పరీక్షా వ్యవస్థను కుదిపేస్తున్న కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీకేజీలు
తాజాగా రాజస్తాన్‌లో నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీక్
మోడీ సర్కారుపై దేశవ్యాప్తంగా విమర్శల వెల్లువ
వరుస పేపర్ లీక్‌లపై ప్రతిపక్షల ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ-2026 పేపర్ లీక్ వ్యవహారం కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. రాజస్తాన్‌లో పరీక్షకు 42 గంటల ముందే ప్రశ్నలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టినట్టు బయటపడటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దేశవ్యాప్తంగా పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఘటనపై దేశవ్యాప్తగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతు న్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్షను అత్యంత పకడ్బందీ గా నిర్వహించామని చెప్పుకునే యంత్రాంగాలు.. పేపర్ లీక్‌ను ఎందుకు అరికట్టలేకపోయాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్ననారు. పరీక్ష ఏదైనా.. లీక్‌లు మాత్రం కామన్ అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు. అది నీట్ కావచ్చు, మరేదైనా పోటీ పరీక్షైనా కావచ్చు.. లీక్‌లకు అవి అడ్డాలుగా మారుతున్నాయి. ఇప్పటికే 2024లో నీట్ పేపర్ లీక్, గుజరాత్‌లో మాస్ కాపీయింగ్, అంతకుముందు 2015 ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్ (ఏఐపీఎంటీ) స్కామ్ వంటి ఘటనలు వెలుగుచూసినా బీజేపీ ప్రభుత్వాలు మాత్రం అనుభవ పాఠాలు నేర్వలేదు. ‘ఒకే దేశం-ఒకే పరీక్ష?’ అని చెప్పే మోడీ సర్కారు పరీక్షా వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో విఫలమైందనే విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి.
మాఫియాల చేతుల్లోకి పరీక్ష?్ష వ్యవస్థ!
దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష రద్దు కావడం కేవలం ఒక పరీక్ష వైఫల్యం మాత్రమే కాదు.. ఇది దేశ పరీక్షా వ్యవస్థ ఎంతగా మాఫియాల చేతుల్లోకి వెళ్లిపోయిందో చూపించే ఘటన అని విద్యావేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘డిజిటల్ ఇండియా’, ‘పారదర్శక పాలన’ అంటూ కేంద్రం ప్రచారం చేసుకుంటున్నా.. అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల భద్రతను కాపాడటంలో మాత్రం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్తాన్‌లో బయటపడిన తాజా లీక్ వ్యవహారంలో పరీక్షకు ముందే ‘ప్రాక్టీస్ పేపర్’ పేరుతో చక్కర్లు కొట్టిన మెటీరియల్‌లోని వందకు పైగా ప్రశ్నలు ఈనెల 3న జరిగిన నీట్ పరీక్షలో వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసి ప్రశ్నలు విక్రయించిన ముఠాలు విద్యార్థుల భవిష్యత్తునే వ్యాపారంగా మార్చుకున్నాయి.
2024లోనూ నీట్ లీక్ వ్యవహారం
అయితే నీట్ లీక్ వ్యవహారం ఇది మొదటిసారి కాదు. 2024లో జరిగిన నీట్ యూజీ పరీక్ష కూడా దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసింది. బీహార్‌లో ‘సాల్వర్ గ్యాంగ్’ ద్వారా ముందుగానే ప్రశ్నపత్రం లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసి ప్రశ్నలు అందించారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పాట్నాలో పోలీసులు కాల్చివేసిన ప్రశ్నపత్రాలు, మొబైల్ ఫోన్లు, అడ్మిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆ కేసును తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది.
లీక్‌లకు కేంద్రాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు..
నష్టపోతున్న విద్యార్థులు, అభ్యర్థులు
ఒక్క నీట్ మాత్రమే కాదు.. ఇతర ప్రవేశ, పోటీ పరీక్షలకు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే అడ్డాగా మారాయి. గతంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని గోద్రాలో ఓ పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ల సహకారంతో మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలతో పలువురిని అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ‘పరీక్ష పవిత్రత దెబ్బతింది’ అని వ్యాఖ్యానించింది. సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను చూపించిందని మేధావులు చెప్పారు. ఇక ఇంకా వెనక్కి వెళ్తే.. 2015లో నీట్‌కు ముందు నిర్వహించిన ఏఐపీఎంటీ పరీక్ష కూడా దేశవ్యాప్తంగా లీక్ స్కామ్‌తో రద్దయింది. బ్లూటూత్ పరికరాల ద్వారా జవాబులు పంపిన రాకెట్ బయటపడటంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. అప్పటినుంచి ఇప్పటివరకు పరీక్షా మాఫియాలు మరింత బలపడినట్టే కనిపిస్తున్నాయి కానీ వ్యవస్థ మాత్రం బలపడలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక మరో బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో పోలీస్ నియామక పరీక్ష లీక్, గుజరాత్‌లో జూనియర్ క్లర్క్ పరీక్ష స్కామ్‌లు కూడా కొన్ని ఉదాహరణలు. దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం విదితమే. ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షల అవకతవకలు వరుసగా వెలుగుచూస్తూనే ఉన్నాయి.
కేంద్రంపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల ఆగ్రహం
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుస పేపర్ లీక్‌లు, నియామక కుంభకోణాలు పదేపదే బయటపడుతుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతుంటే.. కొందరు డబ్బుతో ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి వ్యవస్థను మోసం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని ముందుగానే పసిగట్టాల్సిన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పరీక్షలు రద్దవుతున్నా, మళ్లీ నిర్వహిస్తున్నా.. విద్యార్థుల మానసిక ఒత్తిడి, కోచింగ్‌ల కోసం ఖర్చు చేసిన డబ్బు, వృథా అవుతున్న సంవత్సరాలపై ప్రభుత్వాలు స్పందించడం లేదననే ఆవేదన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్ష?లకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం బాధ్యతను విస్మరించడం ఆందోళనకరం
”ఒక దేశం, ఒక పరీక్ష” అంటూ పరీక్షలను కేంద్రీకరించిన మోడీ సర్కారు.. వాటి భద్రత, పారదర్శకత, నమ్మకాన్ని మాత్రం కాపాడలేకపోయిందనే విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. పరీక్షా వ్యవస్థను కాపాడాలంటే కేవలం అరెస్టులు కాదు.. అందుకు బాధ్యతను కూడా తీసుకోవాల్సి ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఇటు లీక్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బీజేపీ పాలిత రాష్ట్రాలు అందుకు సిద్ధపడకపోవడం ప్రజాస్వామ్య దేశంలో ఒక ఆందోళనకరమైన విషయమని అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పోరాటాలను మరింత ఉధతం చేయాలని సూచిస్తున్నారు. ?
నీట్ పేపర్ లీక్‌తో దేశవ్యాప్తంగా కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



