Monday, January 12, 2026
E-PAPER
Homeజాతీయంఅయోధ్య పరిసరాల్లో మాంసాహార డెలివరీపై నిషేధం

అయోధ్య పరిసరాల్లో మాంసాహార డెలివరీపై నిషేధం

- Advertisement -

అయోధ్య : అయోధ్యలోని రామమందిరానికి పదిహేను కిలోమీటర్ల పరిధిలో మాంసాహార పదార్థాల సరఫరాను అధికారులు నిషేధించారు. ‘పంచ్‌ కోసి పరిక్రమ’లో భాగమైన కొన్ని ప్రాంతాలలో ఫుడ్‌ డెలివరీ సంస్థలు మాంసాహారాన్ని సరఫరా చేస్తున్నాయంటూ ఫిర్యాదులు అందడంతో వాటిని సమీక్షించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. పంచ్‌ కోసి పరిక్రమ అనేది మతపరమైన సంప్రదాయం. నగరంలో పదిహేను కిలోమీటర్ల పరిధిలో దీనిని పాటిస్తారు. ‘ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ మాంసాహార పదార్థాల డెలివరీపై నిషేధం విధించడం జరిగింది’ అని అయోధ్య అసిస్టెంట్‌ ఫుడ్‌ కమిషనర్‌ మానిక్‌ చంద్ర సింగ్‌ మీడియాకు తెలిపారు.

మాంసాహారం, మద్యం సరఫరా చేయవద్దని అయోధ్యలోని సంస్థలకు కూడా ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. నగరంలో 14 కిలోమీటర్ల పొడవైన రామ్‌ పథ్‌ వెంబడి మాంసం, మద్యం విక్రయించరాదంటూ అయోధ్య మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొన్ని నెలల క్రితమే తీర్మానించింది. అలాగే పాన్‌, గుట్కా, బీడీ, సిగరెట్‌ విక్రయాలపై కూడా నిషేధం అమలులో ఉంది. లోదుస్తులతో వ్యాపార ప్రకటనలు ఇవ్వడాన్ని కూడా నిషేధించారు. కాగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ తీర్మానించి తొమ్మిది నెలలు గడిచినప్పటికీ పథ్‌ వెంబడి మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -