Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంసంక్రాంతిలోపు పీఆర్‌సీ ఇవ్వాలి

సంక్రాంతిలోపు పీఆర్‌సీ ఇవ్వాలి

- Advertisement -

– ఏపీ యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ డిమాండ్‌
– 20 నుంచి ఉద్యమం, సర్కార్‌ స్పందనబట్టి ‘చలో అసెంబ్లీ’
– టెట్‌ మినహాయింపు కోరుతూ టీచర్ల ర్యాలీ
గుంటూరు :
సంక్రాంతి లోపు పే రివిజన్‌ కమిషన్‌ (పిఆర్‌సి) నియమించకపోతే 20వ తేదీ నుండి యుటిఎఫ్‌ ఉద్యమానికి సిద్ధమవుతుందని ఆ సంఘం రాష్ట్ర నేతలు హెచ్చరించారు. ‘ఊరిబడిని కాపాడుకుందాం’ నినాదంతో రెండు రోజులపాటు జరిగే యుటిఎఫ్‌ రాష్ట్ర 51వ కౌన్సిల్‌ సమావేశం గుంటూరులోని ఎసి కాలేజీ ప్రాంగణంలో శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. వేలాదిగా హాజరైన బహిరంగ సభలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ఉపాధ్యాయుల సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టారు. పిఆర్‌సి ఏర్పాటుతోపాటు 29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలు చెల్లింపునకు రోడ్డుమ్యాపు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ రద్దు చేయాలని, ఉపాధ్యాయులపై అధికారుల నిర్బంధ వైఖరి మార్చుకోవాలని, బోధనేతర కార్యక్రమాల నుండి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. ఆయా సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ‘చలో అసెంబ్లీ’ నిర్వహిస్తామని ప్రకటించారు.

ఉపాధ్యాయులు హేతుబద్ధమైన విద్యనందించాలి : ప్రొఫెసర్‌ దేవరాజు మహారాజు

ముఖ్యఅతిథిగా హాజరైన కేేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ దేవరాజు మహారాజు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విద్య కాషాయీకరణ, ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ అహేతుకమైన అంశాలను సిలబస్‌లో చేర్చిందన్నారు. ఉపాధ్యాయులు అహేతుకమైన అంశాలకు బదులు హేతుబద్ధమైన విద్యనందించాలని పిలుపునిచ్చారు. ప్రశ్న, వైజ్ఞానిక స్పృహ బతికి ఉండకూడదని కేంద్రం భావిస్తోందని, ప్రశ్నించిన వేలాది మందిని ఇబ్బందులకు గురిచేస్తోందని వివరించారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి ప్రారంభోపన్యాసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో గత పది పదిహేనేళ్లుగా బుల్డోజర్‌ విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం కొందరు అధికారులను ఏరికోరి నియమిస్తోందని, వారి దుందుడుకు చర్యలు ఉపాధ్యాయులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయని తెలిపారు. ఒకర్ని మించి మరొకరు ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తున్నారని, వారి విధానాలు ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతాయని గుర్తించాలన్నారు. మంత్రి లోకేష్‌కు విద్యారంగం సమస్యలపై సంఘాలతో చర్చించే తీరిక లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పుపై తమిళనాడు సహా పలు రాష్ట్రాలు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయని, మన రాష్ట్రం మాత్రం నోరు మెదపట్లేదన్నారు. దాదాపు సగం మంది ఉపాధ్యాయులు టెట్‌ ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యుటిఎఫ్‌ కార్యకర్తలందరూ హక్కుల కోసం, ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభ అనంతరం టెట్‌ నుండి ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించాలని సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని కోరుతూ సభా ప్రాంగణం నుండి హిందూ కాలేజీ, నాజ్‌ సెంటర్‌ మీదుగా తిరిగి సభా ప్రాంగణం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, సహాధ్యక్షులు కె.సురేష్‌ కుమార్‌, కుసుమ కుమారి, రాష్ట్ర ట్రెజరర్‌ రెడ్డి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -