జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం పెంచడమే లక్ష్యం
రాష్ట్రాలకు ఇస్తున్న వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చాలి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి
ఆర్ఆర్ఆర్ను మంజూరు చేయండి
తెలంగాణలో ప్రాంతీయ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని భట్టి కోరారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం తెలంగాణలో పెట్టుబడి రేటును ప్రస్తుత 37 శాతం నుంచి 50 శాతానికి (జీఎస్డీపీ) పెంచాల్సి ఉందని సూచించారు. రాష్ట్రాల ద్రవ్య లోటు (ఫిస్కల్ డెఫిసిట్) పరిమితిని ఏడాదికి కనీసం నాలుగు శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు ఇస్తున్న 50 ఏండ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చాలనీ, ఆ సహాయాన్ని రెట్టింపు చేయాలని కోరారు. విద్య, ఆరోగ్య రంగాల కోసం సేకరించే వనరులను ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని సూచించారు.
తెలంగాణలో ప్రస్తుతం వెయ్యికిపైగా సామాజిక తరగతుల వారీగా గురుకుల పాఠశాలలున్నాయని వివరించారు. తమ ప్రభుత్వం 119 నియోజకవర్గాల్లో ఆధునిక వసతులతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఏర్పాటు చేస్తోందన్నారు. వాటిలో అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకుంటారని అన్నారు. అనేక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కేంద్రం మొత్తం వ్యయంలో 20 శాతం కంటే ఎక్కువ రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంశాలపై ఖర్చు చేస్తోందని వివరించారు. ఇందులో 25 శాతం తగ్గించి, రూ.2.21 లక్షల కోట్లను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేయాలని సూచించారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. శనివారం న్యూఢిల్లీలోని అశోకా హోటల్లో ప్రీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. బడ్జెట్ ముందస్తు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం-రాష్ట్రాల సమన్వయం ద్వారానే ఏ దేశమైనా పురోగమిస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం ముఖ్యమైన చొరవ అని చెప్పారు. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన అభినందించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తాము తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ను ఆవిష్కరించామని గుర్తు చేశారు. దీని ద్వారా తెలంగాణను ప్రస్తుతం ఉన్న 200 బిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నిస్తున్నామని వివరించారు. తద్వారా దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు.
సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి
ప్రస్తుతం సెస్‌లు, సర్‌చార్జీల వాటా కేంద్ర పన్ను రాబడిలో 20 శాతానికి చేరిందని భట్టి విక్రమార్క అన్నారు. దీనివల్ల 15వ ఆర్థిక సంఘం 41 శాతం పన్ను బదిలీని సిఫారసు చేసినప్పటికీ రాష్ట్రాలకు కేవలం 30 శాతం మాత్రమే అందుతోందని చెప్పారు. దాదాపు రూ1.55 లక్షల కోట్ల సర్‌చార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలనీ, లేదంటే వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకుని అనుమతులివ్వాలని సూచించారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటును ప్రకటించాలని కోరారు. మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలను మంజూరు చేయాలని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం రూ14,100 కోట్లు, రేడియల్ రోడ్ల కోసం రూ45 వేల కోట్లు, హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం రూ17,212 కోట్లు కేటాయించాలని అన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో తమ అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలించాలని కోరారు.



