మెదడులో రక్తం గడ్డ కట్టి విద్యార్థిని మృతి
కళాశాల ఎదుట కుటుంబసభ్యులు, దళిత సంఘాల నాయకుల ధర్నా
నవతెలంగాణ -కంటోన్మెంట్
క్లాస్‌కు ఆలస్యంగా వచ్చిందని లెక్చరర్లు విద్యార్థినిని ఎండలో నిల్చొబెట్టడమే కాకుండా తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని మెదడులో రక్తం గడ్డ కట్టి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారేడ్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వర్షిణి(17) గురువారం కళాశాలలో నిర్వహించే పరీక్షకు ఆలస్యంగా వెళ్లింది. దీంతో ఫిజిక్స్ లెక్చరర్ శ్రీలక్ష్మి, ఇంగ్లీష్ లెక్చరర్ మధురిమ ఆమెను తరగతి గదిలోకి అనుమతించలేదు. అంతేకాకుండా తోటి విద్యార్థులందరి ముందే ఆ విద్యార్థినిని వ్యక్తిగతంగా దూషించి.. ఎండలో నిలబెట్టారని విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనతో తీవ్ర మానసిక వేదనకు గురైన వర్షిణి కళాశాల ముగిసిన అనంతరం సోదరితో కలిసి మల్కాజిగిరిలోని తన ఇంటికి వెళ్లగానే కుప్పకూలిపోయింది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే మల్కాజిగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితి విషమించి మృతి చెందింది. మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్లే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో లెక్చరర్ల కారణంగానే వర్షిణి మృతి చెందిందంటూ ఆమె తల్లిదండ్రులు, దళిత సంఘాల నాయకులు శుక్రవారం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు సంబంధిత లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మారేడుపల్లి పోలీసులు తెలిపారు.



