– భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ
– బషీరాబాద్ లో సీసీ కెమెరాల ప్రారంభం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలోని బషీరాబాద్ గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి గ్రామ భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను సీఐ పొన్నం సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు, నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరా ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
గ్రామస్తులందరూ సమిష్టిగా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో భద్రత మరింత పెరుగుతుందన్నారు. సిసి కెమెరాలు ఏర్పాటుకు ముందుకు వచ్చిన గ్రామస్తులను అభినందించిన ఆయన, ఇది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. గ్రామస్తులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి, సర్పంచ్ బైకాన్ జమున మహేష్, ఉప సర్పంచ్ భూమేశ్వర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, తదితరులు పాల్గొన్నారు.


