్టి తమ ఓట్ల విషయమై చర్చిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -