మేడే ఒక తేదీ కాదు..కేవలం జ్ఞాపకం కూడా కాదు.
కార్మిక శక్తి చరిత్రను కదిలించిన రోజు.
కష్టజీవులు తమ ఆవేశాన్ని పోరాటంగా మార్చుకున్న రోజు
హద్దులు లేని శ్రమ దోపిడీలో నలిగిన జీవితాలు.. చికాగో వీధుల్లో హక్కుల పతాకాలై కవాతు చేశాయి. హే మార్కెట్ సాక్షిగా ఎనిమిది గంటల పనిని నెత్తుటితో లిఖించాయి. ”మేం బానిసలం కాదు” అంటూ పెట్టుబడి గుండెల్లో గునపాలు దించాయి. ఆ రణనినాదం ఆ ఒక్క రోజుకే పరిమితం కాలేదు. హే మార్కెట్ ఘటన అక్కడితో ముగియలేదు. అక్కడే మొదలయ్యింది. కాలాన్ని దాటి, ఖండాలను దాటి విశ్వమంతటికీ ప్రవహించింది. కార్మికోద్యమ ప్రస్థానంలో కాంతిరేఖగా వెలిగింది. ఆ వెలుగులో కార్మిక హక్కులు అంతర్జాతీయ చర్చల కేంద్రంగా మారాయి. ఎనిమిది గంటల పనివిధానం ప్రపంచ కార్మిక వర్గం సాధించిన ప్రాథమిక హక్కుగా స్థిరపడింది. వేతనాలకు చట్టబద్ధత వచ్చింది. ఇవి ఎవరో ఇచ్చిన వరాలు కావు. పోరాడి సాధించుకున్న విజయాలు.
అయితే చరిత్ర ఎప్పుడూ ఒకే దిశలో నడవదు. ప్రపంచం మారుతోంది. అత్యంత వేగంగా, అసమానంగా, కొన్నిసార్లు నిర్దాక్షిణ్యంగా. సాంకేతిక విప్లవాలు, గ్లోబలైజేషన్, విస్తరిస్తున్న మార్కెట్ శక్తులు… ఇవన్నీ కలిసి మన కాలాన్ని కొత్త దిశలో నడిపిస్తున్నాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే నిలిచివుంది. ఈ మార్పులో కార్మికుడి స్థానం ఎక్కడీ ఈ ప్రపంచాన్ని నిర్మిస్తున్న చేతులకు, తమ చెమటతో సంపద సష్టిస్తున్న శరీరాలకు, రోజు గడవడమే పోరాటంగా మారిన జీవితాలకు ఈ అభివృద్ధిలో దక్కుతున్నదెంత?
పని స్వరూపం మారింది. ఉపాధి కొత్త రూపాలు దాల్చింది. కాంట్రాక్ట్ విధానం తెచ్చారు. గిగ్ ఎకానమీ వచ్చింది. ఫ్లెక్సిబుల్ ఉపాధి అంటున్నారు. ఔట్‌సోర్సింగ్, ప్లాట్‌ఫాం ఆధారిత వ్యవస్థలు విస్తరించాయి. కానీ ఈ మార్పుల వెనుక కార్మికుడి జీవితం మాత్రం మారలేదు. అందరికీ పని లేదు. ఉన్న పనికి స్థిరత్వం లేదు. జీవితం కొనసాగుతోంది. భద్రత క్షీణిస్తోంది. పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పనివిధానం నేడు మళ్లీ ప్రశ్నార్థకమైంది. ”సంస్కరణల” ముసుగులో హక్కులు కుదించబడుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఆకాశ హార్మ్యాలు, ఐటీ కారిడార్లు, విస్తరించిన నగరాలు వెలిగిపోతున్నాయి. అదే వెలుగుల కింద కార్మికుల జీవితం చీకట్లో మగ్గుతోంది. డెలివరీ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు ”పార్టనర్లు”గా పిలవబడుతున్నారు. కానీ వారి ఉపాధికి భద్రత లేదు. బీమా లేదు. రేపటికి హామీ లేదు. యాప్‌లు యజమానులుగా మారిన ఈ కాలంలో, మనిషి తన శ్రమపై తానే నియంత్రణ కోల్పోతున్న విరోధాభాసం మన ముందుంది.
ఇది అభివృద్ధి కాదు. అసమానతల పునర్నిర్మాణం. ఒక వైపు కార్పొరేట్ లాభాలు పెరుగుతున్నాయి. మరోవైపు శ్రమ విలువ తగ్గుతోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు. ఇది సమాజంలో అసమానతలను మరింత లోతుగా నాటుతోంది. ఈ పెరుగుతున్న అసమానతల మధ్యే మేడే మనకు ఒక మౌలిక సత్యాన్ని చాటిచెబుతోంది. ఐక్య పోరాటాల ద్వారానే మార్పు సాధ్యమని గుర్తుచేస్తోంది. అయితే ఆ సాధనకు అవసరమైన ఐక్యతే నేడు అనేక ఆటంకాలను ఎదుర్కొంటున్నది. అందుకే నేటి సవాలు కొత్తది. అసంఘటితరంగం విస్తరిస్తోంది. కార్మికవర్గం విభజించబడుతోంది. శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, గిగ్ వర్కర్లు అంటూ కార్మికుల మధ్య నిర్మించిన గోడలు ఐక్యతను బలహీనపరుస్తున్నాయి. ఈ విభజనల మధ్యే పోరాటం కొత్త రూపం దాల్చాల్సిన అవసరం ముందుకొస్తోంది.
ఇది కేవలం పరిస్థితి వివరణ కాదు. ఒక హెచ్చరిక. కార్మికుడు మౌనంగా ఉంటే చరిత్ర మూగబోతుంది. పిడికిలి బిగిస్తేనే కాలం దిశ మారుతుంది. ఈ వ్యవస్థ శ్రమను చులకనగా చూస్తున్నంత కాలం.. మానవ శ్రమను లాభాల కింద కొలుస్తున్నంత కాలం.. మేడే ఒక ముగిసిన రోజు కాదు. మళ్లీ మళ్లీ మొదలయ్యే రోజు. విభజనలతో బలహీనపరచాలనుకునే ఈ కాలానికి ఐక్యతే సమాధానం. అణచివేతకు ప్రతిఘటనే ప్రత్యుత్తరం.చరిత్ర మనకు ఇచ్చిన పాఠం ఒకటే.. హక్కులు అడిగితే రావు. పోరాడితేనే వస్తాయి. పోరాటం ఆగిన చోట హక్కుల ఊపిరి ఆగిపోతుంది. ఐక్యత కూలిన చోట శ్రమ ఓడిపోతుంది. ఇది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఇప్పుడు సమస్త శ్రామికలోకం ముందున్నది ఒకటే ప్రశ్న. నిశ్శబ్దంగా వంగిపోవడమా…లేక నిలబడి పోరాడటమా?
ఏం చేయాలి?
సమాధానం తలవంచని సంకల్పమే.
శ్రామికజన సంగ్రామమే.
అందుకోసం చరిత్ర ఎదురు చూస్తోంది.
రమేష్ రాంపల్లి


