వెదిరె పూలమ్మ పౌండేషన్ సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
నవతెలంగాణ – మునుగోడు
పదవ తరగతి ఫలితాలలో కొంపెల్లి పాఠశాల విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించేందుకు విద్యార్థులు కష్టంతోని కాదు ఇష్టంతోని చదవాలని వెదిరె పూలమ్మ పౌండేషన్ వైస్ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండలంలోని కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వెదిరె పూలమ్మ పౌండేషన్ సహకారంతో స్టడీ మెటీరియల్ ను గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ, ప్రధానోపాధ్యాయులు గూడపూర్ వెంకటనారాయణ తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా విజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుదలతో పెట్టుకున్న లక్ష్యం చేరుకోవాలని సూచించారు. విద్యార్థుల విజయం వెనక ఉపాధ్యాయుల కృషి ఉన్నప్పుడే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని అన్నారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ తమ ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయపర్తి ప్రసాద్ ,సంకు శంకర్ , వీరమల్ల నాగరాజు ఉపాధ్యాయుల బృందం తదితరులున్నారు.



