Saturday, January 24, 2026
E-PAPER
Homeఆటలుహైదరాబాద్‌ ఎదురీత

హైదరాబాద్‌ ఎదురీత

- Advertisement -

రాహుల్‌ సింగ్‌, హిమతేజ పోరాటం
ద్వి శతకంతో మెరిసిన సర్ఫరాజ్‌ ఖాన్‌
ముంబయి తొలి ఇన్నింగ్స్‌ 560/10

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ముంబయితో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఎదురీదుతోంది. ఓపెనర్లు అభిరాత్‌ రెడ్డి (4), ఆమన్‌ రావు (7) నిరాశపరచగా.. ఆరంభంలోనే ఆతిథ్య జట్టు ఇరకాటంలో పడింది. ఈ సమయంలో రాహుల్‌ సింగ్‌ (82 నాటౌట్‌, 129 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), కొడిమెల హిమతేజ (40 నాటౌట్‌, 84 బంతుల్లో 6 ఫోర్లు) మూడో వికెట్‌కు అజేయంగా 100 పరుగులు జోడించారు. దీంతో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో 138/2తో పోరాడుతోంది. ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డి మ్యాచ్‌లో తొలుత ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 560 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

సర్ఫరాజ్‌ ఖాన్‌ (227, 219 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లు) ద్వి శతకంతో చెలరేగాడు. సిద్దేశ్‌ లాడ్‌ (104, 179 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. సువేద్‌ పార్కర్‌ (75, 98 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), అథర్వ (35) రాణించారు. 123.2 ఓవర్లలో 560 పరుగులకు ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. హైదరాబాద్‌ బౌలర్లలో రక్షణ్‌ రెడ్డి (4/107), రోహిత్‌ రాయుడు (2/123) రాణించారు. మహ్మద్‌ సిరాజ్‌ (1/106), చామ మిలింద్‌ (0/73), నితిన్‌ సాయి యాదవ్‌ (1/136) నిరాశపరిచారు. రెండో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 422 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది. హైదరాబాద్‌ బ్యాటర్లు నేడు అద్భుతం చేస్తే తప్ప, ముంబయి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కించుకోవటం లాంఛనమే!.

బౌలింగ్‌ పేలవం! : భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ రంజీ ట్రోఫీ బరిలో నిలువటంతో పాటు హైదరాబాద్‌కు కెప్టెన్సీ వహించటంతో ఆతిథ్య జట్టు ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రత్యర్థి బలమైన ముంబయి అయినప్పటికీ.. మహ్మద్‌ సిరాజ్‌, చామ మిలింద్‌ సారథ్యంలోని పేస్‌ విభాగం విఫలమైంది. సిరాజ్‌ కొత్త బంతితో, పాత బంతితో ఆశించిన ప్రభావం చూపించలేదు. 25 ఓవర్లలో 4.24 ఎకానమీతో 106 పరుగులు ఇచ్చిన సిరాజ్‌ ముంబయి బ్యాటర్లపై ఏమాత్రం ఒత్తిడి పెంచలేదు. మరో సీనియర్‌ పేసర్‌ చామ మిలింద్‌ సైతం 19 ఓవర్లలో ఒక్క వికెట్‌ పడగొట్టలేదు. వికెట్లు పడగొట్టిన రక్షణ్‌ రెడ్డి, నితిన్‌ సాయి యాదవ్‌లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. సిరాజ్‌ వికెట్ల వేటలో ముందుండి.. సహచర బౌలర్లలో స్ఫూర్తి నింపటంలో నిరాశపరిచాడు. ఫలితంగా ముంబయి భారీ స్కోరు చేయగా.. హైదరాబాద్‌ కనీసం తొలి ఇన్నింగ్స్‌ లోటు ఎక్కువ ఉండకుండా ఉండేందుకు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓపెనర్లు అభిరాత్‌ రెడ్డి, అమన్‌ రావులు ఇటీవల మంచి ప్రదర్శన చేశారు. కానీ కొత్త బంతిని ఎదుర్కొని ఎంతోసేపు వికెట్‌ కాపాడుకోలేదు. ఫలితంగా హైదరాబాద్‌ ఆరంభంలోనే కష్టాల్లో కూరుకుంది. మూడో రోజు ఆటలో మ్యాచ్‌ గమనం ఎటో తేలనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -