Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్త్రీ, పురుషులు శత్రువులనే భావనను తిప్పికొట్టాలి

స్త్రీ, పురుషులు శత్రువులనే భావనను తిప్పికొట్టాలి

- Advertisement -

మహిళా ఉద్యమాల్లో వారిని భాగస్వాములను చేయాలి
ఐద్వా సెమినార్‌లో ప్రముఖ జర్నలిస్ట్‌ వనజ


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహిళా ఉద్యమాల్లో పురుషులను భాగస్వాములను చేయాలని ప్రముఖ జర్నలిస్ట్‌ సి.వనజ సూచించారు. మహిళలకు పురుషులు, పురుషులకు మహిళలు శత్రువులనే భావనలను సమాజంలోకి జొప్పిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి భావనలను తిప్పి కొట్టాల్సిన అవసరముందనీ, ఆ దిశగా మహిళా సంఘాలు ఆలోచించాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి అధ్యక్షతన ‘మహిళల భద్రత-ప్రభుత్వాల వైఖరి’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. మహిళా ఉద్యమాలు, కమ్యూనిస్టులు మహిళ లను సాధికారత దిశగా ప్రోత్సహించారనీ, ప్రస్తుతం ఆ సాధికారత సాధించిన మహిళల పట్ల పురుషులు ఎలా ఉండాలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మిగిలి ఉందని ఆమె గుర్తుచేశారు.

సమాజంలో జరిగే పరిణా మాలకు ప్రభు త్వాలదే బాధ్యత అని వనజ తేల్చి చెప్పారు. మహిళలపై హింసను ఒక సమస్యగా పరిగణించని సమాజంలోకి వచ్చామని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. స్త్రీ, పురుషులు ఒకరికొకరు శత్రువులనే ఆలోచనలను పెంచుతున్నారని తెలిపారు. మహిళలపై హింస అకస్మాత్తుగా జరిగే ఘటన కాదనీ, ప్రతి రోజు రిహార్సల్స్‌ జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాటాలతో దిగొచ్చిన పాలకవర్గాలు కంటితుడుపుగా చట్టాలు తెచ్చినా అవి అమలు కావడం లేదన్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించే చట్టం ఉన్నా దేశవ్యాప్తంగా ఒక శాతం కూడా అమలు కావడం లేదన్నారు. చట్టాలు అమలు కాకుండా సమాజంలో పెద్దలు, పోలీసులు, చివరకు కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా రాజీ చేసుకోవాలని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మార్పు కోసం ప్రగతిశీల శక్తులు ఇంట్లో, స్కూళ్లో జెండర్‌ సెన్సిటివిటీ పెరిగేలా అవగాహన కల్పించే చదువును చెప్పించాలని కోరారు.

సీపీఐ(ఎం) వల్లే నిలబడ్డా……
ఈ రోజు వనజ ఉందంటే అది సీపీఐ(ఎం) చలువేననీ వనజ తెలిపారు. తమ ఊరికి సీపీఐ(ఎం) రాకుంటే నేడు వనజ లేదని తెలిపారు. వంద శాతం బాల్య వివాహాలు జరిగే గ్రామంలో జన్మించిన తాను రైతు కూలీ సంఘం రాజకీయ తరగతులను మూడు రోజుల పాటు శ్రద్ధగా వినడం, పుస్తకాలను చదవడం ద్వారా బాల్య వివాహాల నుంచి బయటపడగలిగినట్టు చెప్పారు. మార్క్సిజం సిద్ధాంతం వెలుగులో ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నానని ఆమె తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఆవుల మంజులత మాట్లాడుతూ సమాజంలో అసమానతలు ఎంత ఎక్కువగా ఉన్నాయో భాషలో తెలుస్తుందన్నారు.

పౌరాణికాల్లో వివాహమైన రాజుకు భార్యతో పాటు మరో 8 మంది స్త్రీలను పంపించే వారని ఉందన్నారు. స్త్రీలకు స్వేచ్ఛ లేదనీ, వారిని ఒక సొత్తుగా మాత్రమే పరిగణించే పరంపర కొనసాగిందని గుర్తుచేశారు. తెలుగు భాషలో మహిళలకు, జడ పదార్థాలకు ఒకే రకమైన పదాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ అసమానతలను పోగొట్టేందుకు పోరాడిన స్త్రీలెందరో ఉంటే, వారికి సహకరించిన పురుషులెందరో ఉన్నారని ఆమె గుర్తుచేశారు. ఇప్పటికీ సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయనీ, వాటిని అధిగమించడానికీ, స్త్రీ-పురుషుల్లో సమాజం పట్ల అవగాహన పెరగాలని మంజులత అభిప్రాయపడ్డారు. అలాంటి అవగాహన పెంచే చదువు లభిస్తే పోరాడే శక్తి వస్తుందన్నారు.

అధ్యయనానికి ప్రాధాన్యమివ్వాలి :పుణ్యవతి
పనితో పాటు అధ్యయనానికి ప్రాధాన్యమివ్వాలని ఐద్వా ఆల్‌ ఇండియా కోశాధికారి పుణ్యవతి సూచించారు. ఆధునిక మహిళ భారతదేశాన్ని మారుస్తుందన్న గురజాడ మాటలను నిజం చేయాలని కోరారు. ఇంట్లో పెద్దలు చేసే దాన్నే పిల్లలు చేస్తారనీ, చిన్నప్పటి నుంచే అసమానతల భావనలు లేకుండా పెంచాలన్నారు. ఐద్వా హైదరాబాద్‌ సిటీ సెంట్రల్‌ కమిటీ క్యాలెండర్‌ను వనజ, మంజులత ఐద్వా నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.అరుణజ్యోతి, మల్లు లక్ష్మ, ఐద్వా సీనియర్‌ నాయకులు టి.జ్యోతి, రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఇందిర తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్‌ ఆవిష్కరణలో ఐద్వా సెంట్రల్‌ సిటీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, వరలక్ష్మి నాయకులు విమల, షబానా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -