సుల్తాన్ బజార్ ఇన్ స్పెక్టర్ కె నరసింహ
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
కోడిపందాలు, పేకాట అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సుల్తాన్ బజార్ ఇన్ స్పెక్టర్ కె నరసింహ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలు, చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. నైలాన్ “చైనీస్” మాంజా, గాజు లేదా లోహంతో కోటింగ్ చేసిన పదునైన దారాల వినియోగం వల్ల రాష్ట్రంలోని ఇటీవల వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆకాశంలో ఎగిరే గాలిపటం ఆనంద హేతువైతే, అదే రోడ్డుపై పడే మాంజా దారం మృత్యవకు కారణం అవుతోంది. ఇది శోచనీయం. మనుషులు, జంతువులు, పక్షుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది అన్నారు. గాలిపటం ఎగరవేసే మాంజాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇటీవలి కాలం లో ద్విచక్ర వాహనదారుల మెడలకు చైనీస్ మాంజా చిక్కి తీవ్ర గాయాలపాలైన సంఘటనలు తెలిసింది అని అన్నారు. మాంజా కారణంగా మాంజా చెట్ల కొమ్మలకు, విద్యుత్ తీగలకు చిక్కి రోడ్డుపై వేలాడటం కారణం గా ప్రమాదాలకు దారి తీస్తోంది అన్నారు.
చైనీస్ మాంజా నైలాన్, సింథటిక్ ఫైబర్ తో తయారవడంతో పాటు గాజుపొడి, లోహచూర్ణం పూత ఉండటంతో అత్యంత పదునుగా, ప్రమాదకరంగా మాంజా ఒక్కసారిగా వేగంగా మెడకు చుట్టుకుంటే తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంది అన్నారు. మూగజీవాలకూ ముప్పే,ఈ మాంజా వల్ల కాళ్లకు దారాలు చుట్టుకుని గాయాల ప్రమాదం పొంచి ఉందన్నారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా చైనా మాంజా అమ్మినా, వినియోగించినా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు, చిన్న పిల్లలు, యువత ఇంటి పైకప్పులు, టెర్రస్ ల పై గాలిపటాలు ఎగరవేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. గోడ అంచులు లేని మిద్దె పై నుంచి కింద పడే ప్రమాదాలు పొంచి ఉన్నాయి అన్నారు. పిల్లలు గాలిపటాలు ఎగరవేసే సమయంలో ప్రమాదాలు జరగ కుండా తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షిం చాలి అని కోరారు.
రోడ్లు, ప్రధాన రహదారులు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేయకూడదు అని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, మైదానాలను మాత్రమే గాలిపటాలు ఎగురవేయడానికి అనువైనవి అని సూచించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని కోరారు. రోడ్డుపై వేలాడుతున్న గాలిపటాల దారాలు కనిపిస్తే వెంటనే జీ హెచ్ ఎమ్ సీ అధికారులకు సమాచారం ఇవ్వాలి అన్నారు. వాహనదారులు గాలిపటాల సీజన్ లో మితవేగంతో ప్రయాణించాలి అన్నారు. చైనీస్ మాంజా విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి అని ప్రజలకు సూచించారు.



