ప్రధాని పొదుపు
మంత్రం ఫలితం
వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతున్న గ్యాస్ ఏజెన్సీలు
ఐటీ రిటర్న్‌లు ఆధారంగా గుర్తింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మొన్నటికి మొన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకుంటూ ప్రధాని నరేంద్రమోడీ ‘పొదుపు మంత్రం’ వల్లించి వెళ్లిన సంగతి తెలిసిందే. దాన్ని సామాన్య ప్రజలు ‘దిల్’ మీదికి తీసుకున్నారో లేదో తెలీదు కానీ, ఆయిల్ కంపెనీలు మాత్రం సీరియస్‌గానే తీసుకున్నాయి. గహ వినియోగదారులకు ఇస్తున్న సిలిండర్లపై సబ్సిడీని ఎత్తేయాలని భావించి, ప్రధాని ‘పొదుపు మంత్రం’ను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్న వినియోగదారులకు ‘మీ సబ్సిడీని ఎత్తేస్తున్నాం’ అని ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపుతున్నాయి. దీనితో కంగారు పడిన గ్యాస్ వినియోగదారులు డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ‘మేం సబ్సిడీ ఇవ్వం. మీక్కావాలంటే మీరే మమ్మల్ని సంప్రదించండి’ అని కూడా ఆ ఎస్‌ఎమ్‌ఎస్‌ల్లో పేర్కొనడం గమనార్హం! అంటే ప్రజల అర్హతకు కేంద్రం పెడుతున్న పరీక్ష?గా ఇది అర్థమవుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం ఈ పిడుగును వేసేందుకు సిద్ధమైంది.
ఈ కసరత్తును చమురు కంపెనీలు వేగవంతం చేస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ బుకింగ్, సరఫరాల్లో సవాలక్ష? షరతులు, నిబంధనలు విధించిన కేంద్రం ఇప్ఫుడు అరకొరగా ఇస్తున్న సబ్సిడీకి కూడా ఎగనామం పెట్టేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే చమురు కంపెనీలు ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు పైబడి ఉన్న వినియోగదారుల సబ్సిడీలనే ఎత్తివేస్తున్నామని చెప్తున్నాయి. దీనికి ఆదాయపన్ను దాఖలు (ఐటీ రిటర్నులు)ను ఆధారం చేసుకుంటున్నాయని సమాచారం. ఐటీ రికార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా లబ్ధిదారులను సులభంగా గుర్తిస్తున్నారు. ఈ నిబంధన పరిధిలోకి వచ్చే వినియోగదారులకు ఇప్పటికే వారి వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు చమురు కంపెనీల నుంచి మెసేజ్‌లు వెళ్లాయి. మీ ఆదాయం రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉందని, కాబట్టి సబ్సిడీ నిలిపివేస్తున్నామని ఆ మెసేజ్‌లలో గ్యాస్ కంపెనీలు పేర్కొంటున్నాయి.
అభ్యంతరాలు చెప్పొచ్చు
చమురు కంపెనీల నిర్ణయంతో ఏకీభవించని వారు, తమ ఆదాయం పరిమితి రూ.10 లక్షల లోపే ఉందని భావించే వారు వారం రోజుల్లోగా సదరు ఎస్‌ఎమ్‌ఎస్‌లకు స్పందించాలి. లేకుంటే ఆటోమోడ్‌లో ఆ మెసేజ్‌ను వినియోగదారుడు అంగీకరించినట్టే భావిస్తారు. అభ్యంతరాలను సంబంధిత చమురు కంపెనీ టోల్ ఫ్రీ నంబర్‌కు, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే, సబ్సిడీ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అయితే కేంద్రం ఇస్తున్న గ్యాస్ సబ్సిడీ సొమ్మును నాలుగేండ్ల క్రితమే నిలిపివేశారనీ, కేవలం దీపం పథకం లబ్దిదారులకు మాత్రమే ఇస్తున్నారని డీలర్లు చెప్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మాత్రమే వస్తున్నదని వివరణ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు చాలా మంది వినియోగదారులకు ‘సబ్సిడీ కట్’ మెసేజ్‌లు రావడం ఆందోళనలకు గురిచేస్తున్నాయని డీలర్లు చెప్తున్నారు. భవిష్యత్తులో సబ్సిడీని పూర్తిగా ఎత్తేసే ఆలోచనలో కేంద్రం ఉండొచ్చనీ, వినియోగదారుల వడపోత ప్రక్రియను వేగవంతం చేసేందుకే చమురు కంపెనీలు ఈ హడావిడి చేస్తుండవచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం గమనార్హం.



