తరాలుగా జరిగినదీ… ఇప్పుడూ జరుగుతున్నది.. ప్రాచీన భారతంలో సనాతన ధర్మాచారులు చేసినపనే ఇప్పుడూ కోరుకుని ఆనంద నర్తనం చేస్తున్నారు. ఎవరు ఎక్కడుండాలి. ఎవరు ధీరులు, ఎవరు బానిసలు, ఎవరు విద్యకు, పాండిత్యానికి అనర్హులు? అనేది నిర్థారించి నిలువరించారో, మళ్లీ మొదలేశారు. నాగరికత వీళ్లకు అరిష్టమయినది. ప్రజాస్వామ్యం అంటే ఒళ్లంతా జలధరిస్తుంది. సమానతా, సౌభ్రాతృత్వం అనే పదాలు మన దేశీయమైనవి కావనేది వారి దృఢ అభిప్రాయం. ఇక సెక్యులరిజం అనగానే వారి గొంతులో వెలక్కాయపడుతుంది. బ్రాహ్మణ క్షత్రియులకు తప్ప శూద్రులు, మహిళలకు జ్ఞాన సముపార్జన, విజ్ఞానం అధ్యయనం పాపముతో సమానము. జాతి, మత, కుల వ్యత్యాసములు ఉచ్ఛనీచములు ధర్మ నిర్దేశితములు. సదా వాటి అమలు నేటికినీ అనుసరణీయములు కనుకనే మోడీ రాజ్య భారమును తలకెత్తుకొనియుండెను. ఇది చిన్నవైన ముందు పలుకులు. తత్‌ఫలిత ఆచరణ దృశ్యమునొకటి పేర్కొనదెను.
అది జంబూ ద్వీపంలోని జమ్మూకాశ్మీరు. వాళ్లు అక్కడ పెద్ద జులూస్ తీస్తున్నారు. పెద్దపెద్దగా నినాదాలు చేస్తున్నారు. తలలకు కాషాయ రుమాళ్లు, భుజాలపై కాషాయ కండువాలు.. నుదుటిపై కుంకుమలు.. చేతుల్లో మిఠాయి పొట్లాలు.. జై శ్రీరాం అంటూ నినాదాలు. ఎక్కడలేనంత సంబరం.. రాజ్యాన్ని గెలిచినంత ఆనందం వారి కళ్లల్లో.. వారి ఆనందానికి కారణమేమిటో తెలుసా? మాతా వైష్ణోదేవి మెడికల్ కళాశాలలో జరిగిన అడ్మిషన్లను రద్దుచేయటం, యాభై మంది భారతీయులు, యువతకు డాక్టరు చదవడానికి వీలులేకుండా రద్దు కాబడటం వారికి ఎనలేని ఆనందం కలుగుతున్నది. ఆ మెడికల్ సైన్స్ కళాశాలలో సీట్ల భర్తీని, కళాశాల అనుమతిని రద్దు చేయాలని తీవ్రంగా ప్రయత్నించి, పోరాడి.. చదువును నిరాకరించాలని డిమాండ్ చేసి విజయం సాధించారు వాళ్లు. వాళ్లకా ఆనందాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కి వారు ధన్యవాదాలు తెలిపారు. వారి ఈ విజయోత్సవాలలో పాల్గొన్న కాషాయ సమూహ నాయకులు మాట్లాడుతూ ”ఇది హిందూ సమాజపు విజయం”గా అభివర్ణించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పరివారమంతా రద్దు అంశాన్ని స్వాగతించాయి.
అసలు విషయమేమంటే, జమ్మూకాశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో వైద్య విద్యను అభ్యసించటానికి అడ్మిషన్లు చేపట్టింది. నీట్ (ఎన్‌ఈఈటీ) ఆధారంగా మెరిట్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. మొత్తం యాభై సీట్లనూ నింపారు. అసలు బాధ ఎక్కడొచ్చిందంటే, యాభై మందిలో నలభైరెండు మంది విద్యార్థులు ముస్లింలు కావటం, వీళ్లకు కంపరమెత్తింది. ఒకరు సిక్కు అయితే ఏడు గురు హిందూ విద్యార్థులున్నారు. ‘నలభై రెండు మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించటమా! ఎంత ధైర్యం..! వాళ్లు చదవటానికి వీల్లేదు. కళాశాలనే రద్దు చేస్తాం’ అంటూ తీవ్ర ఆందోళనలు చేసి ఎట్టకేలకు దాన్ని రద్దు చేయించారు. విద్యకు ముస్లింలను దూరం చేయటమే వీరి విజయం. పూర్వంలో శూద్రులకూ, దళితులకు విద్యను దూరం చేసిన ధర్మ సంస్థాపకులే నేడు ఈ పని చేశారు.
ఈ సంవత్సరం నలభైరెండు మంది విద్యార్థులు ముస్లింలై ఉండవచ్చు. వచ్చే సంవత్సరం హిందువులూ పొందవచ్చు. కానీ, ఇప్పుడు వీళ్లు పై చేయి సాధించారని అసలు కళాశాల అనుమతినే రద్దు చేయించడం ఎంత మూర్ఖమైనది! రద్దు చేయటానికి వాళ్లు చూపించిన లేదా చెప్పిన కారణాలు ఫ్యాకల్టీ, వసతి ఏర్పాట్లు సరిగాలేవన్న సాకుచూపారు. కానీ, అక్కడి విద్యార్థులు మాత్రం, మంచి అధ్యాపకులు ఉన్నారని, మాకు అందుబాటులో ఉన్న అవకాశాన్ని ఈ రకంగా రద్దు చేయటం సరికాదని చెబుతున్నారు. మత ప్రాతిపదికన విద్యా అవకాశాలను నిర్ణయించడం సిగ్గుచేటయిన విషయం. ఒకవైపు ఉన్నత విద్యను, పాఠాలను, చరిత్రను విశ్వాసాల ఆధారంగా మార్చేస్తున్న అంధముఖులు, చీకటి నుండి వెలుగులోకి కాకుండా.. వెలుగునుండి చీకటిలోకి పయనిస్తున్నారు. మతం పేరు చెప్పి ప్రజలందరినీ వెనక్కి నడిపించే మూర్ఖుల పాలన సాగుతున్నది.
ఘనత వహించిన మన నాయకుడు విశ్వగురువుగా తనకు తానే విశేషణాన్ని తగిలించు కొన్నవారి చదువుకు సంబంధించిన డిగ్రీనే రహస్యంతో కూడుకున్నదాయే. విద్యాశాఖను నిర్వహించిన మంత్రి స్మృతి ఇరానీ చదువూ అస్పష్టమైనదే. ఇక వీళ్లకు చదువుకు, విజ్ఞానానికిగల ప్రాధాన్యం ఏమి తెలుస్తుంది? వీరి పరివారమంతా ఇంతే! వాస్తవంగా సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు విద్య, ఉద్యోగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని తెలిపింది. ఇపుడిపుడే చదువుల్లోకి వస్తున్నవారిని చూసి, ఇంత బెదిరిపోవడమేమిటి? వీళ్లే కాదు, దళితులు చదువుతున్నా, ఆదివాసీలు బతుకుతున్నా సహించలేరు. ఆ 40 మంది విద్యార్థులు ఏమైనా విదేశీయ ఉలా! ఏమిటీ మతతత్వం! మూర్ఖమతుల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవాలి!
మూర్ఖానందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



