ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఎ) 30.03 శాతం నుంచి 33.67 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల(టీఎన్జీవో) కేంద్ర సంఘం, హైదరాబాద్ జిల్లా యూనియన్ నాయకులు స్వాగతించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో కార్యాలయంలో సోమవారం టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మార్వం జగదీశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు, వివిధ సవాళ్ల నడుమ కూడా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
ప్రభుత్వంతో తమ సంఘం నిరంతరం జరిపిన చర్చల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని, ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు భవిష్యత్‌లోనూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీఏ పెంపు పట్ల ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్) మాట్లాడుతూ.. డీఏ పెంపు నిర్ణయం సంతోషకరమన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రితో జరగబోయే అధికారిక సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన ఇతర గ్రీవెన్స్‌లు, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. వారి వెంట టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎస్. విక్రమ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఉన్నారు.



