ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్‌సేఫ్టీ బ్యూరోతో దిశానిర్దేశం
నాలుగు కమిషనరేట్ల ట్రాఫిక్ డీసీపీలతో డీజీపీ ఆనంద్ సమావేశం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను నియంత్రించడానికి ఆ విభాగం ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలనీ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నూతన డీజీపీ సి.వి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, ఫ్యూచర్‌సిటీలకు చెందిన ట్రాఫిక్ డీసీపీలతో డీజీపీ కీలక సమావేశం నిర్వహించారు. ఔటర్‌రింగ్‌రోడ్డుపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం సీరియస్‌గా ఉన్నారనీ, ఈ ప్రమాదాలను నివారించడానికి పోలీసులు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని సీఎం ఆదేశించినట్టు ఆనంద్ తెలిపారు. ఓఆర్‌ఆర్‌లపై వాహనాలు నిలిపి ఉంచడాన్ని వెంటనే గమనించి వాటిని అక్కడి నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
నగరంలో ఏదేనీ చిన్న రోడ్డు ప్రమాదం జరిగినా.. విపరీతంగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతున్నదనీ, ఆ విషయమై తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వెంటనే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని డీజీపీ సూచించారు. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవర్స్‌పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలనీ, రోడ్డుపై తాగి డ్రైవింగ్ చేస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే భావనను వారిలో కలిగించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ రూల్స్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలనీ, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం, సీటు బెల్టులను పెట్టుకోవడంపై నిశితంగా దృష్టిని సారించి అమలు చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్‌తో సహా నాలుగు కమిషనరేట్ల ట్రాఫిక్ డీసీపీలు రెండు నెలలకోసారి సమావేశమవుతూ ట్రాఫిక్ సమస్యపై ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఎప్పటికప్పుడు కార్యాచరణను రూపొందించుకొని అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో నాలుగు కమిషనరేట్ల ట్రాఫిక్ డీసీపీలు చందనాదీప్తి, రాహుల్ హెగ్డే, కాజోల్, రాహుల్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



