ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
నామినేటెడ్ విధానం తేవాల్సిన అవసరమేంటీ? : తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మెన్ రవీందర్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వం జారీ చేసిన 597 జీవో ద్వారా సహకార సంఘాల పాలక వర్గాల రద్దు సరైంది కాదనీ, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మెన్ కొండూరు రవీందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన పాలకవర్గాలను రద్దు చేసి నామినేటెడ్ విధానాన్ని తేవాల్సిన అవసరమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించగా, గత పాలక వర్గాలను తిరిగి కొనసాగించాలని స్పష్టమైన తీర్పు ఇచ్చిందని వివరించారు. నాలుగు నెలలుగా ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 330 సహకార సంఘాలు కోర్టును ఆశ్రయించాయనీ, ఈ సంఘాల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువగా ఉండి ప్రధానంగా రైతులే సభ్యులుగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది సభ్యులతో రూ.60 వేల కోట్ల వ్యాపారం సహకార వ్యవస్థ ద్వారా నడుస్తోందని వివరించారు. ఎక్కడైనా అవకతవకలు జరిగిన చోట మాత్రమే ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. కానీ మొత్తం వ్యవస్థను రద్దు చేసి నామినేటెడ్ విధానాన్ని తీసుకురావడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలనీ, లేకపోతే అప్పటి వరకు గత పాలక వర్గాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ప్రతినిధులు ఆశోక్, మంజులా రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్, రాజేందర్, పాండు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సహకార సంఘాల పాలకవర్గాల రద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



