ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
న్యూఢిల్లీ : ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను పార్ల మెంట్‌కు సమర్పించనున్నారు. జనవరి 28న పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారని అధికారులు శుక్రవారం తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తాత్కాలికంగా ఈ షెడ్యూల్‌ను ఖరారు చేసిందని చెప్పారు. ప్రతి ఏటా పార్లమెంట్ మొదటి సమావేశం మొదటి రోజున రాష్ట్రపతి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. బీటింగ్ రిట్రీట్ ఉత్సవం కారణంగా 29వ తేదీన ఉభయ సభలు సమావేశం కావు. తిరిగి 30వ తేదీన పార్లమెంట్ సమావేశమవు తుంది, ఆ రోజున ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు.
మళ్లీ 31వ తేదీన ఉభయ సభలు సమావేశం కావు, ఇక ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్‌ను సభకు సమర్పించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్‌పై చర్చ అనంతరం పార్లమెంట్ సమావేశాలు ఫిబ్రవరి 13న వాయిదా పడతాయి. తిరిగి మార్చి 9వ తేదీన పార్లమెంట్ సమావేశమవుతుంది, ఏప్రిల్ 2 గురువారం నాడు సమావేశాలు ముగుస్తాయి. సాధారణంగా 3వ తేదీ శుక్రవారం వాయిదా పడాల్సి వుంది. అయితే ఆ రోజు గుడ్‌ఫ్రైడే తర్వాత వారాంతం కావడంతో ఏప్రిల్ 2నే ముగించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో విరామం వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల పద్దులను పరిశీలించడానికి శాఖాపరమైన స్థాయీ సంఘాలకు ఉపయోగపడుతుంది.



