Wednesday, May 13, 2026
E-PAPER
Homeజాతీయంకార్పొరేట్‌ ఆస్పత్రుల రోబోటిక్‌ దందా

కార్పొరేట్‌ ఆస్పత్రుల రోబోటిక్‌ దందా

- Advertisement -

అధిక ఖర్చుతో కూడిన వైద్యం వెనుక వ్యాపార ప్రయోజనాలు
ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీపై వైద్య నిపుణుల హెచ్చరికలు..శిక్ష‍ణలో లోపాలు, ఇన్సూరెన్స్‌ ‌పరిమితులు, రోగుల భద్రతపై ఆందోళనలు

మహారాష్ట్రలో సాధారణ హెర్నియా ఆపరేషన్‌కు రోబోటిక్ సర్జరీని చేయడం ద్వారా భారత్‌‌లో వేగంగా విస్తరిస్తున్న రోబోటిక్ వైద్య వ్యవస్థపై పెద్ద చర్చ a. క్లిష్టమైన కొన్ని శస్త్రచికిత్సల్లో ఉపయోగకరంగా చెప్పబడుతున్న ఈ సాంకేతికతను, సాధారణ ఆపరేషన్లకూ ప్రయివేటు ఆస్పత్రులు అధిక ఖర్చుతో రోగులపై మోపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ పెట్టుబడులను తిరిగి రాబట్టాలనే కార్పొరేట్ ఒత్తిళ్లు, సరైన శిక్షణ లేకపోవడం, ఇన్సూరెన్స్ పరిమితులు, కొన్ని విషాదకర వైద్య ఘటనలు కలిసి రోబోటిక్ సర్జరీల భద్రత, అవసరం, పారదర్శకతపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతున్నాయి. భారత్‌‌లో ప్రయివేటు ఆస్పత్రులు అధిక 
ఖర్చుతో కూడిన రోబోటిక్‌ ‌విధానాలను రోగులపై మోపుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

​రోబోటిక్‌ ‌సర్జరీ అంటే ఏమిటీ?
రోబోటిక్‌ ‌సర్జరీలో రోబో ‌స్వయంగా ఆపరేషన్‌ ‌చేయదు. శస్త్రచికిత్స నిపుణుడు కంప్యూటర్‌ ‌కన్సోల్‌ ‌ముందు కూర్చొని రోబోటిక్‌ ‌సిస్టమ్‌‌ను నియంత్రిస్తాడు. ఆ సిస్టమ్‌ శరీరంలో చిన్న రంధ్రాల ద్వారా ప్రవేశించి కట్‌ ‌చేయడం, కుట్లు వేయడం వంటి పనులు చేస్తాయి. అయితే వైద్యులు చెప్తున్నదానిని బట్టి.. ఇది పూర్తిగా వైద్యుడి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. రోబోటిక్‌ ‌సిస్టమ్‌ 3డీ హై డెఫినిషన్‌ ‌దృశ్యాన్ని ఇస్తుంది. చిన్న రక్తనాళాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. క్లిష్టమైన క్యాన్సర్‌, పెల్విక్‌, గైనకాలజీ శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం హెర్నియా, ఫైబ్రాయిడ్‌, సాధారణ హిస్టరెక్టమీ వంటి అనేక శస్త్రచికిత్సలకు సాధారణ లాపరోస్కోపీ చాలు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనికి తక్కువ ఖర్చు, తక్కువ సమయం మాత్రమే పడుతుందనీ, ఫలితాలు రోబోటిక్‌‌కు విధానంతో సమానంగా ఉంటాయని చెప్తున్నారు. అయితే కొన్ని ఆస్పత్రులు లాభార్జనే ధ్యేయంగా పని చేస్తూ రోగులపై భారం పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆపరేషన్లలో వైద్యుడికి శారీరక ఒత్తిడి తగ్గుతుందని డాక్టర్లు, నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రతీ ఆపరేషన్‌‌కూ అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్‌‌నకు చెందిన సూర్యభాన్‌ ‌సంభార్కర్‌‌ (52)కు హెర్నియా శస్త్రచికిత్సను ముంబయిలో ఉన్న ఓ వైద్యుడు రోబోటిక్‌ ‌వ్యవస్థ ద్వారా నిర్వహించారు. దీనిని వైద్య సదస్సులో గొప్ప సాంకేతిక పురోగతిగా చూపించారు. కానీ తర్వాత పలువురు వైద్య నిపుణులు ఇది సాధారణ హెర్నియా కేసు మాత్రమేననీ, రోబోటిక్‌ ‌సర్జరీ వల్ల అదనపు ప్రయోజనం ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనతో భారత్‌‌లో వేగంగా పెరుగుతున్న రోబోటిక్‌ ‌సర్జరీల అవస రం, ఖర్చు, భద్రతపై పెద్ద చర్చకు దారి తీసింది.

​భారీ ఖర్చులు.. రోగులపై భారం
ఒక రోబోటిక్‌ ‌సిస్టమ్‌ ‌ధర రూ.20 కోట్లకు పైగా ఉంటుంది. వార్షిక నిర్వహణ ఖర్చు సుమారు రూ. కోటిగా ఉంటుంది. దీంతో ఆస్పత్రులు రోబోటిక్‌ ఆపరేషన్లు పెంచాలని ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సాధారణ లాపరోస్కోపీ కంటే రోబోటిక్‌ ‌సర్జరీకి రూ. లక్ష‍ నుంచి రూ.10 లక్ష‍ల వరకు అదనపు ఖర్చు వస్తుంది. ఉదాహరణకు సాధారణ హెర్నియా లాపరోస్కోపీ సుమారు రూ.1.5 లక్ష‍లుగా ఉంటే, రోబోటిక్‌ ‌హెర్నియా సర్జరీ రూ.2.5 లక్ష‍లు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆర్థోపెడిక్ రోబోటిక్ వ్యవస్థల్లో అయితే ఆస్పత్రులు అదే కంపెనీ ఇంప్లాంట్లు ఉపయోగించాల్సి రావడం వల్ల ఖర్చు ఇంకా పెరుగుతోందని వైద్యులు అంటున్నారు.

​శిక్ష‍ణపై తీవ్ర ఆందోళనలు
రోబోటిక్ సర్జరీ శిక్షణపై ఆందోళనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా దీనికి ఒకే విధమైన ప్రమాణాలు లేవు. కొన్ని కంపెనీలు కొన్ని రోజులు మాత్రమే శిక్ష‍ణ ఇస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైద్యలు ఆన్‌‌లైన్‌ ‌కోర్సులు, సిమ్యులేటర్‌ ‌సెషన్లతోనే సర్టిఫికేషన్‌ ‌పొందుతున్న పరిస్థితులు ఉన్నాయి. సరైన అనుభవం లేకపోయినా ఆస్పత్రులు ఆపరేషన్లు చేయడానికి అనుమతిస్తున్నాయని ఆరోపణలు సైతం ఉన్నాయి. రోగులు డాక్టర్‌‌కు నిజంగా ఎంత అనుభవం ఉందో తెలుసుకునే మార్గం లేదు. ‘‘నేను ఇంకా పూర్తి నమ్మకంతో రోబోటిక్‌ ఆపరేషన్‌ ‌చేయలేను. అయినా నా ఆస్పత్రి నన్ను అనుమతిస్తోంది’’ అని ఒక గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ ‌సర్జన్‌ ‌చెప్పడం గమనార్హం.

​ఉజ్వల్‌ ‌చౌధరి కేసు విషాదాంతం
యూపీలోని కౌశాంబికి చెందిన 35 ఏండ్ల ఉజ్వల్‌ ‌చౌధరికి పెద్ద అంబిలికల్‌ ‌హెర్నియా ఉండటంతో రోబోటిక్‌ ‌సర్జరీ చేయాలని ఓ ఆస్పత్రి వైద్యులు సూచించారు. నొప్పి తక్కువగా ఉంటుందనీ, త్వరగా కోలుకుంటారనీ, అధిక బరువు ఉండటంతో రోబోటిక్‌ ‌విధానం మంచిదని సదరు ఆస్పత్రి వైద్యులు ఉజ్వల్‌ ‌చౌధరి కుటుంబానికి చెప్పారు. కానీ ఆపరేషన్ సమయంలో పేగు కోసుకుపోయిందని వైద్యులు వెల్లడించడం గమనార్హం. తర్వాత ఉజ్వల్‌‌కు మరో అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల్లోనే చౌధరి మరణించాడు. మృతుడి కుటుంబం ఇప్పుడు వైద్య మండలిని ఆశ్రయించింది. న్యాయస్థానాల్లో కేసులు వేసింది. వారి ఆరోపణలు ఏమిటంటే… డాక్టర్‌కు సరైన శిక్షణ ఉందా? ఆస్పత్రి పర్యవేక్షణ సరైనదా? రోగికి ప్రమాదాలను పూర్తిగా వివరించారా?. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.

​ఇన్సూరెన్స్ కంపెనీల అనుమానాలు
భారతీయ బీమా నియంత్రణ సంస్థ ఆదేశాల ప్రకారం రోబోటిక్‌ ‌సర్జరీలకు ఇన్సూరెన్స్‌ ఇవ్వాల్సి ఉన్నా.. కంపెనీలు పలు పరిమితులు పెడుతున్నాయి. చాలా పాలసీలు మొత్తం బీమాలో 50 శాతం వరకే రోబోటిక్‌ ‌చికిత్సను కవర్‌ ‌చేస్తున్నాయి. పూర్తి కవరేజ్‌ ‌కావాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నాయి. అవసరం లేని రోబోటిక్‌ ‌విధానాలను బీమా కంపెనీలు అనుమానంతో చూస్తున్నాయి. ముంబయిలో ఒక బ్లాడర్ క్యాన్సర్ రోగికి రూ.13 లక్షల బిల్లు వచ్చినా, ఇన్సూరెన్స్ కంపెనీ కేవలం రూ.3.5 లక్షలు మాత్రమే చెల్లించడం గమనార్హం. అయితే రోబోటిక్‌ ‌సర్జరీ అనేది ఒక ఆధునిక సాంకేతిక సాధనమనీ, క్లిష్టమైన కొన్ని ఆపరేషన్లలో ఇది నిజంగా ఉపయోగకరమనీ, కానీ ప్రతి శస్త్రచికిత్సకూ ఇది అవసరం కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -