నవతెలంగాణ-మునిపల్లి: మెదక్ జిల్లా మండలంలోని కంకోలు వద్ద గల వొక్సన్ యూనివర్సిటీలో చోరీ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్సై రాజేష్ నాయక్ పేర్కొన్నారు. కంకోలు వద్ద గల వొక్సన్ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్దుకు 20 వేల రూపాయలు చెల్లించి.. అతని సహకారంతో యూనివర్సిటీలోకి ప్రవేశించి ఎలక్ట్రిక్ వైర్ బాక్సులు సీలింగ్ ఫ్యాన్లు వంట సామాగ్రిని చోరీ చేశారని చెప్పారు.
కేతావత్ పద్మ, రమావత్ జ్యోతి,నేనావత్ విజయ,మూడవత్ లక్ష్మి, నేనావత్ అనిత, వాహన డ్రైవరు నెనావత్ చందర్ లపై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. చోరి చేసిన సొత్తును హైదరాబాద్ ఉప్పల్‌లోని సభావత్ భారతి ఆమె భర్త సత్తయ్యతో పాటు మరో స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ ఖదీర్ అనే వ్యక్తికి సొత్తును విక్రయించారని ఆయన పేర్కొన్నారు. స్టోర్ ఇంచార్జ్ శ్రీశైలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి ఒక లక్ష డెబ్భై ఐదు వేల రూపాయల నగదు 10 లక్షల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును త్వరగా చేధించిన ఎస్సైని, పోలీసు సిబ్బందిని, కొండాపూర్ సీఐ సుమంత్ కుమార్, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ అభినందించారు.



