Friday, May 8, 2026
E-PAPER
Homeజాతీయంసందిగ్ధలో ప్రభుత్వ ఆరోగ్య పథకాలు

సందిగ్ధలో ప్రభుత్వ ఆరోగ్య పథకాలు

- Advertisement -

ప్రయివేటు ఆసుపత్రుల విముఖత సామాన్యులకు కార్పొరేట్‌ ‌వైద్యం కష్టమే..!

బెంగళూరు : దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా నిలిచే ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఇప్పుడు సంధిగ్ధంలో పడ్డాయి. ఒకప్పుడు తమ సామాజిక బాధ్యతగా, ఆదాయ వనరుగా భావించిన ప్రభుత్వ పథకాలను కొనసాగించేందుకు దేశంలోని దిగ్గజ ప్రయివేటు ఆసుపత్రులు ఇప్పుడు ఆసక్తి చూపడం లేదు. లాభదాయకత తగ్గడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల్లో విపరీతమైన జాప్యం వంటి కారణాలతో మ్యాక్స్ హెల్త్‌కేర్, నారాయణ హెల్త్, ఫోర్టిస్ వంటి సంస్థలు ఈ పథకాల నుండి నెమ్మదిగా వెనక్కి తగ్గుతున్నాయి. తెలుగు రాష్ర్టాల్లోని అపోలో, యశోధ, కిమ్స్‌ ‌లాంటి పెద్ద ప్రయివేటు హాస్పిటళ్లు ఈ సేవలను ఎప్పుడో నిలిపివేశాయి. ఈ పరిణామం వ్యాపార కోణంలో ఆసుపత్రులకు లాభదాయకంగా ఉండవచ్చు కానీ.. క్షేత్రస్థాయిలో పేద రోగుల పాలిట తీరని నష్టంగా మారుతోంది. ప్రయివేటు ఆసుపత్రులు ఈ సేవల నుంచి వెనక్కి తగ్గడం ద్వారా సామాన్య ప్రజలు ప్రాణాపాయ స్థితిలో కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పెద్ద ఆసుపత్రులు చేర్చుకోవడానికి నిరాకరించడం వల్ల రోగులు ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి తిరగాల్సి వస్తోంది.

ఇది అత్యవసర సమయాల్లో చికిత్స అందక ప్రాణాపాయానికి దారితీస్తోందని రిపోర్టులు వస్తున్నాయి. మరో వైపు రోగులను చేర్చుకున్నా కూడా ప్రభుత్వ పథకం ఉన్నప్పటికీ, మందుల ధరలు లేదా ఇతర సర్వీస్ ఛార్జీల పేరుతో రోగుల నుండి అదనపు వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండే కార్పొరేట్ ఆసుపత్రులు పథకాల నుండి వైదొలిగితే సామాన్యులు సరైన సౌకర్యాలు లేని చిన్న ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తుంది. తద్వారా వారికి నాణ్యమైన వైద్యం శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆసుపత్రుల ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ అసంతృప్తి జ్వాలలకు కారణమవుతున్నాయి. ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ నివేదిక ప్రకారం.. 2027 నాటికి ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. విశాఖపట్నం వంటి నగరాల్లో రాష్ట్ర ఆరోగ్య పథకాల విషయంలో జరిగిన సమ్మెలు ఇప్పటికే వేలాది మంది రోగులకు చికిత్సను దూరం చేశాయి. కొన్ని ఆసుపత్రులైతే ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకోవాల్సిన దుస్థితికి చేరుకు న్నాయని తెలుస్తోంది. కీమోథెరపీ వంటి మందులను కొనుగోలు ధర కంటే తక్కువకు అందించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తుం డటంతో.. ఆరోగ్య భరోసా కల్పించాల్సిన పథకాలు ఇప్పుడు వివాదాలకు వేదికగా మారాయి.

అప్పుల పాలే..!
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఈ ధరల వ్యత్యాసాన్ని, బకాయిల జాప్యాన్ని పరిష్కరించకపోతే ఆర్థిక స్తోమత లేని రోగుల ప్రాణాలకు గ్యారెంటీ లేని పరిస్థితి ఏర్పాడవచ్చని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం పథకాలను ప్రకటించి చేతులు దులుపుకోకుండా.. ఆసు పత్రులకు చెల్లించే ధరలను కాలానుగుణంగా సవరించడం.. బకాయిలను వెంటనే విడుదల చేయడం ద్వారా మాత్రమే ఈ సంక్షోభాన్ని నివారించగలదు. లేనిపక్షంలో అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యం కేవలం కాగితాలకే పరిమితమై.. సామాన్యుడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -