వారంలో పెరిగిన ధరలు.. సామాన్యులపై భారం
నవతెలంగాణ – మల్హర్ రావు
సంక్రాంతి పండుగ పూట వంట నూనె ధరల మంటతో సామాన్య ప్రజలపై భారం తప్పడం లేదు. వారం రోజుల్లోనే ఒక్కసారిగా ప్యాకెట్ పై రూ.10 పెరిగింది. సంక్రాంతి సీజన్ కావడం..పిండి వంటలు పెద్దఎత్తున చేసుకోవడం ఆనవాయితీ కావడం కారణమా..మరైదేనా పరిస్థితులా తెలియదు కానీ..గడిచిన వారం రోజుల్లో లీటర్ పొద్దు తిరుగుడు నూనె ధర రూ.5 వరకు పెరిగింది.దసరా (అక్టోబరు నెల) పండగ రేట్లతో పోలిస్తే లీటర్కు రూ.10 చొప్పున పెరిగింది. మూడు నెలల్లోనే ఇంత మొత్తంలో పెరగడంపై అనుమానాలున్నాయి. ఒకేసారి ఇలా ధరలు పెరగడానికి వ్యాపారులు సరకు బ్లాక్ చేసి ధరలు పెంచడమూ కారణమన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రజలు, ఇతర వాణిజ్య అవసరాల(హోటళ్లు, రెస్టారెంట్లు) కోసం ప్రతినెలా 50 మెట్రిక్ టన్నుల వంటనూనెలు వినియోగిస్తారు. వీటిలో సింహభాగం పొద్దు తిరుగుడు నూనె 30 మెట్రిక్ టన్నులు, పామాయిల్ 10 మెట్రిక్ టన్నులు, ఇతర నూనెలు 10 మెట్రిక్ టన్నులు ప్రజలు వాడుతున్నారు. ఈ నెల మొదటి వారం ముగిసేసరికి గృహావసరాల కోసం ఒక నెలకు సరిపడా నూనెలను ప్రజలు కొనుగోలు చేశారు. ఈ విధంగా మండల ప్రజలపై అదనంగా రూ.1లక్ష భారం పడుతోంది. మండలంలో జిల్లాలో ప్రతినెలా రూ.1.50 లక్షల విలువైన పొద్దుతిరుగుడు నూనె వినియోగమవుతుండగా.. ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం రూ.1.80 లక్షలు వెచ్చించాల్సి వస్తుంది.
లీటరు రూ.10 వరకు..
దేశీయ అవసరాలకు పొద్దుతిరుగుడు నూనెను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా.. అంతర్జాతీయ మార్కెట్ ఎగుడు దిగుడులకు అనుగుణంగా కొన్ని రోజులుగా ఈ నూనెల ధరల్లో మార్పులు లేవనే చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభంతో పోలిస్తే లీటరు ధర రూ.10 వరకు పెరిగింది. అయితే దేశీయ నూనెలైన వేరుశనగ, రైస్ బ్రాన్(తవుడు), సోయాబీన్ నూనెల ధరల్లో పెద్దగా మార్పులేమి లేవు. సాధారణంగా పొద్దు తిరుగుడు, ఇతర నూనెల కంటే వేరుశనగ నూనె ఎక్కువ ధర పలుకుతుంది. కానీ ఈ ఏడాది వేరుశనగ.. సీజన్ ఆరంభం నుంచి ఇతరవాటికంటే తక్కువ ధర ఉంటుంది.



