ఏమాత్రం సరిపోని రైళ్లు, బస్సులు
అసంతృప్తిలో ప్రయాణికులు
హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలంతా స్వస్థలాల బాట పట్టారు. కుటుంబ సమేతంగా ఊళ్లకు ప్రయాణమవుతున్నారు. ఆర్టీసీ, ప్రయివేట్ బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో పల్లెలకు చేరుకుంటున్నారు. దీంతో రహదారులు, ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారుతున్నాయి. అయితే ఈ రద్దీకి తగ్గటుగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు
సంక్రాంతికి ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ 6,430 ప్రత్యేక బస్సులను, దక్షిణ మధ్య రైల్వే 160 ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు దాదాపు వెయ్యికిపైగా ప్రయివేట్ బస్సులను నడిపిస్తున్నారు. వీటిలో పాటు క్యాబ్‌లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. చాలామంది ప్రజలు తమ సొంత వాహనాల్లో సొంతూళ్లకు వెళ్తున్నారు.
కొన్ని ప్రధాన పాయింట్లలలో రద్దీగా
టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లను కేటాయించడంతో అవి సులభంగా వెళ్తున్నాయి. టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరినప్పుడు సిబ్బంది వాహనాల వద్దకు వచ్చి ఫాస్టాగ్‌ను స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్‌తోపాటు ప్రధాన పాయింట్లు కూడా ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి.
సరిపోని ఆర్టీసీ బస్సులు… ప్రజల ఇబ్బందులు
ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ సెలవుల్లో విశాఖ, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయి వేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణలోనూ మేడా రం, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. సెలవులు రావటంతో..ఇదే అదనుగా సొమ్ము చేసుకోవడానికి ప్రయివేట్ ట్రావెల్స్ యజమానులు టికెట్ ధరలను పెంచేశారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక చార్జీలను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.
ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు
రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయివేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యం చెలాయిస్తున్నారని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్-విజయనగరానికి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుల్లో సీటర్ అయితే రూ.1,400 నుంచి రూ.1,600 చార్జీ, స్లీపర్ అయితే రూ.2 వేల వరకు చార్జీ ఉంటుంది. ప్రస్తుతం సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఓ ట్రావెల్స్ సంస్థ ఏకంగా నాలుగు రెట్లు ధరలు పెంచేసింది. హైదరాబాద్ నుంచి విజయనగరానికి రూ.6,000 వసూలు చేస్తోంది. మరో సంస్థ సీటర్‌కు రూ.3,499, స్లీపర్ అయితే రూ.3,999 తీసుకుంటోంది.
పెరిగిన ప్రయాణికుల సంఖ్య
గతేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా 9 లక్షల మంది ప్రజలు సొంతూళ్లకు బయలుదేరి వెళ్ళారు. ఈ ఏడాది ఆ సంఖ్య 12 లక్షలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు రోజుకు 10 వేల నుంచి 12 వేల వాహనాలు నిత్యం తిరుగుతుంటాయి.
జాతీయ రహదారిపై బారులు తీరిన వాహనాలు
సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలు ఒకదాని వెనుక ఒకటి బారులు తీరతాయి. రద్దీ పెరగడంతో వాహనాలు ట్రాఫిక్‌లో వేగంగా వెళ్లలేక, బంపర్ టు బంపర్ వెళుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నుంచి యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా దాటే వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో అక్కడక్కడ ప్రధాన కూడళ్లలో, బస్టాప్‌లలో పెరిగిన వాహనాల రద్దీతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి వాహనదారులకు ఈ తిప్పలు తప్పడం లేదు.
సంక్రాంతి నేపథ్యంలో పట్నం.. పల్లెబాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



