నవతెలంగాణ – ఆర్మూర్
భూమిని మేము చెప్పిన వారికి ఇవ్వకుంటే కుల బహిష్కరణ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్న మా కుల సంఘ సభ్యులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ కు చెందిన తీగల గంగుబాయి అలియాస్ లక్ష్మీబాయి ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త కీ,శే. తీగల నర్సాగౌడ్ పేరుతో ఉన్న భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ సర్వేనెంబర్160 /1/2 ,ఒక ఎకరం 20 గుంటలు,సర్వే నంబర్ 139/1 క్యూ విస్తీర్ణం 0.10 గుంటలు తన భర్త పేరుపైన ఉందని, చనిపోగా ఇట్టి భూమిని చాలా సంవత్సరాల నుండి సాగు చేసుకుని జీవిస్తున్నామని, మా గౌడ కులస్తులే ఇట్టి భూమి మా కులస్తుడైన ఒకరికి ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో కుల బహిష్కరణతో పాటు వచ్చే మామూలు డబ్బులు ఇవ్వమని, మా భూమి లోకి రాకుండా బెదిరిస్తున్నారని,దాడి చేయడానికి సైతం వచ్చినారని, చెప్పినట్లు వినకుంటే గ్రామంలోకి రానివ్వమని, నా కుమారుడిని చంపుతామంటూ బెదిరిస్తున్నారని తెలిపింది. ఇంటి నిర్మాణం సైతంను అడ్డుకున్నారని ఇట్టి విషయమై గతంలో మున్సిపల్ కమిషనర్ కు సైతం ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కులస్తులు పంచాయితీకి కూర్చున్న ప్రతిసారి మా వద్ద 5,000 రూపాయలు తీసుకుంటున్నారని, ప్రస్తుతం మాట్లూర్ మండలంలోని మాణిక్ బండ అద్దెకు ఉంటున్నట్లు తెలిపారు. తమ కులస్తులపైన తగు చర్య తీసుకుని, వారి బెదిరింపుల నుండి రక్షణ కల్పించి భూమిలోకి ఎవరు రాకుండా చూడవలసిందిగా తెలిపారు.



