– టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : ప్రధాని మోడీ అన్ని విషయాల్లోనూ ప్రజల నడ్డి విరుస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర విమర్శించారు. ఇటీవల పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రజలనుద్దేశించి చేసిన సూచనలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ… కేంద్రంలోని మోడీ సర్కారు బంగారంపై 10 శాతం సుంకాలను విధించిందని గుర్తు చేశారు. అదే విధంగా వెండిపై 5 శాతం సుంకం విధించారని పేర్కొన్నారు. వంట నూనెలు తక్కువగా వాడుకోవాలని చెప్పిన ప్రధాని.. సగటు పౌరుల వంటిట్లో మంట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలంటూ ప్రజలకు చెప్పటం కాదు.. ముందు వాటి ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కానీ ప్రధాని వ్యవహారశైలి చూస్తుంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం ఖాయంగా కనబడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలున్నప్పుడు ఒక మాట.. ఎన్నికల తర్వాత మరో మాట చెప్పటం మోడీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకే అనుకూలంగా ఉంటాయని చెప్పారు. ఈ విషయాలన్నింటనీ గమనించి, సరైన సమయంలో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని రవిచంద్ర ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజల నడ్డి విరుస్తున్న ప్రధాని మోడీ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



