రాజకీయ, వాణిజ్య, ఆధిపత్య ప్రయోజనాల కోసమే వెనిజులాపై దాడి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకోవాలి
యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రయివేటీకరించొద్దు
ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి బీజేపీ కుట్ర
అటవీ, ఖనిజ సంపద కోసమే మావోయిస్టులు, ఆదివాసీలపై దాడులు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
నవతెలంగాణ – భువనగిరి
దేశ ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షులు ట్రంప్ ముందు వంగి సాష్టాంగ ప్రమాణం చేస్తూ మోకరిల్లుతున్నారని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన సీపీఐ(ఎం) జిల్లావిస్తృత స్థాయి సమావేశానికి రాఘవులు హాజరయ్యారు. అనంతరం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని 140 కోట్ల జనాభాకు విశ్వగురు అని చెప్పుకునే మోడీ మౌనం పాటిస్తున్నారన్నారు. భారతదేశాన్ని, దేశ నాయకత్వాన్ని అమెరికా అధ్యక్షులు అవమానపరుస్తున్నా ప్రధాని మోడీ నోరు విప్పడం లేదన్నారు. మోడీ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడంతోనే భారత్‌పై భారీగా వాణిజ్య జరిమానాలు, ద్వైపాక్షిక బిల్లులు పడ్డాయని రిపబ్లిక్ సెనిటర్ లిండ్సేగ్రహం వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు. దానికి మోడీ ట్రంప్‌తో 8సార్లు మాట్లాడారని దేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా దేశ నాయకులు, విదేశీ మంత్రిత్వ శాఖ మాట్లాడుతుందన్నారు.
ప్రపంచ టెర్రరిస్ట్‌లాగా అమెరికా వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షులు మదురో, అతని భార్యను ఎత్తుకుపోయి నిర్బంధించినా మోడీ మౌనం వీడటం లేదన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ట్రంప్ చర్యలను మోడీ ఖండించాలని డిమాండ్ చేశారు. వెనిజులాపై అమెరికా టెర్రరిస్టుల మాదిరిగా వ్యవహరిస్తుంటే, ఉభయులు చర్చించుకుని శాంతిగా ఉండాలని భారత్ నాయకులు ప్రకటించడం సరైనది కాదన్నారు. చైనా, రష్యాతోపాటు బ్రెజిల్, స్పెయిన్, కొలంబియా, మెక్సికో, ఉరుగ్వే సహా అనేక దేశాలు అమెరికా చర్యపై ఆగ్రహంగా ఉన్నాయని చెప్పారు. అమెరికా చర్యలను అనేక ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయన్నారు. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా ఉల్లంఘిస్తుంటే భారతదేశం స్పందన లేదన్నారు. వెనిజులాతోపాటు ఇక గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్నేసి యుద్ధోన్మాదిగా మారారని తెలిపారు. లాటిన్ అమెరికాలో సోషలిస్టు ప్రభుత్వం ఉండటం అమెరికాకు నచ్చడం లేదన్నారు. అమెరికా చర్యలను ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏనాడూ ఇంత వ్యతిరేకత రాలేదన్నారు. భారత్‌పై ట్రంప్ చులకనగా మాట్లాడటంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించి దేశ గౌరవాన్ని కాపాడాలని సూచించారు.
రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకోవాలి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని రాఘవులు అన్నారు. సమస్యలను చర్చల ద్వారా, నిపుణుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ అధికార పార్టీపై అక్కసుతో కాకుండా తెలుగు ప్రజల మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చొరవ చూపెట్టాలన్నారు. రాష్ట్రాలు ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయినా సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. కాల పరమితి ప్రకటించుకుని రెండు రాష్ట్రాలు ముందుకుపోవాలని సూచించారు.
సంపదను దోచుకోవడానికి మావోయిస్టులపై దాడులు
దేశంలో ఉన్న అటవీ, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులైన అదానీ, అంబానీ, మిట్టల్ లాంటి సంస్థలకు కేటాయించి దోచుకోవడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులు, ఆదివాసులపై దాడులు చేస్తోందని రాఘవులు చెప్పారు. మావోయిస్టులతో సైద్ధాంతిక విభేదాలు ఉంటే.. వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలన్నారు. మావోయిస్టులపై దాడులు ప్రజల కోసమో, గిరిజనుల కోసమో కాదని అటవీ సంపద కోసమేనని వివరించారు. మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్లు రాజ్యం చేయాల్సిన పని కాదని, నిరంకుశ ప్రభుత్వాలు చేసే పని అని విమర్శించారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని తాము కూడా అంగీకరించబోమని, కానీ.. చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ.. వేలాది మంది పోలీసులు వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. కార్పొరేట్లు జల వనరులను దోచుకోవడానికి కృషి చేస్తున్నారని, సీలేరు శబరి నీటి పంపు స్టోరేజీలు అదానీకి ఇచ్చారని తెలిపారు. దేశంలోని అటవీ చట్టాలను దెబ్బతీస్తూ మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. దీనివల్ల అడవులకు నష్టమని, జీవవైవిధ్యం నశించే ప్రమాదం ఉన్నదని నిపుణులు, పర్యావరణవేత్తలు అభిప్రాయ పడుతున్నారని అన్నారు. అడవిలో వేల సంవత్సరాలుగా నివాసముంటున్న ఆదివాసులను అక్కడి నుంచి తరలించడానికి కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. సీపీఐ(ఎం) ఉద్యమాలు, పోరాటాలతోటే ఎన్నికలలో ముందుకు పోతుందని రాఘవులు చెప్పారు. వామపక్షాలు, అభ్యుదయవాదుల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను సవరించుకొని ముందుకు పోయి ప్రజలకు మరింత మేలు చేస్తామన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశపడ్డారని, అది అంతగా జరగదని గ్రహించారని అన్నారు. ఎన్నికల కమిషన్ ఓటర్ జాబితా తయారీలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఆ పార్టీకి అనుకూలంగా లేని మహిళలు, మైనార్టీ ఓట్లు తగ్గించేందుకు పనిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా దుర్బుద్ధితో జాబితాలు తయారు చేస్తోందన్నారు. దేశ పౌరసత్వం, భారతదేశంలోకి వచ్చిన ఆక్రమణదారులను గుర్తించడం, వారిని శిక్షంచడానికి విదేశీ వ్యవహారాలలో ఒక ప్రత్యేక శాఖ ఉందని, ఇది నిరంతర ప్రక్రియగా జరగాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ ఉన్నారు.
ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి కుట్ర
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం స్థానంలో వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురావడాన్ని తీవ్రంగా రాఘవులు ఖండించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉపాధి హామీ చట్టాన్ని వినియోగించుకుంటుందని అన్నారు. వీబీ జీ రామ్ జీ చట్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యతిరేకించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమించాలని కోరారు. కార్పొరేట్ లాభాల కోసం పేదల బతుకులను బలి పెట్టొద్దని కేంద్రానికి సూచించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రయివేటీకరించొద్దు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో వివిధ విభాగాలను ప్రయివేటు వారికి ధారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారని దాన్ని వెంటనే విరమించుకోవాలని రాఘవులు ప్రభుత్వాన్ని కోరారు. నిర్మాణంలో పాలుపంచుకున్న జెన్‌కోకు నిర్వహణ సామర్థ్యం ఉందని, దానికే కేటాయించాలని అన్నారు. విద్యుత్ ఉత్పాది కేంద్రాలను చేజిక్కించుకుంటున్న అదానీ ఆధీనంలోకి ఈ ప్రాజెక్టు వెళ్లకుండా జెన్‌కో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.



