మియాపూర్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్
మక్త మహబూబ్‌పేట్ పరిధిలో 159 ప్రయివేట్ సర్వే నంబరు వేసి కబ్జాకు యత్నం
ప్రజావాణి ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా
ఒకరిపై కేసు నమోదు
నవతెలంగాణ-మియాపూర్
ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఓ వ్యక్తి కుట్ర చేయగా.. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా స్పందించి రూ.3వేల కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని శనివారం స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసింది. హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్త మహబాబుపేట్ పరిధిలోని సర్వే నెంబర్ 44లోని ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి ప్రయివేట్ సర్వేనెంబర్ 159తో నకిలీ డాక్యుమెంట్ సృష్టించాడు. ఆ పత్రాలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా అధికారులు పలుమార్లు విచారణ చేపట్టగా సదరు భూమి ప్రభుత్వ భూమిగా తేలింది.
ఈ క్రమంలో భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకొని భూమి చుట్టూ ఉన్న గోడను కూల్చివేశారు. అనంతరం ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేశారు. కాగా, 15 ఎకరాల ఈ భూమి విలువ రూ.3వేల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూమి పరిరక్షణ కోసం హైడ్రా ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ప్రభుత్వం పేరుతో హైడ్రా అధికారులు ప్రయివేట్ వ్యక్తుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని పలువురు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనతో మియాపూర్, బొల్లారం హైవేపై కొద్దిసేపు వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రూ.3వేల కోట్ల భూమి హైడ్రా స్వాధీనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



